Advertisement
Advertisement
Abn logo
Advertisement

వారికేది ‘ఆసరా’? : KCRపై రాములమ్మ ధ్వజం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పాత లబ్దిదారులకే ఆసరా పెన్షన్లు సకాలంలో ఇవ్వడం లేదని.. ఇక కొత్త ఆసరా పెన్షన్ల ఊసే ఎత్తడం లేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. ఆసరా పెన్షన్ల కోసం లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి కనీసం వెరిఫికేషన్ కూడా మొదలు పెట్టలేదని ఆమె ధ్వజమెత్తారు. వీటి సంగతి ఇలా ఉంటే.. వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలకు కూడా ప్రభుత్వం కొత్తవి మంజూరు చేయట్లేదని రాములమ్మ వాపోయారు.‘‘రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్ల అంశాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది. అర్హత గల ఎంతో మంది వృద్దులు పంచాయితీ సెక్రటరీల ద్వారా ఎంపీడీఓలకు అప్లికేషన్ పెట్టుకుని మూడేళ్లుగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. 57 ఏండ్లు నిండినోళ్లకు ఆగస్టు నుంచే ఆసరా పెన్షన్లు ఇస్తామని జులై నెలలో సిరిసిల్ల పర్యటనలో సీఎం కేసీఆర్ ప్రకటించినా.. హడావిడిగా అదే నెల 15 నుంచి 31 వరకు మీ-సేవ కేంద్రాల ద్వారా సుమారు 9.5 లక్షల దరఖాస్తులు స్వీకరించారు. కానీ.. గడువు ముగిసి నెల రోజులవుతున్నా వెరిఫికేషన్ మొదలుపెట్టలేదు. ఆగస్టులో ఇస్తామన్న పెన్షన్​ అక్టోబర్‌లోనూ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. 

పాత లబ్ధిదారులు 37 లక్షల మందికే ప్రతి నెలా 15, 20 రోజుల ఆలస్యంగా డబ్బులిస్తున్న రాష్ట్ర సర్కార్... కొత్తగా సుమారు మరో 15 లక్షల మందికి మరో రూ.350 కోట్లు ఇవ్వడం ఇబ్బందని భావించి వాటి ఊసెత్తడం లేదు. 2018 సెప్టెంబర్​లో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పటి నుంచి కొత్త పింఛన్ల మంజూరు ఆగిపోయింది. అసలు 57 ఏండ్లు నిండినోళ్లకు పెన్షన్​ సంగతి పక్కనపెడితే... వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలకు కూడా ప్రభుత్వం కొత్తవి మంజూరు చేయట్లేదు. అప్పట్లో 65 ఏళ్లు నిండి, ప్రస్తుతం 67, 68 ఏళ్లకు వచ్చిన వృద్ధులకూ మంజూరు చేయలేదంటే ప్రభుత్వం వృద్ధుల పట్ల ఎలాంటి వైఖరితో ఉందో ఇట్టే అర్దమవుతుంది. ప్రస్తుతం పెన్షన్​ తీసుకుంటున్న వాళ్లలో వివిధ కారణాలతో నెలనెలా నాలుగైదు వేల మంది చనిపోతున్నారు. వీరి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారు. 

ఇలా ఏటా 50 వేల నుంచి 60 వేల మంది చొప్పున మూడేళ్లలో సుమారు 1.70 లక్షల మందిని జాబితా నుంచి తీసేసిన ప్రభుత్వం... వీరి స్థానంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు. ఈటల రాజీనామాతో హుజూరాబాద్​లో ఉప ఎన్నిక షురూ కాగా... అక్కడ జులైలోనే సర్కారు కొత్త పెన్షన్లు మంజూరు చేసింది. పెండింగ్​లో ఉన్న వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళలు,  50 ఏండ్లు నిండిన గీత, చేనేత కార్మికులకు పెన్షన్లు మంజూరయ్యాయి. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలలో వెరిఫికేషన్ పూర్తయి ఆన్​లైన్​లో ఉన్నా.. ప్రభుత్వం మాత్రం మంజూరు చేయడం లేదంటే కేవలం హుజురాబాద్ ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను మోసగించడమే తప్ప మరొకటి కాదని స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా ఓట్ల కోసం టీఆర్ఎస్ సర్కార్ చేసే జిత్తులను, అబద్దాల హామీలను యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో తగిన బుద్ది చెబుతారు’’ అని రాములమ్మ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement