సహృదయ సాహితీ విమర్శకుడు

ABN , First Publish Date - 2022-04-09T06:09:54+05:30 IST

రామ్మోహన్ రాయ్ నిరంతర చదువరి. క్లాస్ ఉంటే పాఠం చెప్పడానికి వెళ్లేవారు. లేదంటే ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉండేవారు. మిగిలిన స్టాఫ్ మెంబర్స్ అప్పటికే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులతోనో లేదా మరో వ్యాపార వ్యాపకంతోనో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఈయన మాత్రం ఎప్పుడూ పుస్తకాలతోనే ఉండేవారు....

సహృదయ సాహితీ విమర్శకుడు

రామ్మోహన్ రాయ్ నిరంతర చదువరి. క్లాస్ ఉంటే పాఠం చెప్పడానికి వెళ్లేవారు. లేదంటే ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉండేవారు. మిగిలిన స్టాఫ్ మెంబర్స్ అప్పటికే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులతోనో లేదా మరో వ్యాపార వ్యాపకంతోనో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఈయన మాత్రం ఎప్పుడూ పుస్తకాలతోనే ఉండేవారు. నిజానికి రాయ్ దగ్గర చదువుకున్నప్పటికంటే కలసి పని చేసిన స్వల్పకాలంలో ఆయన నుంచి నేను ఎక్కువగా నేర్చుకున్నాను. సాధారణంగా ఆధునిక తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసే విద్యార్థులకు నారాయణరెడ్డి ‘ఆధునికాంధ్ర కవిత్వము- సంప్రదాయములు- ప్రయోగములు’ పుస్తకాన్ని కరదీపికగా భావిస్తుంటారు. అయితే దీనికి అనుబంధంగా లేదా కొంత కొనసాగింపుగా కడియాల వారి ‘తెలుగు కవితావికాసము (1947-–1980)’ ఉంటుంది.


ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురించిన ఈ పుస్తకానికి ముందుమాట రాస్తూ ‘సమకాలీన కవిత్వాన్ని అంచనా వెయ్యబోవడం సాహసమే. కానీ భావి సాహిత్య చరిత్రకారులకు, సహృదయులకు ముందు ముందు ఈ గ్రంథం ఏమాత్రం ఉపయోగపడినా నా కృషి వ్యర్థం కాలేదని భావిస్తాను. కవిత్వంలో లాగే విమర్శలో కూడా విమర్శకుని ఆత్మీయత ద్యోతకం కాక తప్పదు. సమకాలీన కవులపై నా అభిప్రాయాలు వ్యక్తులపై రాగద్వేషాలతో కూడుకున్నవి కావు. కేవలం కవిత్వాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని రచించానని మనవి’ అని ఆయన అంటారు. ఈ నాలుగు వాక్యాల వల్ల రామ్మోహన్ రాయ్ విమర్శనా దృక్పథం ఎటువంటిదో మనకు స్పష్టమవుతుంది.


శ్రీశ్రీ అంటే మాస్టారికి తరగని ప్రేమ. ఆ కారణంగానే ‘తెలుగు సాహిత్యంపై మహాకవి శ్రీశ్రీ ప్రభావం’ అనే విమర్శనాత్మక గ్రంథం, అలాగే ‘శ్రీశ్రీతో ముఖాముఖి’ అనే పుస్తకాన్ని ప్రచురించారు.‘ తెలుగు కవితావికాసము’కు కొనసాగింపుగా ‘ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు కవిత్వం’ ప్రచురించారు. దాదాపు ఈ రెండు కవిత్వ విమర్శ గ్రంథాల వల్ల పాఠకుడు కానీ లేదా సాహిత్యవిద్యార్థి ఆధునిక కవిత్వం పట్ల సమగ్రమైన అవగాహన ఏర్పరుచుకునే అవకాశం ఉంటుంది. ‘సహృదయ వ్యాససంపుటి’, ‘తెలుగు పద్యం సమగ్ర పరిశీలన’ లాంటి విమర్శ గ్రంథాలు సాహిత్య విమర్శకునిగా తెలుగు సాహిత్యంలో ఆయన స్థానమేమిటో తెలియజేస్తాయి. యుజిసి ప్రోత్సాహంతో ‘నూరు తెలుగు నవలలు విశ్లేషణ’ అనే అంశం మీద, 1961 నుండి 2010 వరకు ‘తెలుగు నాటకరంగ పరిణామము, సమాజంపై నాటకరంగ ప్రభావం’ అనే అంశం మీద ప్రాజెక్ట్ వర్క్ చేశారు.


నవలల మీద చేసిన పరిశోధన అజో–విభో పౌండేషన్ వారు ‘మన తెలుగు నవలలు’ పేరుతో ఒక పుస్తకం ప్రచురించారు. కవిత్వం పట్ల లోతైన అవగాహనతో పాటు వర్తమాన కవిత్వంపై కూడా ఎంతో అనురక్తి కలిగి ఉండేవారు కడియాల. వందకుపైగా సాహిత్యవ్యాసాలు, 600కు పైగా గ్రంథ సమీక్షలు, వందకు పైగా రేడియో ప్రసంగాలు చేసిన ఈయన దాదాపు ఒక దశాబ్దం పాటు ప్రతి సంవత్సరం వివిధ పత్రికలలో ప్రచురితమైన కవిత్వాన్ని, కవితా సంపుటులను విశ్లేషణ చేస్తూ వ్యాసాలు రాశారు. రచయిత పట్ల రాగద్వేషాల తో కాక రచనను ఆమూలాగ్రం పరిశీలించి తన అభిప్రాయాలను తెలియజేసే సహృదయ విమర్శకులు రామమోహనరాయ్. ఆయన స్నేహ సంపన్నుడు. మృదుభాషి. నవ్వుతూ మాత్రమే మాట్లాడటం ఆయన తత్వం. తెలుగు సాహిత్య విమర్శ లోకానికి ఆయన లేని లోటు తీర్చలేనిది. వారికి నా నివాళి

- బండ్ల మాధవరావు






Updated Date - 2022-04-09T06:09:54+05:30 IST