జగన్ సీఎం అయిన తర్వాత దిగజారిపోతున్న ప్రజాస్వామ్య విలువలు: రామ్మోహన్ నాయుడు

ABN , First Publish Date - 2021-11-22T20:27:29+05:30 IST

జగన్ సీఎం అయిన తర్వాత ప్రజాస్వామ్య విలువలు దిగజారి పోతున్నాయని రామ్మోహన్ నాయుడు విమర్శించారు.

జగన్ సీఎం అయిన తర్వాత దిగజారిపోతున్న ప్రజాస్వామ్య విలువలు:  రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రజాస్వామ్య విలువలు దిగజారి పోతున్నాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దేవాలయం లాంటి అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక జగన్ పాత్ర ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రికి నిజంగా మహిళలపై గౌరవం ఉంటే.. తన సభ్యులతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. భారతదేశ చరిత్రలో ఏపీ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఇంత దిగజారుడు ఎక్కడా చూడలేదన్నారు. 


ఏపీ పోలీసులు అధికార పార్టీ కండువా కప్పుకుని పనిచేస్తున్నారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. గౌరవంగా బ్రతకాల్సిన కొంతమంది పోలీసులు బజారు రౌడీలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కూన రవికుమార్‌ను అర్ధరాత్రి  సమయంలో అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. సీఎం జగన్ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకే కూన రవిపై అక్రమ కేసులు పెట్టారని, మహిళలు ఉండగా రాత్రిపూట పోలీసులు రవి ఇంట్లోకి ప్రవేశించే హక్కు ఎవరు ఇచ్చారన్నారు. టీడీపీ నేతలు కేసులకు భయపడేది లేదని, పార్టీ నేతలు, కార్యకర్తలు మరింత కసితో పనిచేస్తారని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

Updated Date - 2021-11-22T20:27:29+05:30 IST