Abn logo
Jun 14 2021 @ 00:00AM

బీజేపీలో చేరిన రమేష్‌ రాథోడ్‌

జేపీనడ్డాతో ఉమ్మడి జిల్లా బీజేపీ నాయకులు

పార్టీ జాతీయ కార్యాలయంలో కాషాయ కండువా వేసుకున్న మాజీ ఎంపీ

ఉమ్మడి జిల్లాలో మారనున్న రాజకీయ సమీకరణలు

ఖానాపూర్‌, జూన్‌ 14 : మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ సోమవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని ఆ పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌, బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జీ తరున్‌చూగ్‌, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌, జాతీయ ప్రధానకార్యదర్శి దుష్యంత్‌కుమార్‌గౌతంల సమక్షంలో రాథోడ్‌ కాషాయం కండువా వేసుకున్నారు. అనంతరం ఆ పార్టీ జాతీయ ఽఅధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ర్టానికి చెందిన పలు పార్టీల ముఖ్య నాయకులు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, ఆర్టీసీ యూనియన్‌ నాయకుడు అశ్వర్థామరెడ్డి, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మాజీ జడ్పీచైర్మన్‌ తుల ఉమతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గతంలో జడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పలు కీలక పదువులను అలంకరించిన రమేష్‌ రాథోడ్‌ సైతం బీజేపీలో చేరారు. దీంతో రాబోయే రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రాజకీయ సమీకరణలు మారనున్నాయని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ ప్రారంభమైంది. ఈ చేరిక కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి,  బీజేపి జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, మధ్యప్రదేష్‌ రాష్ట్ర ఇన్‌చార్జీ మురళీధర్‌రావు, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు, నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ వివేక్‌, తమిళనాడు రాష్ట్ర సహ ఇన్‌చార్జీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌కుమార్‌, రాష్ట్ర ప్రధానకార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శృతితో పాటు ముథోల్‌ నియోజకవర్గానికి చెందిన మోహన్‌రావు పటేల్‌ తదితరులున్నారు.