న్యూఢిల్లీ: యోగా గురు రాందేవ్ బాబా సహనం కోల్పోయారు. రిపోర్ట్‌పై నోరు పారేసుకున్నారు. రాందేవ్ బాబా గత వ్యాఖ్యలను గుర్తు చేసినందుకు విలేకరిని బెదిరించారు. బాబాకు కోపం రావడం వెనక ఓ కారణం ఉంది. 2014లో ఆయన ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం (కాంగ్రెస్) మారితే పెట్రోలు, ఎల్పీజీ ధరలు తగ్గుముఖం పడతాయని చెప్పుకొచ్చారు.
తన వద్దనున్న ఓ అధ్యయన సమాచారం ప్రకారం.. లీటరు పెట్రోలు కనీస ధర రూ. 35 మాత్రమేనని, దానిపై 50 శాతం పన్నులు వేస్తున్నారని అన్నారు. 50 శాతం పన్నులను ఒకశాతానికి తగ్గిస్తే పెట్రోలు రూ. 40కే అందుబాటులోకి వస్తుందని చెప్పుకొచ్చారు. తనకు ఈ మాత్రం ఆర్థిక శాస్త్రం కూడా తెలుసని అన్నారు. ఆర్థికవేత్తలు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నడపలేరని, వారందరూ అమెరికా సెన్సెక్స్, ఎఫ్‌డీఐలకు బానిసలంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు.
తాజాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ విలేకరి నాటి ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశాడు. ప్రభుత్వం మారితే లీటరు పెట్రోలు రూ.40కే దిగివస్తుందన్నారు కదా అని ప్రశ్నించాడు. అంతే, బాబాకు కోపమొచ్చింది.
‘‘షటప్, ఇలాంటి ప్రశ్నలు అడిగితే బాగుండదు. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు నేనేమైనా తాకేదార్‌నా? నేను ఆ మాటలు అన్నది అప్పుడు, ఇప్పుడు కాదు. నువ్వేమైనా చెయ్యగలితే చెయ్యి’’ అని ప్రశ్న అడిగిన విలేకరిపై విరుచుకుపడ్డారు. అంతేకాదు, ఇలాంటి ప్రశ్నలు అడగడం నీకు అంతమంచిది కాదని ఓ హెచ్చరిక కూడా చేశారు. గత పది రోజులుగా పెట్రోలు ధరలు పైపైకి దూసుకుపోతున్న నేపథ్యంలో రాందేవ్ బాబా చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి