#RRR : భీమ్ కోసం రామ్ ట్రైలర్ టీజ్

యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. దేశం మొత్తం మీద ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ప్రేక్షకుల్ని అలరించబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని వినూత్నంగా చేస్తున్నారు జక్కన్న. అందులో భాగంగా ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ట్రైలర్ ను రేపు(గురువారం) విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మొన్నామధ్య రామ్ కోసం భీమ్ ఒక ట్రైలర్ టీజ్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మంటల్లోంచి చరణ్ అగ్రెసివ్‌గా నడిచివస్తున్న క్లిప్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈరోజు భీమ్ కోసం రామ్ ఓ అదిరిపోయే టీజ్ ను వదిలారు.


యన్టీఆర్ బుల్లెట్ మీద దూసుకుపోవడం.. నీళ్ళలోంచి బళ్ళెంతో సహా రివీలవడాన్ని ఓ క్లిప్ గా కట్ చేసి విడుదల చేశారు చరణ్. ఈ టీజ్ కూడా అభిమానుల్ని ఫిదా చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కొమరం భీమ్‌గా యన్టీఆర్, అల్లూరి సీతారామరాజు‌గా రామ్‌చరణ్ అదరగొట్టబోతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం మరో నెల రోజుల్లో థియేటర్స్ లో దుమ్మురేపనుంది.   సినిమా ఎప్పుడు చూద్దామా అనే ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. మరి ఈ సినిమా ఏ రేంజ్‌లో కొత్త రికార్డుల్ని నెలకొల్పుతుందో చూడాలి. 



Advertisement