మెగా మేనల్లుడు, సాయి తేజ్ తమ్ముడు `పంజా` వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా `ఉప్పెన`. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. తమిళ ప్రముఖ కథానాయకుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు.
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని పాటలు మంచి ఆదరణ దక్కించుకున్నాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంది. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా ఈ టీజర్‌పై ప్రశంసలు కురిపించాడు. `టీజర్ చాలా అందంగా ఉంది. బ్రదర్ పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల జంట చాలా ఫ్రెష్‌గా అనిపించింది. దర్శకుడు బుచ్చిబాబుకు, నిర్మాణ సంస్థ మైత్రికి, ఇతర టెక్నీషియన్స్‌కు శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్` అని చెర్రీ ట్వీట్ చేశాడు.