Oct 17 2021 @ 11:37AM

రెబల్‌స్టార్ ను ఫాలో అవుతున్న మెగా పవర్‌స్టార్

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోలు వరుసగా పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. త్వరలో విడుదలకు రెడీ అవుతోన్న ‘రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్’ మూవీస్ తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ (వర్కింగ్‌టైటిల్ )సైతం భారీ పాన్ ఇండియా మూవీనే. వీటికి తోడు రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే పాన్ ఇండియా మూవీని కూడా ప్రభాస్ సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ బాటలో ప్రస్తుతం రామ్ చరణ్ కూడా అడుగులు వేయడం ప్రారంభించారు. 



ప్రస్తుతం రాజమౌళి దర్వకత్వంలో యన్టీఆర్ తో  స్ర్కీన్ షేర్ చేసుకుంటున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ తో చెర్రీ పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టైతే.. చెర్రీ పాన్ ఇండియా జెర్నీని ఎవరూ ఆపలేరు. అయితే ఆ సినిమా విడుదలవడానికి ముందే చెర్రీ వరుసగా పాన్ ఇండియా మూవీస్ ను సెట్ చేసుకోవడం విశేషంగా మారింది. శంకర్ దర్వకత్వంలో త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతున్న సినిమాతో పాటు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. అలాగే.. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోతున్న సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కబోతోంది. ఇంతకు ముందు చిన్న దర్శకుడైన సుజిత్ ను ‘సాహో’ మూవీతో పాన్ ఇండియా సినిమా చేసే గొప్ప అవకాశాన్నిచ్చారు ప్రభాస్. సరిగ్గా అదే తరహాలో చిన్న దర్శకుడైన గౌతమ్ తిన్ననూరికి చెర్రీ పాన్ ఇండియా మూవీ చేసే అవకాశం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్టైతే.. రామ్ చరణ్ కూడా ప్రభాస్ లాగానే పాన్ ఇండియా స్టార్ అయిపోతారని వేరే చెప్పాలా.