Abn logo
Sep 25 2021 @ 00:33AM

స్పిన్‌ మాంత్రికుడూ మానవతా శిఖరమూ

గొప్ప క్రికెటర్లు, ఉత్కృష్ట మానవులు అని చెప్పదగ్గ విశిష్ట క్రీడాకారులు భారతీయ క్రికెట్ చరిత్రలో ముగ్గురు మాత్రమే ఉన్నారు. కాలంవారీగా ఈ రత్నత్రయంలో మొదటి వ్యక్తి పాల్వంకర్ బాలూ; రెండవ వ్యక్తి విజయ్ మర్చంట్; మూడవ వ్యక్తి బిషన్‌సింగ్ బేడీ. ఈ స్పిన్ మాంత్రికుని వ్యక్తిత్వ బలంలో సగమైనా సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, సౌరవ్ గంగూలీలకు ఉన్నట్టయితే భారతీయ క్రికెట్ కొంతకాలంగా ఉన్న పరిస్థితిలో కంటే మరింత మెరుగ్గా, ఆరోగ్యకరంగా ఉండేది. బేడీ లాంటి వ్యక్తులు భారతీయ క్రికెట్ లోనే కాదు, భారతీయ రాజకీయాలు, ప్రజాజీవితంలోనూ చాలా చాలా అరుదు. ఇదే మన భారత గణతంత్రరాజ్య మహావిషాదం.


స్వతంత్ర భారత ప్రస్థానంలో భాగమే ఆయన జీవన యాత్ర. నేడు, ఆ గౌరవనీయ భారతపౌరుడి 75వ పుట్టిన రోజు. బిషన్ సింగ్ బేడీ గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఆయన, నేను అమితంగా గౌరవించే క్రికెటర్. క్రీడాస్థలిలో ప్రదర్శించిన ప్రతిభాపాటవాలకే కాదు, బహుశా అంతకంటే ఎక్కువగా, విశాల జీవనస్థలిలో మానవతా ప్రపూరితమైన ప్రవర్తనకూ ఆయన సుప్రసిద్ధుడు. బిషన్ సింగ్ బేడీ ఒక గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు, ఒక ఉన్నత మానవుడు కూడా. క్రికెట్ చరిత్రలో తనకొక విశిష్టస్థానాన్ని సముపార్జించుకున్న గొప్ప స్పిన్ మాంత్రికుడు బిషన్ బేడీ. టెస్ట్ క్రికెట్ లోనూ, రంజీట్రోఫీ క్రికెట్ లోనూ ఆయన అద్భుత బౌలింగ్‌ను నేను ఎన్నోసార్లు వీక్షించాను. అయినా ప్రతిసారీ మళ్ళీ చూడాలనే కాంక్ష నాలో మిగిలిపోతూనే ఉంది. 


బిషన్ బేడీ 75వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన క్రికెట్ జీవితానికి అద్దం పట్టిన ఒక పుస్తకం వెలువడింది. ‘ది సర్దార్ ఆఫ్ స్పిన్’ అనే ఈ పుస్తకంలో బేడీపై ఆయన తరం క్రికెటర్లు, ఆయన క్రీడాజీవితాన్ని మొదటి నుంచీ శ్రద్ధాసక్తులతో గమనించిన రచయితలూ (వీరిలో నేనూ ఒకడిని), ఆయన మార్గదర్శకత్వంలో ఎదిగిన లేదా ఆయన నుంచి స్ఫూర్తి పొందిన యువ క్రికెటర్లు రాసిన వ్యాసాలు ఉన్నాయి. ఒకనాటి ఢిల్లీ ఓపెనర్ వెంకట్ సుందరం మేధో శిశువు ఈ అందమైన పుస్తకం. రంజీట్రోఫీలో చాలా సంవత్సరాల పాటు బేడీ నాయకత్వంలో వెంకట్ ఆడారు. 1979–80లో ఢిల్లీకి తొలిసారిగా ఆ ట్రోఫీని అందించిన టీమ్‌లో ఆయన ఒక సభ్యుడు. బేడీ క్రికెట్ జీవితంపై ఒక పుస్తకం తీసుకురావాలనే ఆలోచన, వ్యాసకర్తల ఎంపిక, స్మృతి సుగంధాలను వెలయించిన ఛాయా చిత్రాల సేకరణ, మరీ ముఖ్యంగా ప్రచురణకర్తను సమకూర్చుకోవడం మొదలైన విధులు సమస్తం వెంకటే నిర్వర్తించారు. ఇంతగా కృషి చేసిన వెంకట్ పేరు ఆ పుస్తకం కవర్‌పేజీ మీద లేదు! ఇది ఆయన నిస్వార్థత, సభ్యతా సంస్కారాలకు ఒక తార్కాణం. క్రికెట్ అభిమానులు అందరూ తప్పక చదవవలసిన పుస్తకం ‘ది సర్దార్ ఆఫ్ స్పిన్’. 


గొప్ప క్రికెటర్లు, ఉత్కృష్టమానవులు అని చెప్పదగ్గ విశిష్ట క్రీడాకారులు భారతీయ క్రికెట్ చరిత్రలో, బహుశా, ముగ్గురు మాత్రమే ఉన్నారు. కాలంవారీగా ఈ రత్న త్రయంలో మొదటి వ్యక్తి పాల్వంకర్ బాలూ (1875–1955). చరిత్ర, సమాజం కల్పించిన కఠోర అవరోధాలను అధిగమించి ప్రప్రథముడిగా నిలిచిన గొప్ప భారతీయ బౌలర్, అత్యంత ప్రతిభావంతుడు బాలూ. రంజిత్ సింహ్‌జీని ఒక ఇంగ్లీష్ క్రికెటర్‌గా మనం పరిగణించిన పక్షంలో పాల్వంకర్ బాలూనే మొట్టమొదటి మహోన్నత భారతీయ క్రికెటర్ అవుతాడు. ఆటలో అసాధారణ విజయాలు, విశాల జీవితంలో సమున్నత నడవడితో ఆయన ఎంతోమంది యువ దళితులను ప్రభావితం చేశారు. డాక్టర్ భీమ్‌రావ్ రాంజీ అంబేడ్కర్ ఆ ప్రభావితులలో ఒకరు. 1911లో అఖిలభారత క్రికెట్‌జట్టు ఇంగ్లండ్‌లో మొట్టమొదటిసారి పర్యటించింది. ఆ సందర్భంగా జరిగిన టెస్ట్‌మ్యాచ్‌లలో బాలూ మొత్తం 150 వికెట్లు తీసుకున్నాడు. స్వదేశానికి తిరిగివచ్చినప్పుడు బొంబాయి దళితవర్గాల వారు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గొప్ప సన్మానం చేశారు. ఈ సత్కార సభలో ‘మన్‌పత్ర’ (స్వాగతోపన్యాసం)ను చదివింది యువ అంబేడ్కర్. మన కాలంలోని అత్యంత ప్రభావశీల భారతీయులలో అగ్రగణ్యుడైన అంబేడ్కర్ ఒక బహిరంగసభలో పాల్గొనడం అదే మొదటిసారి అని చెప్పవచ్చు. 


పాల్వంకర్ బాలూ ప్రప్రథమ గొప్ప భారతీయ బౌలర్ అయితే విజయ్ మర్చంట్ (1911–87) మొట్టమొదటి గొప్ప భారతీయ బ్యాట్స్‌మాన్. భారత్ గడ్డపైనే సాటి లేని మేటి ఆటగాడుగా రూపొందిన క్రికెటర్. సంపన్నుల బిడ్డ అయినప్పటికీ క్రమ శిక్షణతో, నైతికవిలువలతో జీవితంలోకి ప్రవేశించిన వ్యక్తి విజయ్ మర్చంట్. 1932లో ఇంగ్లండ్‌లో పర్యటించే భారత్‌జట్టు సభ్యుడుగా విజయ్ ఎంపికయ్యారు. అయితే మహాత్మా గాంధీని, ఇతర జాతీయ నాయకులను వలసపాలకులు నిర్బంధించిన కారణంగా ఇంగ్లండ్ టూర్ నుంచి ఆయన తనకు తాను ఉపసంహరించుకున్న దేశభక్తుడు విజయ్ మర్చంట్.


భారతీయ క్రీడారంగ చరిత్రలో పాల్వంకర్ బాలూ, విజయ్ మర్చంట్‌ శిఖరసమానులు. క్రికెట్ ద్వారా సమకూరిన పేరు ప్రతిష్ఠలను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నించని నిజమైన పెద్ద మనుషులు. కీర్తికనకాలు వారి వ్యక్తిత్వానికి వన్నెతెచ్చాయి. బిషన్‌సింగ్ బేడీ ఆ రత్న త్రయంలో మూడోవాడు. బహుశా చివరివాడని నేను భావిస్తున్నాను. క్రికెట్‌లో అపూర్వ ప్రతిభావంతుడైన బేడీ విశాల జీవితంలో అసాధారణ ధీరోదాత్తుడు. టెస్ట్‌క్రికెట్ ఆడుతున్న రోజులలో ఆటగాళ్ల హక్కుల కోసం అవిరామంగా పోరాడిన సాహసి. బీసీసీఐ నిర్వాహకుల కుట్రలు, కుహకాలను ధైర్యంగా, సమర్థంగా ఎదుర్కొన్నాడు. 


భారతీయ సమాజం గురించి బిషన్‌సింగ్ బేడీకి నిశితమైన విశాల అవగాహన ఉంది. గొప్ప నైతిక నిష్ఠ ఉన్న వ్యక్తి. ఆయన పట్ల నా గౌరవప్రపత్తులకు, క్రికెటర్‌గా ఆయనకు ఉన్న పేరు ప్రతిష్ఠలు కేవలం పాక్షిక ప్రాతిపదికలు మాత్రమే. మేమిరువురమూ స్నేహితులుగా ఉన్నకాలంలో జీవితం, మానవ ప్రవర్తన గురించి ఆయన నాకు నేర్పిన విలువైన పాఠాలే ఆయన పట్ల నా అనుపమేయ అభిమానానికి ప్రధాన ఆధారాలు. 1946 సెప్టెంబర్ 25న బిషన్ సింగ్ బేడీ జన్మించారు. స్వతంత్ర భారతదేశంతో పాటు ఎదిగి, ఒక అవాస్తవిక స్వేచ్ఛా భారతంలో జీవితసంధ్యలోకి ప్రవేశించిన అవిస్మరణీయ భారతీయుడు బేడీ. తన జీవితకాలంలో ఈ పురానవ భారతదేశం లోనైన సంక్షోభాలు, వాటిని తాను వక్తిగతంగా ఎలా ఎదుర్కొందీ వివరిస్తూ గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక జాతీయ దినపత్రికలో ఆయన ఒక వ్యాసం రాశారు. పాకిస్థాన్‌తో యుద్ధాలు, సిక్కుల వ్యతిరేక అల్లర్లు, కొవిడ్ మహమ్మారి మృత్యుతాండవం గురించి ఆయన ఆ వ్యాసంలో ప్రస్తావించారు. ఆకస్మిక లాక్‌డౌన్ సృష్టించిన చిన ‘హృదయ విదారక దృశ్యాలు’ గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ మన రాజకీయ వేత్తలలో కరుణాత్మక దృక్పథం, దయాస్వభావం పూర్తిగా లోపించాయన్న వాస్తవాన్ని ఆ సంఘటనలు స్పష్టం చేశాయని వ్యాఖ్యానించారు. కరోనా బాధితుల, మృతుల గణాంకాలను వెల్లడించడంలో నిజాయితీ, పారదర్శకత పూర్తిగా లోపించాయని కూడా ఆయన విమర్శించారు. వ్యక్తిపూజ పెచ్చరిల్లిపోయిందని బేడీ ఆందోళన వ్యక్తం చేశారు. యువ విద్యావంతులు కూడా రాజకీయ నాయకుల భజనపరులు కావడం చాలా విచారం కలిగిస్తోందని అన్నారు.


ఈ దేశం అంతకంతకూ పతనమవుతుండడానికి ప్రధాన కారణం వ్యక్తి ఆరాధనే అని బేడీ విస్పష్టంగా చెప్పారు. ‘ఈ శోచనీయ పరిణామాలను ఎదుర్కొనే ధైర్యం, వ్యక్తిత్వబలం నాకున్నాయి. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఇటువంటి వాటిని ఎదిరించి నిలబడగలిగాను. ఇప్పుడు నేను జీవితంలో చాలా దూరం ప్రయాణించాను. వృద్ధాప్యంలో ఉన్నాను. అయితే నేను నిరాశావాదిని కాను. నా ఆధ్యాత్మికతలో నాకు విశ్వాసం ఉంది. భవిష్యత్తుపై పరిపూర్ణ ఆశాభావం ఉంది. యుద్ధాలు, దురాక్రమణలను తట్టుకుని ముందుకు సాగుతున్నాం. రాజకీయ మహమ్మారిని కూడా మనం తప్పక జయించగలుగతాం’ అంటూ ఆయన తన వ్యాసాన్ని ముగించారు. బిషన్ బేడీ వ్యక్తిత్వ బలంలో సగమైనా సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, సౌరవ్ గంగూలీలకు ఉన్నట్టయితే భారతీయ క్రికెట్ కొంతకాలంగా ఉన్న పరిస్థితిలో కంటే మరింత మెరుగ్గా, ఆరోగ్యకరంగా ఉండేది. అయితే బేడీ లాంటి వ్యక్తులు భారతీయ క్రికెట్ లోనే కాదు, భారతీయ రాజకీయాలు, ప్రజాజీవితంలో కూడా చాలా చాలా అరుదు. ఇదే మన భారత గణతంత్రరాజ్య మహావిషాదం.రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

నేడు బిషన్‌సింగ్ బేడీ 75వ పుట్టిన రోజు

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...