Abn logo
Apr 16 2021 @ 00:01AM

రామాయణం... జీవన మార్గదర్శిని!

21న శ్రీరామనవమి


భారతీయ సంస్కృతిని చాటి చెప్పే మహా గ్రంథాలు రామాయణ, భారత భాగవతాలు. ప్రజల  నిత్య జీవితాలను భారతం ప్రదర్శిస్తే, దివ్యమైన జీవితం ఏ విధంగా గడిపి భగవంతుణ్ణి చేరుకోవచ్చో భాగవతం తెలియజేస్తుంది. మానవుడు ఆదర్శప్రాయమైన జీవితాన్ని ఎలా గడపాలో రామాయణం మార్గనిర్దేశం చేస్తుంది.


యావత్‌ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే

తావత్‌ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి

‘ఈ భూమి మీద పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ కథ వ్యాప్తిలో ఉంటుంది‘-  ఇది బ్రహ్మవాక్కు. అది ఎప్పటికీ సత్యమే. శ్రీరాముడు... వేదం ప్రవచించిన ధర్మానికి ప్రతిరూపం కావడమే దీనికి కారణం. ‘వేదః ప్రాచేతసాత్‌ ఆసీత్‌ సాక్షాత్‌ రామాయణాత్మనా’ అన్నాడు వాల్మీకి.  శ్రీ మహా విష్ణువు మానవ రూపంలో శ్రీరామునిగా అవతరించాడు. మానవులకు ఉండే సహజ లక్షణాలనే ప్రదర్శించాడు. తాను భగవంతుణ్ణని ఆయనకు తెలిసినా, బ్రహ్మాది దేవతలూ, ఋషులూ ఆ విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పినా... తాను మానవుణ్ణనీ, దశరథ కుమారుడిననీ ఆయన ప్రకటించాడు.


మన దేశంలో రామాలయం లేని ఊరు లేదు. వాల్మీకి ఘంటం నుంచి జాలువారిన శ్రీరామ కథా సుధాపానం చేసి తరించినవారు ఎందరో!  రామాయణంలోని ప్రతి శ్లోకం మంత్రాత్మకమైనదే. శ్రీరామ నామ మహిమనూ, రామనామ తత్త్వాన్నీ మేళవించి... శ్రీరాముణ్ణి పురుషోత్తముడు అన్నారు. 


‘వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మని

వేదః ప్రాచేత సదాసీత్‌ 


సాక్షాద్రామాయణాత్మనా’ అన్నాడు వాల్మీకి. వేదాల ద్వారా తెలుసుకోదగిన పరమ పురుషుడే దశరథ తనయునిగా జన్మించాడు. వేదాలే వాల్మీకి ద్వారా శ్రీమద్రామాయణంగా ఆవిర్భవించాయి. శ్రీరామ నామ మహిమ గురించి వర్ణించాలంటే మాటలు చాలవు. రామ మంత్రంలో... అష్టాక్షరి, పంచాక్షరి మహా మంత్రాల నుంచి ‘రా’, ‘మ’ అనే అక్షరాలు కలిసి రామ నామ తారకమంత్రం రూపొందింది. శివకేశవులు అభిన్నులనే అద్వైత సిద్ధాంతానికి ఇది ప్రతీకగా పెద్దలు చెబుతారు. వశిష్ఠ మహర్షి కూర్చిన ఈ తారక మంత్రాన్ని ఎందరో మహనీయులు జపించి సాఫల్యం పొందారు. 


ప్రకృతి శక్తులను పరిరక్షించే దైవీయ శక్తులను ప్రేరేపించి, తద్వారా లోక కల్యాణాన్ని సాధించడమే భగవత్తత్వం. ఆ తత్త్వాన్ని లోకానికి చాటి చెప్పడానికి రామునిగా విష్ణువు అవతరించాడు. జగద్రక్షణ చేశాడు. ధర్మ ప్రతిష్ఠాపనమే రామాయణంలోని విశిష్టాంశం. రామాయణం ద్వారా మానవ జీవితాలకు ఇహాన్నీ, పరాన్నీ అందించడమే వాల్మీకి సంకల్పం. సాధారణ మానవుడు పరిణతి చెంది, పరిపక్వతను సాధించడానికి దోహదపడే మహా గ్రంథం రామాయణం. అది భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన గ్రంథం. దేశ విదేశాల్లో రామాయణానికి అనువాదాలూ, అనుకరణలూ, అనుసృజనలూ అనేకం వచ్చాయి. ప్రజలను ఇంతగా ప్రభావితం చేసిన గ్రంథం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.


తెలుగులోనూ ‘భాస్కర రామాయణం’, ‘మొల్ల రామాయణం’ తదితరాలు ఎంతో ప్రముఖమైనవి. గద్య, పద్య రూపాల్లో అనేక రామాయణాలు ఆవిష్కృతం అయ్యాయి. ‘ముని ఋణము దీర్చ దీని రచింతు’ అంటూ ‘రామాయణ కల్పవృక్షా’న్ని రచించి, తెలుగు సాహితీ నందనవనంలో కల్పవృక్షాన్ని నాటారు విశ్వనాథ సత్యనారాయణ. జానపదుల పాటలకూ రామాయణ కథ ఊపిరి అయింది. రాముని మేలుకొలుపులు, పవళింపులు, ఉర్మిళ నిద్ర, లక్ష్మణ దేవర నవ్వు... ఇలా ఎన్నో పాటలు జానపదుల జీవితాల్లో భాగమయ్యాయి.


రాముడు తమకే కాదు, సర్వ జగత్తుకూ రక్షకుడనే భావన వారి హృదయాల్లో ప్రతిష్ఠితం కావడమే దీనికి కారణం. అలాగే రాజ్య పాలనకు సంబంధించిన ప్రధానమైన విషయాలు అయోధ్య కాండలో... శ్రీరామ, భరతుల సంవాద రూపంలో ఉంటాయి. భరతుణ్ణి రాముడు కుశల ప్రశ్నలు వేస్తూనే ఎన్నో విషయాలు ముచ్చటిస్తాడు. ప్రభుత్వాలు, అధికారులు ఎలా నడచుకోవాలో ఈ కాండలోని నూరవ సర్గ వివరించింది. 


సీతా వియోగం సందర్భంలో... మానవునిగా జీవిస్తున్న రాముడి దీన స్థితిని  ‘సుపధానంతు గచ్ఛంతం తిర్యంతోపి సహాయతే కుపధానంతు గచ్ఛంతం సోదరోసి విముంచతి’ అంటూ వాల్మీకి అద్భుతంగా చెబుతాడు. మంచి మనసున్న మానవుడికి సమాజమే కాదు, ప్రకృతి అంతా వెన్నంటి ఉంటుంది. 


‘రామాయణం’ అంటే ‘రాముని ఆయనం’. రాముడు నడచిన మార్గం. ఆ మార్గం ఆదర్శవంతమైన మార్గం. ఆ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలనీ, జీవితాల్లో ధర్మ మార్గాన్ని అనుసరించాలనీ రామాయణం పదే పదే ఉపదేశిస్తుంది. ధర్మం ఎన్నో సూక్ష్మమైన అంశాలతో కూడుకున్నది. లౌకిక, పారలౌకిక విషయాలు రామాయణం నిండా ఉన్నాయి. మానవ సంబంధాలు. కుటుంబ ధర్మాలు, పాలనా ధర్మాలు, మానవీయ అంశాలు ఎన్నో దీనిలో కనిపిస్తాయి.


అలాగే రామాయణంలో ఎన్నో యజ్ఞ రహస్యాలు ఉన్నాయి. మానన సంబంధాలు ఎలా ఉండాలో, సంస్కారవంతమైన వ్యక్తిత్వం ఎలా ఉండాలో శ్రీముని కథ చెబుతుంది. మానవుడిగా శ్రీరాముని ఆదర్శవంతమైన ప్రయాణాన్ని మననం చేసుకొని,  అందరూ అనుసరిస్తే ఉత్తమ మానవ సంబంధాలు నెలకొంటాయి. ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుంది.


‘రామాయణం’ అంటే ‘రాముని ఆయనం’. రాముడు నడచిన మార్గం. ఆ మార్గం ఆదర్శవంతమైన మార్గం. ఆ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలనీ, జీవితాల్లో ధర్మ మార్గాన్ని అనుసరించాలనీ రామాయణం పదే పదే ఉపదేశిస్తుంది. ధర్మం ఎన్నో సూక్ష్మమైన అంశాలతో కూడుకున్నది. లౌకిక, పారలౌకిక విషయాలు రామాయణం నిండా ఉన్నాయి. మానవ సంబంధాలు. కుటుంబ ధర్మాలు, పాలనా ధర్మాలు, మానవీయ అంశాలు ఎన్నో దీనిలో కనిపిస్తాయి.

 ఎ. సీతారామారావు

Advertisement
Advertisement
Advertisement