మానవ జీవన ప్రతిబింబం రామాయణం

ABN , First Publish Date - 2020-03-02T09:26:54+05:30 IST

మహర్షి వాల్మీకి రచించి మనకందించిన శ్రీమద్రామాయణాన్ని గురించిన గొప్పమాట ఇది. వేల సంవత్సరాలుగా మానవ జీవితానికి ఆదర్శప్రాయంగా నిలిచిన మహాకావ్యం...

మానవ జీవన ప్రతిబింబం రామాయణం

  • యావత్‌ స్థాస్యంతి గిరయః సరితస్చ మహీతలేశ్రీ
  • తావత్‌ రామాయణకథా లోకేషు ప్రచరిష్యతిశ్రీశ్రీ


మహర్షి వాల్మీకి రచించి మనకందించిన శ్రీమద్రామాయణాన్ని గురించిన గొప్పమాట ఇది. వేల సంవత్సరాలుగా మానవ జీవితానికి ఆదర్శప్రాయంగా నిలిచిన మహాకావ్యం రామాయణం. అందుకే ‘‘ఈ సృష్టిలో పర్వతములు, నదులు ఉన్నంతకాలం రామాయణ కథ ప్రచారంలో ఉంటుంది’’ అని రామాయణమే చెబుతోంది. ఒక మహాకావ్యానికి పదికాలాల పాటు లోకాన్ని ఉద్ధరించే శక్తి ఉంటే.. అది కాల ప్రవాహానికి ఎదురొడ్డయినా నిలిచి వెలుగుతుంది. దానికి ప్రధాన కారణం.. ప్రపంచరీతులు, విశ్వంలోని మానవుల సంవేదనలు, మనిషి ఆచరించాల్సిన ధర్మమార్గం వంటి అనేకమైన అంశాలు ఈ కావ్యంలో దర్శనమిస్తాయి. సార్వకాలికమైన సత్యాలను, ధర్మాలను బోధించే రామకథ విశ్వంలోని సర్వమానవజాతికి ఆదర్శంగా నిలిచింది.

పుత్ర ధర్మమైనా, మిత్ర ధర్మమైనా, సోదర ధర్మమైనా సమాజానికి అవసరమైన ఏ ధర్మమైనా సరే.. దాని ఆచరణ ఎంత కష్టమైనా సరే.. ఎన్ని ఆటంకాలు, ఆపదలు ఎదురైనా సరే.. వాటన్నింటినీ అధిగమించి విజయం సాధించడమే రాముని కథలో మనకు అందే సందేశం.


రాక్షస ప్రవృత్తి మనిషిని కష్టాల్లోకి నెట్టివేస్తుంది. మానసిక దృఢత్వంతో దాన్ని ఎదిరించి, జయించాలన్న నీతిని రామాయణం చెప్పింది. అందుకే అది మానవులున్నంత కాలం, ప్రకృతి ఉన్నంత కాలం ప్రచారంలోనే ఉంటుంది.  రాముడి త్యాగమే ఆయనను ధర్మమార్గంలో నడిపించింది. దానికి సత్యపథం తోడైంది. శాశ్వతంగా నిలువవలసిన ‘సత్యం’ రామచంద్ర ప్రభువు జీవితాన్ని వెలిగించి, ఆదర్శ ప్రభువుగా నిలిపింది. పరమాత్మకు మరో రూపమే ధర్మం. ఆ ధర్మానికి సత్యమే పునాది. ఆ పునాదిపైన రామాయణ కావ్య నిర్మాణం జరిగింది. అందుకే అది నేటికీ పటిష్ఠంగా నిలిచి ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్నది. రాజ్యాన్ని తృణప్రాయంగా త్యజించి అరణ్యాలకు వెళ్లిన రాముడి ఔన్నత్యం, సర్వ సుఖాలను త్యజించి అన్న వెంట నడవటమే ధర్మమార్గమని యెంచిన లక్ష్మణ స్వామి ఘనత, అంతఃపుర సౌఖ్యాన్ని వదిలి, భర్తమార్గంలోనే నడిచి అడవులకేగిన సీతమ్మ వారి మహోన్నత వ్యక్తిత్వం వంటి ఎన్నెన్నో విషయాలు మానవ సమాజానికి మార్గదర్శనం చేశాయి. అయోధ్య, కిష్కింధ, లంక రాజ్యాల కథగా కనిపించే ఈ కావ్యం కేవలం మూడు రాజ్యాల కథ మాత్రమే కాదు. ఇది మూడు జాతుల కథ. మానవ, వానర, రాక్షస జాతుల సత్వరజస్తమోగుణాలకు ప్రతీకలు. ఈ గుణాల కారణంగా ఏర్పడ్డ ధర్మవిరుద్ధ భావాలు కల దుష్టులను శిక్షించే శక్తిని మనిషి సాధించాలన్నది మహర్షి భావన. అందుకే ఈ కథను వేద సమానమైన కథగా కీర్తిస్తారు. అలాంటి రామాయణమే వేదం. రాముడే వేద పురుషుడు.

- గన్నమరాజు గిరిజా మనోహరబాబు

Updated Date - 2020-03-02T09:26:54+05:30 IST