రామ‘వరం’

ABN , First Publish Date - 2021-07-25T05:19:20+05:30 IST

రామ‘వరం’

రామ‘వరం’
రామవరం వీధి

వర్ధన్నపేట

జిల్లాలోనే అత్యధిక వలస గ్రామంగా పేరుపొందిన రామవరానికి మహ ర్దశ పట్టనుంది. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రానికి 15కిలోమీటర్ల దూరం లో ఉన్న రామవరం అభివృద్ధి గాడిన పడే అవకాశం వచ్చింది. ఐటీ శాఖ మం త్రి కల్వకుంట తారక రామారావు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. దీంతో గ్రామంలో ఉన్న మౌలిక వసతులు, పలు రోడ్లు, మరి న్ని అభివృద్ధి బాటపడుతాయని గ్రామస్థులు ఆశిస్తున్నారు. 

గ్రామ రూపురేఖలు ఇవీ...

రామవరం దాదాపు 50 ఏళ్ల క్రితం గ్రామపంచాయతీగా ఏర్పడింది. 1480 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గ్రామంలో మూడు వేలకుపైగా జనాభా, 1,876మంది ఓటర్లు ఉన్నారు. పేద బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే ఎక్కువగా జీవిస్తున్నారు. ఇక్కడివారు పూర్తిగా వ్యవసాయం పైనే ఆధారపడ్డారు. సాగునీటి వసతి లేక హైదరాబాద్‌, వరంగల్‌, ఇతర పట్టణాలకు వలసబాట పడుతున్నారు. గ్రామంలో అత్యధికంగా బీసీలు, ఎస్సీలు ఉన్నారు. గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, పోచమ్మ దేవాలయాలు ఉన్నాయి. గ్రామంలో ఊర చెరువు, ఆరు కుంటల పేర్లు గజ్జెల వారి కుంట, మేరవారి కుంట, కమ్మరివాకి కుంట, రెడ్డివారి కుంట, ఓదాలు కుంట, మాదిగ వారి కుంటలు ఉన్నాయి. 

సమస్యలు...

గ్రామానికి ఇప్పటి వరకు ప్రభుత్వ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. సాగుకు బోరుబావులే ఆధారం. దేవాదుల నీరు, పై నుంచి వచ్చే ఇతర చెరువుల నీరు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామపంచా యతీకి నూతన భవనం కోసం ఎదురుచూస్తున్నారు. రామవరం నుంచి జింకురాం తండా వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే దారిలో బీటీ రోడ్డు నిర్మాణం వేస్తే కొండూరు వరకు రహదారి నిర్మాణం చేస్తే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని గ్రామస్థులు  చెపుతున్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం ఇప్పటి వరకు ఒక్కటి కూడా నిర్మించలేదు. గ్రామానికి మినీ ఫంక్షన్‌ హల్‌ ఉంటే గ్రామస్థులందరికీ ఉపయోగంగా ఉంటుందని చెపుతున్నారు. పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ సెంటర్లు రెండు ఉన్నా శాశ్వత భవనాలు లేవు. ఆరోగ్య ఉపకేంద్రం, పశువుల దవఖానాలు సైతం లేవని చెపుతున్నారు. ముఖ్యంగా రామవరం నుండి కొండూరుకు పోయే దారిలో పటేల్‌ కుంట కట్ట మీద బ్రిడ్జి నిర్మాణం చేస్తే తొర్రూరు, స్టేషన్‌ ఘన్‌పూర్‌ వెళ్లేందుకు మార్గం దగ్గర ఉంటుందని ప్రజలు చెపుతున్నారు. 

గ్రామస్థుల సంబరాలు 

గ్రామాన్ని ఎమ్మెల్సీ పోచంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి దత్తత తీసుకోవడంతో గ్రామస్థులు శనివారం సంబరాలు చేసుకున్నారు. సర్పంచ్‌ కర్ర శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు.  కార్యక్రమంలో ఎంపీటీసీ చిలుముల్ల సోమ య్య, గ్రామస్థులు గజ్జెల నవీన్‌, దోకుడు రాజు, వెంకటయ్య, అనిల్‌, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-25T05:19:20+05:30 IST