అయ్యో..! రామరాజ్యమా?

ABN , First Publish Date - 2021-08-13T06:24:48+05:30 IST

రెక్కాడితే గానీ డొక్కాడని..

అయ్యో..! రామరాజ్యమా?

రామరాజ్యనగర్‌లో పేదల ఇళ్లపై అధికారుల ప్రతాపం

ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయాలని బెదిరింపులు

నెలాఖరు వరకూ డెడ్‌లైన్‌

రెండు ఇళ్లు కూల్చివేత

ప్రభుత్వమిచ్చిన స్థలాలకు వెళ్లాలంటూ హుకుం

కూలి చేసుకుంటూ ఇళ్లు ఎలా కట్టుకుంటామని స్థానికుల ఆవేదన 

రోడ్డున పడిన 750 కుటుంబాలు


పాయకాపురం: రెక్కాడితే గానీ డొక్కాడని శ్రమజీవులు వారు. కూలీనాలి చేసుకుంటే గానీ పూట గడవని దుస్థితి వారిది. నిలువ నీడలేక ప్రభుత్వ స్థలంలో గుడిసెలు, రేకుల ఇళ్లు వేసుకుని జీవిస్తున్నారు. 50 ఏళ్లుగా అక్కడే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ పొట్ట నింపుకొంటున్నారు. ఇప్పటికిప్పుడు పొమ్మంటూ అధికారులు హుకుం జారీ చేశారు. నెల డెడ్‌లైన్‌ విధించి బెదిరింపులకు దిగుతున్నారు. ఇళ్లు కూల్చేస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు రామరాజ్యనగర్‌ వాసులు.


పాలఫ్యాక్టరీ వద్ద చనమోలు వెంకట్రావు ఫ్లై ఓవర్‌ కింద 50ఏళ్లుగా గుడిసెలు వేసుకుని, ఇళ్లు కట్టుకుని 750 కుటుంబాలు జీవిస్తున్నాయి. సుమారు 2వేల మందికిపైగా జనాభా ఉన్నారు. వీరంతా కూలి పనులు చేసుకుని పొట్టనింపుకొనేవారే. గొల్లపూడిలోని 19వ వార్డుకు చెందిన వీరికి ప్రభుత్వం ఈలప్రోలులో స్థలాలు కేటాయించింది. అయితే, అక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఇళ్లు నిర్మించుకోవాలని కొద్దిరోజులుగా అధికారులు బలవంత పెడుతున్నారు. వెంటనే రామరాజ్యనగర్‌ను ఖాళీచేసి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతం రైల్వేస్థలం కావడంతో అటు రైల్వే అధికారులు, ఇటు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు స్థానికులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. నెల కిందట జేసీబీతో రెండు ఇళ్లను కూల్చిన అధికారులు వారికి ఈనెలాఖరు వరకు డెడ్‌లైన్‌ విధించారు. 


ఇళ్లు కట్టించి ఇవ్వండి

నెలరోజుల్లో ఊరు కాని ఊరు వెళ్లి పేదలు ఎలా ఇళ్లు కట్టుకుంటారనే ఆలోచన కూడా లేకుండా అధికారులు బెదిరిస్తున్నారు. కరోనా కష్టకాలంలో తినడానికే తిండిలేని తాము నెలరోజుల్లో రూ.లక్షలు వెచ్చించి ఎలా ఇళ్లు కట్టుకుంటామని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తే వెళ్లడానికి తమకు అభ్యంతరం లేదని, ఉన్న ఫళంగా వెళ్లిపొమ్మంటే ఎక్కడికి పోతామని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం తమకు చెప్పినట్టుగా ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరుతున్నారు. కాగా, ఓట్ల కోసం రామరాజ్యనగర్‌ చుట్టూ తిరిగిన ప్రజాప్రతినిధులు కష్ట సమయంలో శీతకన్ను వేశారు. ప్రస్తుతం వీరికి ఏ ప్రజాప్రతినిధి అక్కరకు రాలేదు.



మరమ్మతులు చేసుకున్న ఇంటిని పడేశారు..

వర్షం పడితే ఇంట్లోకి నీరు చేరుతోందని నెల కిందట మరమ్మతులు చేసుకున్నాం. అధికారులు కనీస కనికరం లేకుండా జేసీబీతో పడేశారు. వేరొక పంచన తలదాచుకుంటున్నాం. ఇప్పటికిప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతాం. 50ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. నెల రోజుల్లో ఖాళీ చేయకపోతే ఇళ్లన్నీ పడగొడతామని బెదిరిస్తున్నారు.   

- బత్తుల శ్రీకన్య

ముసలిదాన్ని.. ఎక్కడికి పోనూ.. 

నాకు 80 ఏళ్లు. ఎక్కడో స్థలమిచ్చి ఇల్లు కట్టుకుని పొమ్మంటున్నారు. ఈ వయసులో ఇల్లు ఎలా కట్టుకోగలను. పనికి వెళ్లకపోతే ఆరోజు పస్తే. మాకు ప్రభుత్వం ముందే చెప్పినట్టు ఇళ్లు కట్టించి ఇవ్వాలి. అప్పుడే ఇక్కడి నుంచి వెళ్తాం.

- వల్లభనేని శేషమ్మ


సమయమివ్వండి.. 

కరోనా సమయంలో ఉపాధి లేక అప్పులు తెచ్చుకుని జీవిస్తున్నాం. రోజూ పనికి వెళ్లి వచ్చిన డబ్బుతో వడ్డీలు కట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇళ్లు కట్టుకోవాలంటే ఎవరు అప్పు ఇస్తారు. ఒకవేళ ఇచ్చినా వచ్చిన డబ్బు వడ్డీలు కట్టుకోవడానికే సరిపోదు. మేము ఎలా తినాలి. మా ఆర్థిక పరిస్థితి బాగుపడే వరకూ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు సమయం ఇవ్వాలి.  

- రవ్వ రాములమ్మ


Updated Date - 2021-08-13T06:24:48+05:30 IST