అంతర్జాతీయ స్థాయికి రామప్ప కీర్తి

ABN , First Publish Date - 2021-07-26T08:19:08+05:30 IST

ప్రసిద్ధ రామప్ప ఆలయానికి వచ్చిన యునెస్కో గుర్తింపు తెలంగాణ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి చాటిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ అభివర్ణించారు.

అంతర్జాతీయ స్థాయికి రామప్ప కీర్తి

 కేసీఆర్‌, కేటీఆర్‌ కృషి వల్లే యునెస్కో గుర్తింపు

పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ 

రామప్పకు యునెస్కో గుర్తింపు హర్షణీయం: కిషన్‌రెడ్డి

కేసీఆర్‌ కృషితో దక్కిన ఘనత: ఎర్రబెల్లి 


హైదరాబాద్‌/హన్మకొండ/న్యూఢిల్లీ, జూలై 25: ప్రసిద్ధ రామప్ప ఆలయానికి వచ్చిన యునెస్కో గుర్తింపు తెలంగాణ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి చాటిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ అభివర్ణించారు. రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల కృషి వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. ఆదివారం రవీంద్ర భారతిలోని తన కార్యాలయంలో శ్రీనివా్‌సగౌడ్‌ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వారసత్వ, చారిత్రక, సంస్కృతి, సంప్రదాయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దని అన్నారు. రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు లభించడం సంతోషకరమని కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు.


ఈ విజయంలో మార్గదర్శకంగా ఉన్న ప్రధాని మోదీకి తెలంగాణతో పాటు దేశ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు కోసం కృషి చేసిన ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు రావడం హర్షణీయమని, ఈ ఘనత సాధించడం వెనుక సీఎం కేసీఆర్‌ కృషి ఎంతగానో ఉందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రం హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ గుర్తింపు రావడం ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు గర్వకారణమని, తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప నిలవనుందన్నారు. రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు రావడం భారతీయులకు, ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు గర్వకారణమని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఇది కాకతీయ శిల్ప కళా వైభవానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ రామప్పకు యునెస్కో గుర్తింపు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ అన్నారు. రామప్ప గుడికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి పేర్కొన్నారు. ఆలయం యునెస్కో గుర్తింపు సాధించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారని గుర్తుచేశారు.


ప్రపంచ వారసత్వ హోదా హర్షణీయం: సంజయ్‌, రేవంత్‌ 

రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా లభించడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రామప్ప ఆలయాన్ని యునెస్కో గుర్తించేలా కృషి చేసిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కిషన్‌రెడ్డి కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణకు ఇచ్చిన మొదటి బహుమతిగా భావిస్తున్నామని తెలిపారు. కాకతీయ వారసత్వ సంపద, శిల్పకళా నైపుణ్యాన్ని యునెస్కో గుర్తించడం ఆనందంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఆలయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా అభివృద్ధి చేయాలని కోరారు. 

Updated Date - 2021-07-26T08:19:08+05:30 IST