122 ఎకరాల మాన్యం.. అయినా.. అభివృద్ధి శూన్యం!

ABN , First Publish Date - 2022-04-23T05:49:36+05:30 IST

మండలంలోని చుండి శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయానికి కోట్లాది రూపాయల మాన్యం భూములు ఉన్నా అభివృద్ధికి నోచుకోవడం లేదు.

122 ఎకరాల మాన్యం..  అయినా.. అభివృద్ధి శూన్యం!
రామలింగేశ్వరస్వామి ఆలయ స్లాబుపై కప్పిన పట్టలు

రామలింగేశ్వర ఆలయంలో సమస్యల నెలవు

పట్టించుకోని దేవదాయ శాఖ


వలేటివారిపాలెం, ఏప్రిల్‌ 22 : మండలంలోని చుండి శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయానికి కోట్లాది రూపాయల మాన్యం భూములు ఉన్నా అభివృద్ధికి నోచుకోవడం లేదు. క్రీస్తుశకం 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పట్లో ఆలయ బాగోగుల కోసం కొంతమంది దాతలు విరివిగా భూములు అందజేశారు. వలేటివారిపాలెం మండలంలోని చుండి, వలేటివారిపాలెం, జమీన్‌ఉప్పలపాడు, పోలినేనిపాలెం, రోళ్లపాడు, లింగసముద్రం మండలంలోని ఆర్‌ఆర్‌పాలెం, పొన్నలూరు మండలంలోని విప్పగుంట, బోగనంపాడు తదితర గ్రామాలలో ఈ ఆలయానికి సుమారు 122 ఎకరాలు భూములు ఉన్నాయి. ఈ భూములను ప్రతి ఏడాది కౌలుకు ఇచ్చి వచ్చిన ఆదాయంలో అర్చకుల జీవన భృతితోపాటు ఆలయ అభివృద్ధి చేసేవారు. అయితే, ఈ వ్యవహారంపై ఆరోపణలు వెల్లువెత్తడంతో పదేళ్ల క్రితం దేవదాయ శాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని కౌలు వేలం  నిర్వహిస్తున్నారు. 


దుస్థితిలో ఆలయం

కౌలు రూపంలో వచ్చిన ఆదాయంతో ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. ముఖ్యంగా ఆలయ స్లాబు దెబ్బతినడంతో వర్షపునీరు ఆలయంలోకి చేరుతున్నాయి. అలాగే గోడలు నెర్రెలు బారాయి. ఆలయంలో పలుమార్లు గుప్తనిధుల తవ్వకాలు జరిపారు. ఆలయం ముందున్న నంది విగ్రహాన్ని దుండగులు అపహరించుకుని పోయారు. ఆలయ గర్భగుడిలో వినాయక, నంది విగ్రహాలనూ చోరీ చేశారు. ఒకప్పుడు ధ్వజస్తంభం చుట్టూ ఉన్న విలువైన రాగిరేకును సైతం దుండగులు వదిలిపెట్టలేదు. ఆలయం చుట్టూ ప్రహరీగ లేకపోవడంతో ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయి.


భక్తుల అవస్థలు

పూజల కోసం ప్రతి సోమవారం భక్తులు ఇక్కడకు వస్తుండగా, సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడుతున్నారు. మహిళా భక్తులకు సరిపడా స్నానాల గదులు, పొంగళ్లు పెట్టేందుఉ షెడ్లు లేవు. ఇప్పటికైనా దేవదాయ శాఖ అధికారులు స్పందించి రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసి, సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - 2022-04-23T05:49:36+05:30 IST