పరామర్శ చిచ్చు

ABN , First Publish Date - 2020-06-07T08:26:49+05:30 IST

అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి..

పరామర్శ చిచ్చు

రామకృష్ణారెడ్డి, రాజప్ప మధ్య చిచ్చురేపిన పరామర్శ వ్యవహారం

పెదపూడిలో వైసీపీ నేతతో కలిసి పర్యటించడంపై అభ్యంతరం

టీడీపీ క్యాడర్‌ అవమానానికి గురైందంటూ రాజప్పకు నల్లమిల్లి లేఖ


(కాకినాడ-ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ హోంమంత్రి రాజప్ప మధ్య ఓ పరామర్శ వ్యవహారం చిచ్చుకు దారితీసింది. ఇరువురి మధ్య తెర వెనుక వివాదం కాస్త ఘాటుగానే నడుస్తోంది. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ రామకృష్ణారెడ్డి రాజప్పకు లేఖ రాయడం, నేరుగా ఆయనే తీసుకువెళ్లి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీనికి రాజప్ప నుంచి బదులు లేకపోవడంతో నల్లమిల్లి మనస్తాపం చెందడం.. ఇలా బయటకు పొక్కకుండా వీరిద్దరే మధ్య నలుగుతోన్న వివాదం ఇప్పుడు అధిష్ఠానంతోపాటు క్యాడర్‌ వరకు వెళ్లడంతో కలకలం రేపుతోంది.


ఇటీవల రాజప్ప అనపర్తి నియోజకవర్గం పెదపూడిలో పర్యటించారు. చనిపోయిన సంపర మాజీ ఎమ్మెల్యే వెంకటరమణకు సంబంధించిన కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు. ఈ విషయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రామకృష్ణారెడ్డికి తెలియలేదు. అయితే ఈ పరామర్శకు వెళ్లిన ఇంటి వద్ద అప్పటికే ఉన్న వైసీపీ స్థానిక నేత సత్యనారాయణ రాజప్పను పలకరించి అక్కడే ఉన్న ఇతర వైసీపీ నేతలకు పరిచయం చేశారు. దీంతో అక్కడ ఉన్న ఇతర టీడీపీ నేతలు నొచ్చుకున్నారు. తమ పార్టీ నేత రాజప్పను ఇటీవల పార్టీ వీడిపోయి వైసీపీలో చేరిన వ్యక్తి అందరికీ పరిచయడం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం విషయాన్ని రామకృష్ణారెడ్డికి ఫోన్‌లో వివరించడంతో ఆయన రాజప్పకు ఫోన్‌ చేశారు.


వైసీపీ నేత విషయమై రాజప్పతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ క్రమంలో ఇరువురు నేతల మధ్య కొంత వేడివాతారణం నెలకొంది. దీనిపై కినుక వహించిన రామకృష్ణారెడ్డి రాజప్పకు లేఖ రాయడం విశేషం. తన నియోజకవర్గానికి వచ్చినప్పుడు సమాచారం ఇవ్వకపోవడం, వచ్చిన తర్వాత వైసీపీ నేతలతో చనువుగా ఉండి, తన క్యాడర్‌ను పట్టించుకోకపోవడంతో తాను మనస్తాపం చెందానంటూ రాజప్పకు లేఖ రాసి.. ఇంటికి వెళ్లి ఆయన మనుషులకు ఇటీవల అందించారు. అయితే రెండు వారాలైనా రాజప్ప నుంచి లేఖ విషయమై స్పందన లేకపోవడంతో రామకృష్ణా రెడ్డి ఈ విషయాన్ని తాజాగా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. 

Updated Date - 2020-06-07T08:26:49+05:30 IST