కృతజ్ఞత ఆవశ్యకత

ABN , First Publish Date - 2020-10-05T08:58:54+05:30 IST

ఒక చెట్టుపై రామచిలుక చాలా కాలం నుండి గూడు కట్టుకొని నివసిస్తోంది. ఒకసారి ఒక వేటగాడు వేసిన బాణం ఆ చెట్టుకు

కృతజ్ఞత ఆవశ్యకత

ఒకరుని చేతిప్రోపును దదున్నతి ప్రాపునుగాంచి, యెల్లవెం

టకును గొఱంతలేక పొగడందగు సంపదనొంది యట్టిదా

తకుఁ దుదిఁ గీడు సేసిన కృతఘ్నుని పీనుగునైన రోఁత వు

ట్టక కబళింపఁ గుక్కలు నొడంబడునే కురువంశ వర్ధనా


ఒక చెట్టుపై రామచిలుక చాలా కాలం నుండి గూడు కట్టుకొని నివసిస్తోంది. ఒకసారి ఒక వేటగాడు వేసిన బాణం ఆ చెట్టుకు తగిలింది. బాణపు కొనకున్న విషం వల్ల అది మోడువారింది. అన్ని పక్షులూ ఎగిరిపోయినా ఈ చిలుక మాత్రం వెళ్లలేదు. ఇంద్రుడు దాన్ని పరీక్షిద్దామని వచ్చి.. ‘‘అందరూ వెళ్లిపోయినా, ఈ చెట్టుపై ఇంకేమీ లేకున్నా నీవెందుకు ఇక్కడే ఉన్నావ’’ని చిలుకను అడిగాడు.  ‘‘ఈ చెట్టుపై అన్నీ ఉన్నప్పుడు అనుభవించాం; ఇప్పుడు మోడువారిందని ఈ చెట్టును వదలివెళ్లడం కృతఘ్నత అవుతుంది కదా దేవేంద్రా!’’ అన్నదా చిలుక. ఇది భారతంలోని ఓ చిన్న కథ. చేసిన మేలు మరువకుండా ఎలా కృతజ్ఞతతో ఉండాలో చెప్పే సందేశం. ఆధ్యాత్మిక జీవనం గడిపే వాళ్లంతా దీన్ని తప్పక గ్రహించాలి. 

‘‘ఒకరిచేత లాభం పొంది, పనయ్యాక వారి మేలు మరిచిపోవడం కృతఘ్నత. వారి శవాన్ని కుక్కలు కూడా ముట్టవు’’ అని మహాభారతంలో విదురుడు చెప్తాడు. ఆధ్యాత్మిక జీవనంలో గురువు మంత్రం చెప్పినందువల్ల వారిని సర్వస్వంగా భావిస్తారు. జన్మ ఇచ్చినందుకు తల్లిదండ్రులను దైవస్వరూపంగా భావిస్తాం. మాతృదేవోభవ, పితృదేవోభవ అని గౌరవించడంలోని ఉద్దేశం ఇదే. పరోపకారబుద్ధితో నది నీళ్లు ఇచ్చినందుకు నదిని తల్లిగా, దేవతగా పూజించడం మొదలు పెట్టాం. నిజానికి మన పంటలకు, ప్రకృతికి జీవం ఇచ్చే జలదాతగా నదిని అర్చించేందుకే పుష్కరం. చక్కని గాలిని, పళ్లను అందించే చెట్లకు పూజలు చేయడం ఆచారంగా మార్చుకున్నాం. ఆ చెట్లు మనుషులకే కాదు పశుపక్ష్యాదులకు ఆశ్రయం, ఆహారం రెండూ ఇస్తాయి. ఇలా మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. అందుకే ప్రకృతి ఆరాధన ప్రారంభించాం. ఉదయం లేవగానే భూమిపై కాలు పెట్టేముందు.. ‘‘మా బరువుమోసి, మమ్మల్ని మోస్తున్నావ’’ని భూమికి ‘క్షమాప్రార్థన’ చేస్తున్నాం. శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చే సూర్యుణ్ని.. ప్రశాంతతనిచ్చే చంద్రుణ్ని దైవీశక్తులుగా భావించాం. ఇదంతా ఆరాధనగా అన్పించినా అందులోని అంతస్సూత్రం కృతజ్ఞతే. మన పూర్వులు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే ఋణపత్రాల్లో ‘‘సూర్య చంద్రుల సాక్షిగా’’ అని రాసిచ్చేవారు. సూర్య, చంద్రులు పగలు, రాత్రికి సంకేతం. అన్ని వేళలా నన్ను - నిన్నూ గమనించే సాక్షులని అర్థం. మరణానంతరం పితృదేవతలకు పిండాలు, తర్పణాలు వదలడం.. వారి పేరు మీద దానధర్మాలు చేయడం కూడా వారి పట్ల కృతజ్ఞత తెల్పడమే. ఇదంతా ఒక ‘ఆరాధన’ లాగా పైకి చెప్పినా.. మనం పొందిన ప్రతి విషయానికీ కృతజ్ఞతగా జీవించడమే దీని అంతరార్థం.

- డా.పి. భాస్కరయోగి

Updated Date - 2020-10-05T08:58:54+05:30 IST