Ramachandran: ఆయనతో పార్టీ బలోపేతం కాలేదు...

ABN , First Publish Date - 2022-09-16T13:15:31+05:30 IST

ఎడప్పాడి పళనిస్వామితో అన్నాడీఎంకే బలోపేతం కాలేదని ఆ పార్టీ సీనియర్‌ నేత బన్రూట్టి రామచంద్రన్‌(Ramachandran) అభిప్రాయపడ్డారు.

Ramachandran: ఆయనతో పార్టీ బలోపేతం కాలేదు...

                                 - సీనియర్‌ నేత బన్రూట్టి రామచంద్రన్‌


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 15: ఎడప్పాడి పళనిస్వామితో అన్నాడీఎంకే బలోపేతం కాలేదని ఆ పార్టీ సీనియర్‌ నేత బన్రూట్టి రామచంద్రన్‌(Ramachandran) అభిప్రాయపడ్డారు. నగరంలో గురువారం ఆయన అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ.పన్నీర్‌సెల్వం (O. Panneerselvam) బృందంతో కలిసి అన్నాదురై విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Jayalalithaa) మరణానంతరం జరిగిన మూడు ఎన్నికలను ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో ఎదుర్కొన్నా పరాజయం తప్పలేదన్నారు. ఎడప్పాడి నాయకత్వాన్ని ప్రజలు నిరాకరిస్తున్నారని ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు, అయిష్టాలతో పార్టీని నడిపించడం సాధ్యం కాదన్నారు. ముందు పార్టీని చక్కదిద్దిన అనంతరం ప్రజల మద్దతు కోరాలన్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే(AIADMK) అధిష్ఠానం సరిగా లేదన్నారు. పళనిస్వామి నాయకత్వం కొనసాగితే పార్టీ అధోగతిని ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. పార్టీని రక్షించి బలోపేతం చేసేందుకు ఎవరు ముందుకొచ్చినా తాను ఆదరిస్తానన్నారు. టీటీవీ దినకరన్‌ కూడా అన్నాడీఎంకేతో సామరస్యంగా ఉండాలని ఇష్టపడుతుండగా, శశికళ చట్టరీత్యా పార్టీని రక్షించుకోవాలని పోరాడుతున్నారన్నారు. ఒ.పన్నీర్‌సెల్వం, శశికళ లక్ష్యం ఒకటేనని, వారిద్దరు పార్టీని కాపాడుకొనేందుకు పోరాడుతున్నారని రామచంద్రన్‌ అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-09-16T13:15:31+05:30 IST