Abn logo
Jul 4 2020 @ 00:59AM

బాలాకోట్: మమతలు, మత్సరాలు

బ్రిటిష్ పాలకుల హయాంలో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్‌గా సుప్రసిద్ధమై, ప్రస్తుతం ఖైబర్ పఖ్తుంఖ్వా అని పిలుచుకుంటున్న పాకిస్థాన్ రాష్ట్రంలో హిందువులు, సిక్కులు ఇప్పుడు పిడికెడు మంది కంటే ఎక్కువ లేరు. మరి మన దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలోను ముస్లిం మైనారిటీలు చాలా పెద్ద సంఖ్యలో వున్నారు. ఆనాడు బాలాకోట్ హిందువులు, ముస్లింల మధ్య వర్థిల్లిన మానవీయ అను బంధాలను నేడు మన గ్రామీణ భారతంలో సురక్షితంగా పెంపొందించుకోగలమా? ఉదాత్త గాంధేయవాది మీరాబెన్ 1939లో భయపడినట్టుగా ఉభయ మతస్థులు ‘పరస్పర సహాయం,అన్యోన్య బాధ్యత’లతో సహజీవనం నెరపడాన్ని మన ‘నాయకులు’ అడ్డుకుంటారా?


బాలాకోట్ పేరు వినగానే మనకు 2019 ఫిబ్రవరిలో భారత వాయుసేన విజయవంతంగా పూర్తిచేసిన ఉగ్రవాద శిక్షణా శిబిరాల విధ్వంసం గుర్తు కొస్తుంది. సైనిక చరిత్రకారులకయితే 1831 మేలో మహారాజా రంజిత్ సింగ్, సయద్ అహ్మద్ బరెల్వి సైన్యాల మధ్య జరిగిన యుద్ధం గుర్తుకొస్తుంది. ఈ వ్యాసం బాలాకోట్ గురించే అయినప్పటికీ ఆ రెండు సంఘటనలతో దీనికి నిమిత్తం లేదు. ఆ రెండు ఘటనలు సంభవించిన మధ్య కాలంలో చోటు చేసుకున్న ఒక ఉదాత్త సంఘటనే నాయీ రచనకు స్ఫూర్తి.


1939 మే లో ఒక గొప్ప భారతీయ దేశభక్తురాలు బాలాకోట్, దాని పరిసర ప్రాంతాలను సందర్శించారు. అక్కడి ప్రకృతి దృశ్యాల శోభను, ప్రజల జీవన రీతుల మానవీయతను ఆమె తన దినచర్య పుస్తకంలో సవివరంగా రాశారు. ఇప్పటికీ వెలుగు చూడని ఆ డైరీని ఒక పాత దస్తావేజుల భాండాగారంలో కనుగొన్నాను. ఆ దేశభక్తురాలి పేరు మెడిలియన్ స్లేడ్ (1892లో ఇంగ్లాండ్‌లో జన్మించిన ఈ మానవతా వాది 1982లో ఆస్ట్రియాలో మరణించారు). బ్రిటిష్ అడ్మిరల్ కుమార్తె అయిన స్లేడ్, మహాత్మాగాంధీ అనుయాయురాలై, అహ్మదాబాద్, సేవాగ్రాంలలోని ఆయన ఆశ్రమాలలో నివశించారు. ఆమె తన పేరును మీరాగా మార్చుకోవడమేకాదు, గాంధీజీని అనుసరించి భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. పలుమార్లు సుదీర్ఘ కాలం కారాగారవాసం చేశారు. మన జాతీయోద్యమ చరిత్ర గ్రంథాలలో మీరా బెన్ గురించి సవివరమైన కథనాలు ఉన్నాయి.


మీరా బెన్ గురించి నాకు బాగా తెలుసు. అయితే 1939లో ఆమె బాలాకోట్‌ను సందర్శించారన్న విషయం ఇటీవల మాత్రమే నా దృష్టికి వచ్చింది. ఆ నాడు, ఇప్పుడు సార్వభౌమిక దేశాలుగాఉన్న భారత్, పాకిస్థాన్‌లు ఉనికిలో లేవు. బ్రిటిష్ ఇండియాలోని నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్‌లో బాలా కోట్ ఉన్నది. ఆ రాష్ట్రంలో ఖుదాయి ఖిట్మాట్గార్స్ అనే స్వాతంత్ర్య పోరాట యోధుల బృందం ఒకటి ఉన్నది. ఆ బృందనాయకుడు గాంధీజీ అనుయాయి. మీరా బెన్ కంటే విశిష్టుడు. ఆయన పేరు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఆయన తన వ్యక్తిత్వ బలిమితో, యుద్ధ ప్రవృత్తి గల పఠాన్లను అహింసావాదులుగా, మత సామరస్యాన్ని పరిపూర్ణంగా పాటించేవారుగా తీర్చి దిద్దారు.


1939 వసంతకాలంలో మహాత్ముడు, మీరాబెన్‌ను ఖాదీ ప్రచారోద్యమానికై ఆ సరిహద్దు రాష్ట్రానికి పంపించారు. అప్పుడే ఆమె బాలాకోట్‌ను సందర్శించారు. అబ్బోత్తాబాద్ పట్టణం (అమెరికా సైన్యం హతమార్చేంతవరకు ఒసామా బిన్ లాడెన్ ఇక్కడే అజ్ఞాత వాసం గడిపాడు) నుంచి రోడ్డు ద్వారా బాలాకోట్‌కు ఆమె ప్రయాణించారు. ఆమె తన డైరీలో ఇలా రాసుకున్నారు: ‘గ్రామాలు, పొలాల చుట్టూ పచ్చని చెట్లతో ప్రకృతి ఆహ్లాదకరంగాఉన్నది. సమీపంలో నీల పర్వతాలు, సుదూరాన మంచుకొండలు చూడమచ్చటగా కన్పిస్తున్నాయి’. బాలాకోట్‌కు ఈవల ఉన్న ఒక గ్రామంలో మీరా, ఆమె ఖుదాయి సహచరులు ఒక రాత్రి బస చేశారు. ఆ మరుసటి రోజు ఆమె ఉదయపు నడకకు వెళ్లారు. తన డైరీలో ఇలా రాసుకున్నారు: ‘కొత్త పంటల సాగుకు రైతులు పొలాలు దున్నుతున్నారు. కొన్నిచోట్ల అప్పుడే నూర్పిళ్ళు కూడా చేస్తున్నారు. బసకు తిరిగివస్తుండగా కోయిలల వసంతగానం నాకు వీనుల విందు చేసింది’. ఉదయకాల ఉపాహారం అనంతరం మీరా, ఆమె సహచరులు బాలాకోట్‌కు బయలుదేరారు మార్గమధ్యమంలో ఒక అటవీ బంగ్లాలో ఆగారు. ‘బాపూజీ కొంతకాలం విశ్రాంతి తీసుకోవడానికి ఇది సరైన ప్రదేశమని’ మీరా భావించారు. అయితే అక్కడ నీటికొరత తీవ్రంగా ఉందన్న వాస్తవాన్ని కూడా ఆమె గమనించారు. (గాంధీజీ అంతకు ముందు సంవత్సరం ఆ రాష్ట్రంలో పర్యటించారు. మరొకసారి పర్యటించదలుచుకున్నారుగానీ సాధ్యం కాలేదు. అయితే బాలాకోట్‌కు సమీపంలోని ఫారెస్ట్ బంగ్లా మహాత్ముడు విశ్రాంతి తీసుకోవడానికి సరైన ప్రదేశమని భావించడం మాత్రం వింతగానే ఉన్నది).


బాలాకోట్‌కు వెళ్ళే మార్గం కుంబార్ నదీలోయ గుండా సాగుతుంది. ఇరుకైన మార్గమది. మిట్ట పల్లాలు అధికం. అయితే కుంబార్ ప్రవాహమూ, ఆ వాహినికి ఆవల ఈవల కన్నుల పండువగా ఉన్న ప్రకృతి దృశ్యాలు మీరాను అమితంగా ఆకట్టుకున్నాయి. కుంబార్‌ను వీక్షిస్తూ ఆమె సబర్మతిని గుర్తు చేసుకున్నారు. జీలం నదిలో సంగమించే కుంబార్ ఆమెను విశేషంగా ఆకట్టుకున్నది.

ఆహ్లాదకరమైన ప్రయాణమనంతరం మీరాబెన్ బాలాకోట్‌కు చేరుకున్నారు. ‘బాలా కోట్ ఒక పెద్ద గ్రామం. ఒక చిన్న కొండచుట్టూ విస్తరించివున్నది. కగాన్‌లోయ ప్రారంభమయ్యే చోట ఈ గ్రామమున్నదని. గ్రామ దుకాణదారులలో హిందువులు, సిక్కులు కూడా ఉన్నారని’ ఆమె తన డైరీలో రాశారు. బాలాకోట్‌లో నివశించే గుజ్జర్ పశువుల కాపర్లు శ్రేష్ఠమైన ఉన్ని కంబళ్లు నేస్తారని మీరాబెన్‌కు చెప్పారు. అయితే వేసవిలో గుజ్జర్లు గ్రామంలో ఉండరు. తమ గొర్రెలు, మేకలను మేపుకునేందుకు పర్వతోన్నత ప్రాంతాలకు వలసపోతారు. ఆ వేసవిలో కూడా యథావిధిగా అలానే వలసవెళ్లారు. గుజ్జర్లను కలుసుకునే అవకాశం లేకపోవడం పట్ల మీరా కించిత్ నిరుత్సాహానికి లోనయ్యారు అయితే అబ్బాస్ ఖాన్ అనే ఖుదాయి సహచరుడు గుజ్జర్లకు కబురు పంపగా వారు మరుసటిరోజు బాలాకోట్‌కు వచ్చారు. ఉన్ని కంబళ్ల నేత గురించి పలు ప్రశ్నలు వేసి ఆమె తెలుసుకున్నారు.


మీరా, ఆమె ఖుదాయి సహచరులు బాలాకోట్ నుంచి పర్వత ప్రాంతాలలోకి మరింత ముందుకుసాగిపోయారు. భోగార్మాంగ్ అనే గ్రామం వద్ద వారు ఆగారు. ఆ గ్రామ పరిసరాలలోని వరిక్షేత్రాలను చూసి ఆమె పరవశించిపోయారు. కొండవాలులలోని పచ్చని పొలాలకంటే నా హృదయంలోని ఆనందతంత్రులను సంపూర్ణంగా మీటిన ఈ గ్రామంలోని మరో విశేషం హిందువులు-ముస్లింల మధ్య సంపూర్ణ సామరస్యమని మీరా తన డైరీలో రాసుకున్నారు. ఆమె ఇంకా ఇలా రాశారు: ‘ఒక హిందూ కుటుంబ పెద్ద అయిన ఒక పండు వృద్ధుడు యువ ముస్లింలతో ఉల్లాసంగా సంభాషిస్తున్నాడు. ఆ చిన్నారుల తాత, తండ్రి నాకు ఎంతో ఆప్తులని ఆ హిందూ పెద్ద మనిషి చెప్పాడు. మతాలు వేరుకావచ్చు గానీ పరస్పర సహాయం, అనోన్య బాధ్యతలతో సహజీవనం నెరపడం తమ సంప్రదాయమని ఆ వృద్ధుడు చెప్పారు. ఇది విన్న వెంటనే ‘‘నాయకులు’’ ఎవరూ ఈ చిన్న గ్రామానికి రాకుండా ఉండుగాక! ఇక్కడి సహజ సుందర, మధుర జీవితం వారి కళ్లబడకుండా ఉండుగాక’ అని నా హృదయం ఆ పరాత్పరుడిని ప్రార్థించింది’. హిందూ-ముస్లింల మధ్య సామరస్య సంబంధాలకు ఆదర్శప్రాయమైన నెలవుగా ఉన్న భోగార్మాంగ్ గ్రామమే మీరా బెన్ చివరి మజిలీ. ఆ మరుసటి ఉదయం ఆమె అబ్బోత్తాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. కొద్ది వారాల అనంతరం గాంధీజీ ఉన్న సేవాగ్రాంకు చేరారు.


1939 సెప్టెంబర్‌లో ఐరోపాలో ద్వితీయ ప్రపంచ సంగ్రామం ప్రారంభమయింది. ఆ యుద్ధం చరిత్ర గమనాన్ని శాశ్వతంగా మార్చి వేపింది. యుద్ధ పర్యవసానాలు భారత్‌కు, భారతీయులకు ఎంతో మనస్తాపం కలిగించాయి. హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు మరింతగా తీవ్రతర మయ్యాయి. ఉభయ మత వర్గాలలోని ‘నాయకులు’ ఆ విభేదాలను రెచ్చగొట్టి, ప్రజ్వలింప చేశారని మీరా భావించారు. అటువంటి ‘నాయకులు’ ఇరు వర్గాలలోనూ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారన్న వాస్తవాన్ని కూడా ఆమె గుర్తించారు. ఆ యుద్ధకాలంలో నార్త వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్‌లో బలీయంగా ఉన్న మత సామరస్యం భగ్నమయింది. గఫార్ ఖాన్ పార్టీకి ప్రజాదరణ తగ్గిపోయి ప్రత్యర్థి పక్షం ముస్లింలీగ్ బలపడింది. 1947 ఆగస్టులో పంజాబ్‌లో వలే ఆ పఠాన్ల రాష్ట్రంలో హింసాకాండ అంతగా సంభవించనప్పటికీ అక్కడ నివశిస్తున్న హిందువులు, సిక్కులు భారత్‌కు శరణార్థులుగా వచ్చారు.

1939లో మీరాబెన్ సందర్శించిన బాలాకోట్ గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. అది ఇంకెంత మాత్రం బహుళ మతాల సహజీవనానికి నెలవుగా లేదు. ఇస్లామిక్ ఛాందస వాదానికి నిబద్ధమైన యోధుల శిక్షణా శిబిరం నెలవుగా అది క్రమంగా గణుతికెక్కింది.. అప్పటికీ ఇప్పటికీ బాలాకోట్, దాని పరిసర గ్రామాల నైసర్గిక పరిస్థితులు కూడా పూర్తిగా మారి పోయివుంటాయనడంలో సందేహం లేదు. దక్షిణాసియాలోని ఇతర కొండ ప్రాంతాలలో మాదిరిగానే అక్కడ కూడా అడవులు తరిగిపోయివుంటాయి. కొండరాళ్ళు, కలపతో నిర్మితమైన సంప్రదాయ గృహాల స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు వెలిశాయి. హస్తకళలు అంతరించిపోనున్నాయి. ఆచారబద్ధమైన జీవనశోభ శాశ్వతంగా కనుమరుగయింది.


ఈ వ్యాసం ఒక చారిత్రక స్మృతి శకలాన్ని నివేదించింది. అయితే ఆ గతం నుంచి మన వర్తమానం నేర్చుకోదగినదేమిటి? దీనిపై పర్యాలోచనతో ఈ వ్యాసాన్ని ముగించదలిచాను. బ్రిటిష్ పాలకుల హయాంలో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్‌గా సుప్రసిద్ధమై, ప్రస్తుతం కైబర్ పఖ్తుంఖ్యగా పిలవబడుతున్న పాకిస్థాన్ రాష్ట్రంలో ఇప్పుడు హిందువులు, సిక్కులు పిడికెడు మంది కంటే ఎక్కువగా లేరు. మరి మన దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలోను ముస్లిం మైనారిటీలు చాలా పెద్ద సంఖ్యలో వున్నారు. ఆనాడు బాలాకోట్, దాని పరిసర ప్రాంతాల్లో హిందువులు, ముస్లింల మధ్య వర్థిల్లిన మానవీయ అను బంధాలను నేడు మన గ్రామీణ భారతంలో సురక్షితంగా పెంపొందించుకోగలమా? ఉదాత్త గాంధేయవాది మీరా బెన్ 1939లో భయపడినట్టుగా ఉభయ మతస్థులు ‘పరస్పర సహాయం, అన్యోన్య బాధ్యత’లతో సహజీవనం నెరపడాన్ని మన‘నాయకులు’ అడ్డుకుంటారా?రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...

Advertisement