Advertisement
Advertisement
Abn logo
Advertisement

మానవోత్తముడు, విశ్వపౌరుడు

దక్షిణాఫ్రికా అంతరాత్మ ఆర్చ్‌బిషప్ డెస్మండ్ టుటు (1931–2021). జాత్యహంకార ప్రభుత్వ క్రూరత్వాన్ని నేరుగా ఎదుర్కొన్న ధీరుడు. జాతి వివక్ష వ్యవస్థ అంతమైన తరువాత ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పాలనలో పెచ్చరిల్లిన అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్ని బహిరంగంగా విమర్శించిన ప్రజాహితుడు. సొంత దేశంలోని అన్యాయాలనే కాదు, పాలస్తీనీయులపై ఇజ్రాయిల్ దురాగతాలను, మయన్మార్‌లో రోహింగ్యాలపై ఆంగ్‌సాన్ సూకీ ప్రభుత్వ దమన కాండను తీవ్రంగా నిరసించిన మానవతావాది. మానవాళికి ఒక నైతిక మార్గదర్శిగా సొంత దేశంలోనూ, విశాల ప్రపంచంలోనూ గుర్తింపు పొందిన మానవోత్తముడు ఆర్చ్‌బిషప్ డెస్మండ్ టుటు.


నెల్సన్ మండేలా దేశమే ఇటీవల నా ఆలోచనలను పూర్తిగా ఆవరించి ఉన్నది. టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఆడుతున్న టెస్ట్ సిరీస్ అందుకొక పాక్షిక కారణం కాగా ఆర్చ్‌బిషప్ డెస్మండ్ టుటు ప్రధాన కారణం. ఇటీవల ఆయన మరణంతో, ‘ఎపార్థీడ్’ (జాతి వివక్ష) విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన మహాన్నత స్వేచ్ఛాయోధుల శకం ముగిసింది. మాతృదేశంలో శ్వేత జాతి దురహంకార పాలనకు వ్యతిరేకంగా పోరాడిన బిషప్ టుటు ఇతర దేశాలలో సాగుతున్న అన్యాయాలు, అణచివేతలపై కూడా అదే స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు, హక్కుల యోధులు, విశేషించి అశేష సామాన్యులు ఆయన్ని ధర్మయోధుడుగా, కరుణామయుడుగా గౌరవిస్తున్నారు. తన సమకాలికులలో మరెవ్వరి కంటే బిషప్ డెస్మండ్ టుటునే, బహుశా, ప్రపంచ అంతరాత్మగా గౌరవ మన్ననలు పొందిన మానవోత్తముడు.


డెస్మండ్ టుటును నేను మొట్టమొదట 1986 జనవరిలో ఒక టెలివిజన్ ప్రసారంలో చూశాను. అప్పుడు నేను అమెరికాలో అధ్యాపకుడుగా ఉన్నాను. ఆ సువిఖ్యాత మత గురువు అదే కాలంలో అమెరికాను సందర్శించారు. తమ దేశంలోని శ్వేత జాత్యహంకార ప్రభుత్వానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మద్దతు ఇవ్వడం సమంజసం కాదని అమెరికా ప్రజలకు, వాషింగ్టన్ పాలకులకు నచ్చజెప్పేందుకే ఆయన ఆ అగ్రరాజ్యంలో పర్యటించారు. పాశ్చాత్య దేశాలు కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించి, పటిష్ఠంగా అమలుపరిస్తే తప్ప తమ దేశంలో శ్వేతజాతి దురహంకార పాలనకు ముగింపు రాబోదని టుటు అభిప్రాయపడ్డారు. ఈ వాస్తవాన్ని విశదం చేసేందుకే జనరల్ మోటార్స్‌తో సహా పలు కార్పొరేట్ సంస్థల అధిపతులను కలుసుకున్నారు. అలాగే తమ దేశంలో భారీ స్థాయిలో చేసిన మదుపులను తక్షణమే ఉపసంహరించుకోవాలని అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల అధ్యక్షులను టుటు స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు.


పాలకులు, సంపన్నులు, విద్యావేత్తలతో పాటు 1960 దశకంలో అమెరికా పౌరహక్కుల ఉద్యమంలో పాల్గొన్న పలువురు వ్యక్తులను కూడా బిషప్ టుటు కలుసుకున్నారు. అమెరికన్లు ఆయన మనోజ్ఞతకు ముగ్ధులయ్యారు. నవ్వుతూ, తుళ్లుతూ, చమత్కార పూర్వకంగా మాటలాడడం ద్వారా అమెరికన్లను ఆ నల్లనయ్య బాగా ఆకట్టుకున్నారు. అమెరికన్లు ఆయన్ని తరచు మార్టిన్ లూథర్‌కింగ్‌తో పోల్చేవారు. అయితే ఈ పోలికను టుటు వినయపూర్వకంగా తిరస్కరించారు మార్టిన్ లూథర్‌కింగ్‌ను పలు విధాల ప్రశంసిస్తూ ఆయన తనకంటే చాలా సొగసైన వాడనే కితాబు నిచ్చారు.


దక్షిణాఫ్రికాలో భారీ మదుపులు చేసిన అమెరికన్ విశ్వ విద్యాలయాలలో, (నేను అధ్యాపకుడుగా ఉన్న) యేల్ యూనివర్శిటీ కూడా ఒకటి. టుటు ప్రసంగాలతో స్ఫూర్తి పొందిన యేల్ వర్శిటీ విద్యార్థులు, అధ్యాపకులు కొంతమంది యేల్ కార్పొరేషన్ బాధ్యులను కలుసుకుని దక్షిణాఫ్రికా నుంచి తమ పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల డిమాండ్ బుట్టదాఖలా అయింది. దీంతో విశ్వవిద్యాలయ గ్రంథాలయం ఎదుట ఉన్న విశాల ఆవరణలో విద్యార్థులు బైటాయింపు ధర్నా చేశారు. నినాదాలు చేశారు. పాటలు పాడారు. ప్రసంగాలు వెలువరించారు. నెల్సన్ మండేలా బొమ్మలను ప్రదర్శించారు. అన్నట్టు మండేలా అప్పటికీ ఇరవై ఏళ్ళకు పైగా జైలులో ఉన్నారు. దక్షిణాఫ్రికాలో జాత్యహంకార పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మూర్తీభవించిన ప్రతీకగా ఆయన అప్పటికే వెలుగొందుతున్నారు.


యేల్ వర్శిటీలో నా అధ్యాపకత్వ కాలమే నేను మొట్టమొదట భారత్ వెలుపల నివశించిన రోజులు. మూడు పదులలోపు వయస్సులో ఉన్న నేను అప్పటికి దక్షిణాఫ్రికా పరిణామాలపై పెద్దగా శ్రద్ధ చూపడం ప్రారంభం కాలేదు. అమెరికన్ టీవీలో బిషప్ టుటు ప్రసంగం విన్న తరువాతనే దక్షిణాఫ్రికా పరిణామాలపై నేను పూర్తి శ్రద్ధ చూపడం ప్రారంభమయింది. భారత్‌కు తిరిగివచ్చిన తరువాత దక్షిణాఫ్రికా రాజకీయాలను మరింత నిశితంగా గమనించసాగాను. ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికాపై అమెరికా, యూరోప్‌ల ఆంక్షలు తీవ్రమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, బ్రిటిష్ ప్రధాని మార్గరేట్ థాచర్ తమ మౌనాన్ని విడనాడి దక్షిణాఫ్రికా ప్రభుత్వ జాత్యహంకార విధానాలను తక్షణమే త్యజించి తీరాలని బహిరంగంగా పదే పదే ప్రకటనలు చేయడం ప్రారంభించారు. జాత్యహంకార పాలకులు మండేలాను అప్పటికింకా విడుదల చేయలేదు. విదేశీ సందర్శకులను మాత్రమే ఆయన్ని కలవడానికి అనుమతించేవారు. అలా మండేలాను కలిసిన వారిలో ఆస్ట్రేలియా మాజీ ప్రధాని మాల్కం ఫ్రేసర్ ఒకరు. మండేలా ఆయన్ని అడిగిన మొట్టమొదటి ప్రశ్న: ‘డాన్ బ్రాడ్‌మన్ ఇంకా బతికే ఉన్నారా?’


1991లో నేను లండన్‌లో గోపాలకృష్ణ గాంధీ గృహంలో ఆంగ్లికన్ చర్చి పూజారి ట్రెవోర్ హడెల్‌స్టోన్‌ను కలుసుకున్నాను. 1950ల్లో జాత్యహంకార పాలనా విధానాలను ప్రశ్నించినందుకు ఆయన్ని దక్షిణాఫ్రికా నుంచి వెలివేశారు. జోహాన్నెస్‌బర్గ్‌లోని ఒక చర్చి పూజారిగా ఉండగా ఆయన పలువురు యువ ప్రతిభావంతులను అనేక విధాల ప్రోత్సహించారు. డెస్మండ్ టుటు వారిలో ఒకరు. మరొకరు జాజ్ సంగీతవేత్త హ్యు మసెకేల. గోపాలకృష్ణ గృహంలో ఒకరు మీ ఆరోగ్యం ఎలా ఉందని పరామర్శించగా ‘ఎపార్థీడ్ (జాతి వివక్ష) వ్యవస్థ నా కంటే ముందే చనిపోవాలని కోరుకుంటున్నానని’ హడెల్ స్టోన్ సమాధానమిచ్చారు. ఆయన కోరిక ఫలించింది. 1994లో నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు అయిన తరువాత హడెల్ స్టోన్ ఆ దేశాన్ని సందర్శించారు.


1997–2009 సంవత్సరాల మధ్య నేను దక్షిణాఫ్రికాను ఐదుసార్లు సందర్శించాను. ప్రతిసారీ జాతి వివక్ష విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన కొంతమంది అసాధారణ వ్యక్తులను కలుసుకున్నాను. వారిలో ఒకరు కవి మాంగానే వాలీ సెరోటె. కళలు, సంస్కృతి వ్యవహారాలపై పార్లమెంటరీ కమిటీకి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. మరొకరు సామాజిక శాస్త్రవేత్త ఫాతిమా మీర్. వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆమె ఇప్పటికీ ప్రజా వ్యవహరాల్లో చురుగ్గా ఉన్నారు. న్యాయకోవిదుడు అలెబి సషెస్, చరిత్రకారుడు రేమండ్ సట్నెర్లను కూడా కలుసుకున్నాను. జాత్యహంకార పాలకుల హింసాత్మక దాడులకు ఈ ఇరువురూ బాధితులయ్యారు. వీరు ఇప్పటికీ తమ తమ రంగాల్లో క్రియాశీలంగా ఉన్నారు. ఒక అమానుష వ్యవస్థపై ధీరోదాత్తంగా పోరాడిన ఈ మహోన్నతులు దక్షిణాఫ్రికాను బహుళ జాతుల సమ్మేళన సమాజంగా పునర్నిర్మించేందుకు అంకితమయ్యారు.


విభిన్న నేపథ్యాల నుంచి ప్రభవించిన ఈ మేధావులు ఎటువంటి ద్వేష భావం లేకుండా అన్ని జాతులవారూ సమభావంతో విలసిల్లే నవ సమాజాన్ని దృఢసంకల్పంతో నిర్మిస్తున్నారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే దక్షిణాఫ్రికాలో ప్రభవిస్తోన్న ‘రెయిన్‌బో నేషన్’ (ఇంద్రధనస్సు జాతి- ఈ పదాన్ని బిషప్ టుటునే సృష్టించారు)కు వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఉదాత్తుల కృషి గురించి తెలుసుకున్న తరువాత నాకు ఒక ఆలోచన వచ్చింది. అలనాటి మన మహోన్నత నాయకుల స్ఫూర్తిదాయక ఆదర్శాలతో పునీతమైన ఆ శుభ కాలంలో అంటే 1940వ దశకం ద్వితీయార్ధంలోనూ, 1950వ దశకం ప్రథమార్ధంలోనూ భారత్‌లో ఒక ఉపాధ్యాయుడుగా, ఒక సామాజిక కార్యకర్తగా, ఒక సివిల్ సర్వెంట్‌గా, ఒక న్యాయమూర్తిగా ఉండి ఉంటే!


దక్షిణాఫ్రికా పర్యటనలలో నేను రచయితలు, విద్వాంసులను మాత్రమే కలుసుకున్నాను. ఆర్చ్‌బిషప్ టుటును కలుసుకోవడంకాదు కదా, సమీపం నుంచి చూడడం కూడా సంభవించలేదు. అయితే 2005లో ఆయన తన వ్యక్తిగత పనిమీద బెంగలూరుకు వచ్చారు. ఒక మిత్రుడు ఆయన గౌరవార్థం ఇచ్చిన విందుకు నన్ను కూడా ఆహ్వానించాడు. అప్పుడు ఆయనతో ఇరవై నిమిషాల పాటు సంభాషించడం జరిగింది. తొలుత ఆయన సచిన్ టెండూల్కర్ క్రీడా నైపుణ్యాలను బహుదా మెచ్చుకున్నారు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్లకు వ్యతిరేకంగా సచిన్ టెండూల్కర్ అద్భుతమైన స్ట్రోక్ ప్లే, పరుగుల గురించి ఆయన మాట్లాడారు. ఆ తరువాత నేను ట్రెవొర్ హడెల్ స్టోన్‌తో నా సమావేశం గురించి చెప్పాను. ఆయన చాలా ఆనందించారు. ‘ట్రెవోర్ ఒక ఆఫ్రికన్‌లా నవ్వుతాడు – తన సమస్త శరీరంతో’ అని ఆయన వ్యాఖ్యానించారు.


బిషప్ డెస్మండ్ టుటుతో నాకు వ్యక్తిగతంగా ఉన్న ఈ స్వల్ప సంబంధాలు- యేల్ వర్శిటీలో ఆయనతో ఉత్తేజితమైన విద్యార్థి నిరసనలు, రెండు దశాబ్దాల అనంతరం మా ఊరు బెంగలూరులో సంభాషణలు- లేనప్పటికీ ఆయన మరణానికి నేను చాలా విచారగ్రస్తుడినయి ఉండేవాణ్ణి. మానవాళికి ఒక నైతిక మార్గదర్శిగా సొంత దేశంలోనూ, విశాల ప్రపంచంలోనూ గుర్తింపు పొందిన చివరి వ్యక్తి, బహుశా ఆర్చ్‌బిషప్ టుటు అని చెప్పవచ్చు. ఆయన దక్షిణాఫ్రికా మనస్సాక్షి. జాత్యహంకార ప్రభుత్వ క్రూరత్వాన్ని నేరుగా ఎదుర్కొన్న ధీరుడు.


జాతి వివక్ష వ్యవస్థ అంతమైన తరువాత ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పాలనలో పెచ్చరిల్లిన అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్ని బహిరంగంగా విమర్శించిన ప్రజా హితుడు ఆర్చ్‌బిషప్ టుటు. సొంత దేశంలోని అన్యాయాలనే కాదు, పాలస్తీనీయులపై యూదుల, ఇజ్రాయిల్ ప్రభుత్వ దురాగతాలను, మయన్మార్‌లో రోహింగ్యాలపై తన సహచర నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఆంగ్‌సాన్ సూకీ ప్రభుత్వ దమన కాండను తీవ్రంగా నిరసించిన మానవతావాది డెస్మండ్ టుటు. స్వలింగ సంపర్కత విషయమై తన సొంత ఆంగ్లికన్ చర్చి వైఖరికి తీవ్ర అసమ్మతి తెలిపిన ఉదారవాది టుటు.


డెస్మండ్ టుటు జీవితం, వారసత్వంలో మన దేశానికి కొన్ని హితకరమైన పాఠాలు ఉన్నాయి. ముఖ్యంగా అంతర్-మత సామరస్యం విషయంలో ఆయన నిబద్ధత వర్తమాన భారతదేశానికి చాలా ఉపయుక్తమైనది. ఈ క్రైస్తవ మతగురువు ఎటువంటి సంకుచితత్వాలులేని విశాల హృదయుడు. క్రైస్తవేతర మతాల మహాత్ముల గురించి మాట్లాడుతూ ‘భగవంతుడు ఒక క్రైస్తవుడు కాడు’ అని ఆయన ఒకసారి వ్యాఖ్యానించారు. అవును, ఆ పరాత్పరుడు ఒక హిందువు కూడా కాడు.

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...