రాములోరి తీర్థానికి మోకాలడ్డు!

ABN , First Publish Date - 2022-01-18T05:46:53+05:30 IST

జిల్లాలోని రావికమతం మండలం కిత్తంపేట గ్రామంలో పూర్వీకుల నుంచి ఆలయ ధర్మకర్తలు నిర్వహిస్తున్న రామాలయ తీర్థాన్ని ఈ ఏడాది అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారు

రాములోరి తీర్థానికి మోకాలడ్డు!
అధికార పార్టీ నేతల ఫిర్యాదుతో రామాలయం గుడి గేట్లు తెరవకుండా కాపలా కాస్తున్న పోలీసులు

మాన్యం శిస్తు ఇవ్వండి...తామే నిర్వహిస్తామంటూ అధికార పార్టీ సర్పంచ్‌ హుకుం

అంగీకరించని ఆలయ ధర్మకర్తలు

తీర్థం జరగకుండా అడ్డుకున్న సర్పంచ్‌ వర్గీయులు

ఆలయం గేట్లు కూడా తెరవనివ్వని పోలీసులు

స్వామివారికి దూపధీప నైవేద్యాలు అందని వైనం


 రావికమతం, జనవరి 17: జిల్లాలోని రావికమతం మండలం కిత్తంపేట గ్రామంలో పూర్వీకుల నుంచి ఆలయ ధర్మకర్తలు నిర్వహిస్తున్న రామాలయ తీర్థాన్ని ఈ ఏడాది అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారు. దేవుడి మాన్యంపై వస్తున్న శిస్తుతో పాటు భక్తుల చందాలు తమకు ఇవ్వాలని, తీర్థం తామే చేస్తామని సర్పంచ్‌ హుకుం జారీచేశారు. దీనికి ధర్మకర్తలు నిరాకరించడంతో పోలీసులను రప్పించి ఆలయం వద్ద కాపలా పెట్టి మరీ తీర్థం జరగకుండా ఆపేశారు. 


కిత్తంపేటలో రామాలయానికి కొంత మాన్యం ఉంది. ఏటా ఈ మాన్యంపై రూ.15 నుంచి రూ.20 వేలు వస్తుంది. దీంతో పాటు భక్తులు ఇచ్చిన డబ్బుతో ఆలయ ధర్మకర్తలు చందనశెట్టి బోడినాయుడు, ఈశ్వరరావు, అచ్చంనాయుడు, అడవిరాజు ఆధ్వర్యంలో ఏటా రాములవారి తీర్థాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే మాదిరిగా ధర్మకర్తలు తీర్థ మహోత్సవాల కోసం ఆలయానికి రంగులు వేయించడంతో పాటు ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌ పెదిరెడ్ల రామలక్ష్మి, ఆమె భర్త నాయుడు, వారి వర్గీయులు ఈ ఏడాది తీర్థం తామే చేస్తామని, దేవుని మాన్యం ద్వారా వచ్చిన శిస్తుతో పాటు భక్తుల ద్వారా వచ్చే చందాలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. దీనికి ధర్మకర్తలు నిరాకరించారు. దీంతో సర్పంచ్‌, ఆమె వర్గీయులు తీర్థం జరగనివ్వకుండా అడ్డగించి ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వచ్చి దేవాలయానికి తాళం వేశారు. అక్కడే కాపలా ఉండి...స్వామివారికి కనీసం ధూపదీప నైవేద్యాలు కూడా పెట్టనివ్వలేదు. అలాగే సోమవారం జరగాల్సిన తీర్థాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య స్పల్ప ఘర్షణలు జరిగాయి.

Updated Date - 2022-01-18T05:46:53+05:30 IST