మాచర్లలో అలజడి

ABN , First Publish Date - 2022-04-11T02:07:14+05:30 IST

ప్రభుత్వ విప్‌, పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కేబినేట్‌లో చోటు దక్కకపోవడంతో నియోజకవర్గంలో

మాచర్లలో అలజడి

మాచర్ల: ప్రభుత్వ విప్‌, పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కేబినేట్‌లో చోటు దక్కకపోవడంతో నియోజకవర్గంలో అలజడి రేగింది. పట్టణంలోని బస్టాండ్‌ సెంటర్‌, మాచర్ల-సాగర్‌ రహదారి, మండల కేంద్రమైన రెంటచింతల-గుంటూరు ప్రధాన రహదారిపై టైర్లు తగులబెట్టి మంటలు పెట్టారు. మోటారు బైకును దగ్థం చేశారు. కారంపూడిలో ధర్నా నిర్వహించారు. రెంటచింతలలో మహిళా ఎంపీటీసీ సంపూర్ణ మంటల్లో దూకి ఆత్మహత్య యత్నం చేయగా, వైసీపీ కార్యకర్తలు నిలువరించారు. మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌ తురకా కిషోర్‌ సహా మరో 30 మంది కౌన్సిలర్లు పురపాలక సంఘంలో సమావేశమై మూకుమ్మడిగా రాజీనామాలు ప్రతిపాదించారు.


అయితే ఆదివారం కమిషనర్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం రాజీనామాలు అందించే అవకాశం ఉంది. అలాగే నియోజకవర్గంలోని ఆయా ఎంపీడీవో కార్యాలయాల పరిధిలోని ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పదవులకు రాజీనామాలు చేసే దిశగా తీర్మానం చేసుకున్నారు. నాలుగుసార్లు శాసనసభ్యునిగా ఎన్నికైన పిన్నెల్లికి మంత్రి పదవి రాకపోవడం కేడర్‌ జీర్ణించుకోలేకపోతోంది. రెండు రోజులుగా విజయవాడలోనే మకాం వేసి అధినేత నుంచి కబురు కోసం ఎదురుచూసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి వర్గంలో తనకెటువంటి చోటు లేదన్న సమాచారంతో విచారంగా వెనుదిరిగి ఆదివారం మధ్యాహ్నానికి మాచర్లకు చేరుకున్నారు. 

Updated Date - 2022-04-11T02:07:14+05:30 IST