రామప్ప వరద ప్రాంతాన్ని రీసర్వే చేయండి

ABN , First Publish Date - 2021-07-31T05:35:21+05:30 IST

రామప్ప వరద ప్రాంతాన్ని రీసర్వే చేయండి

రామప్ప వరద ప్రాంతాన్ని రీసర్వే చేయండి
రామప్ప సరస్సు ప్రధాన తూమును పరిశీలిస్తున్న ఐబీ అధికారులు

-  మత్తడి పునరుద్ధరణ పనులు చేపట్టాలి

-  నీటి ప్రవాహం వెళ్లేచోట్ల బ్రిడ్జిలు నిర్మించాలి 

-  రాష్ట్ర ఐబీ సాంకేతిక సలహాదారు విజయప్రకాశ్‌

వెంకటాపూర్‌ (రామప్ప), జూలై30 : మండలంలోని పాలంపేటలో ఉన్న రామప్ప సరస్సు వైశాల్యాన్ని, నీటినిల్వ సామర్థ్యాన్ని వెంటనే సర్వే చేయాలని రాష్ట్ర ఐబీ సాంకేతిక సలహాదారు విజయప్రకాశ్‌ ఆదేశించారు. ములుగు జిల్లా వెంకటాపూర్‌ (రామప్ప) మండలంలోని రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఆయన రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆయనకు తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం రామప్ప సరస్సు మత్తడి ప్రాంతాన్ని, రెండు తూములను, సరస్సును, పంట పొలాలకు వెళ్లే కాల్వల ను పరిశీలించారు.ఈ సందర్భంగా విజయప్రకాశ్‌ మాట్లాడుతూవర్షాకాలంలో అధికవర్షాలు కురిసినప్పుడు సరస్సులోకి 12 వేల క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. దానికి అనుగుణంగా మత్తడి నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్లేలా సాంకేతిక పరిజ్ఞానంతో మత్తడిని పునరుద్ధరణ చేపట్టి వెడల్పు చేయాలన్నారు. రామప్ప సరస్సు ప్రధాన తూము నుంచి వెళ్లే సోమికాల్వను, మత్తడి నుంచి ప్రధాన రహదారి వరకు ఉండే కాల్వను, రామాంజాపూర్‌ శివారులోని తొగరుకాల్వ మరమ్మతు పనులను చేసి, పొలాలకు నష్టం కలుగకుండా చేపట్టాలన్నారు. దీంతో పాటు ఆలయ తూర్పు ముఖద్వారాన ఉన్న రోడ్డుకు బ్రిడ్జి నిర్మాణం, పాలంపేట ప్రధాన రహదారిపై ఉన్న కాజ్‌వేపై హైలెవల్‌ బ్రిడ్జి, వీర్లకాల్వ నుంచి మోరంచవాగుకు మధ్యలో హైలెవల్‌ బ్రిడ్జిలు నిర్మించాలని, వెంటనే ఆ పనులను చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. వర ద ప్రవాహాన్ని తట్టుకునేలా మోరంచవాగును మూడు కిలోమీటర్ల పొడవు, వెడల్పు పనులను పెంచాలని, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. పట్టా భూములైతే రైతులకు పరిహారం అందించి, పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. 

గత ఏడాదిలాగా అధిక వర్షాలు కురిస్తే రైతులకు, గ్రామస్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పునరుద్ధరణ పనులను చేపట్టాలన్నారు. ఐబీ ఎస్‌ఈ సి.శ్రీనివాస్‌, చీఫ్‌ ఇంజనీర్‌ సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజర్‌ టి.శ్రీనివాస్‌, చీఫ్‌ ఇంజనీర్‌ కె.విజయభాస్కర్‌రావు, ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీఈ రవీందర్‌, ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ వెంకటకృష్ణారావు, ఏఈలు నారాయణస్వామి, మౌనిక, శ్రీకాంత్‌, సారాఫోరెంట్‌, వర్క్‌ఇన్‌స్పెక్టర్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-07-31T05:35:21+05:30 IST