30 ఏళ్ల కిందే అయోధ్య ఆలయ డిజైన్

ABN , First Publish Date - 2020-08-05T23:36:54+05:30 IST

అయోధ్యలో భవ్య రామాలయానికి భూమిపూజ కన్నుల పండువగా జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా

30 ఏళ్ల కిందే అయోధ్య ఆలయ డిజైన్

ఇంటర్నెట్ డెస్క్: అయోధ్యలో భవ్య రామాలయానికి భూమిపూజ కన్నుల పండువగా జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన భూమి పూజకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర గవర్నర్ ఆనంది బెన్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఆలయానికి సంబంధించిన తుది నమూనాలు నెట్టింట చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఉత్తర భారత శైలిలో.. నగారా పద్ధతిలో తీర్చిదిద్దిన నమూనాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ నమూనాలను ఆలయ ఆర్కిటెక్టుల కుటుంబానికి చెందిన ఆర్కిటెక్ట్‌ చంద్రకాత్‌ సోంపుర డిజైన్ చేశారు. 30 ఏళ్ల కిందటే రామాలయం డిజైన్‌ జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఘన్ శ్యామ్ బిర్లా సూచనతో అప్పటి విశ్వ హిందూపరిషత్ అధ్యక్షులు అశోక్ సింఘాల్ 1989లో చంద్రకాంత్‌ను సంప్రదించారు. అలా అయోధ్య డిజైన్ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. దేశంలో, దేశం బయట సుమారు 200 ఆలయాలకు సోంపుర కుటుంబం పని చేసింది.  


చంద్రకాంత్ తాత పద్మశ్రీ ప్రభాశంకర్‌ సోంపుర.. సోమ్‌నాథ్‌, శ్రీకృష్ణ జన్మస్థానమైన మథుర ఆలయాల డిజైన్‌లను రూపొందించడంతో పాటు ఆలయ పునర్మిర్మాణ పనులను పర్యవేక్షించారు. నగారా పద్ధతిలో రామాలయ ఆర్కిటెక్చర్‌కు తుదిరూపు ఇచ్చినట్టు 77 ఏళ్ల సొంపుర తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు మూడేళ్ల సమయం పడుతుందన్నారు.  161 అడుగుల ఎత్తైన మూడంతస్తుల రామ మందిరంగా నమూనాకు రూపకల్పన చేశారు. తొలుత పెన్సిల్ స్కెచ్‌లతో డిజైన్ ప్రారంభమైంది. అయితే అంతకుముందు ఆయన అయోధ్యలోని భూమి పరిశీలనకు వెళ్లగా.. అక్కడ భద్రత రిత్యా కుదరలేదు. దీంతో భక్తుడి వేషంలో వెళ్లి పాదాలతో కొలతలు తీసుకుని వచ్చారు.  అలా డిజైన్లు పూర్తి చేశారు. మొత్తం మూడు డిజైన్లు రూపొందించగా, వాటిలో ఇప్పుడున్న దాన్ని వీహెచ్‌పీ సెలక్ట్ చేసింది. అయితే దాన్ని కుంభమేళాలో సాధువుల పరిశీలనకు పెట్టగా వారు కూడా ఆమోదించారు. ఇప్పుడు ఆలయ నిర్మాణ పనుల్లో చంద్రకాంత్ పిల్లలు నిఖిల్ సోంపుర, ఆశిస్ సోంపుర భాగస్వాములు కానున్నారు. వారే పాత డిజైన్‌ను నవీకరించి ఇచ్చారు. 

Updated Date - 2020-08-05T23:36:54+05:30 IST