మహా రామాలయం ఎత్తు 160 అడుగులు!

ABN , First Publish Date - 2020-02-22T08:42:25+05:30 IST

అయోధ్యలో మహా రామ మందిర నిర్మాణం వచ్చే ఆరు నెలల్లోగా మొదలుకావొచ్చని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ అధ్యక్షుడు నృత్య గోపాల్‌ దాస్‌ గ్వాలియర్‌లో చెప్పారు.

మహా రామాలయం ఎత్తు  160 అడుగులు!

  • 125 నుంచి పెంచాలని యోచన
  • త్వరలో నిపుణులతో చర్చలు.. ఆరు నెలల్లో పనులు ప్రారంభం
  • ప్రత్యామ్నాయ స్థలాన్ని తీసుకునేందుకు సున్నీ వక్ఫ్‌ బోర్డు ఓకే


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: అయోధ్యలో మహా రామ మందిర నిర్మాణం వచ్చే ఆరు నెలల్లోగా మొదలుకావొచ్చని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ అధ్యక్షుడు నృత్య గోపాల్‌ దాస్‌ గ్వాలియర్‌లో చెప్పారు. ప్రస్తుతం రాముణ్ని కొలుస్తున్న చోటే ఆలయం ఉంటుందని, వీహెచ్‌పీ నమూనాయే ప్రాతిపదిక అని ఆయన శుక్రవారం నాడు ప్రకటించారు. కాగా- ఆలయం ఎత్తును 125 అడుగుల నుంచి 160 అడుగులకు పెంచాలని తాజాగా ప్రతిపాదిస్తున్నారు. గతంలో రెండు అంతస్తుల మేర వర్తులాకార నిర్మాణం ఉండాలని నిర్ణయించిన రూపశిల్పులు- ఇపుడు మరో అంతస్తు వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. వీహెచ్‌పీ  రూపొందించిన ఆకృతి ప్రకారమే కట్టాలని ఇంతదాకా భావించారు. అయితే ఇప్పుడు దానికి కొన్ని మార్పులు చేయనున్నారు.


‘‘వీహెచ్‌పీ రూపొందించిన నమూనా ఇప్పటికే ప్రజల్లో పాపులర్‌ అయింది. దీన్నే తీసుకుంటాం. అయితే ఎత్తు, అంతర నిర్మాణాల్లో మార్పులు, చేర్పులు తప్పనిసరి’’ అని ట్రస్ట్‌ సభ్యుల్లో ఒకరైన స్వామి గోవింద్‌ దేవ్‌ గిరి చెప్పారు. ‘‘మూడంతస్తులుండాలని అంతా భావిస్తున్నారు. దీనికి తోడు 35-అడుగుల ఎత్తయిన శిఖరంతో కూడిన మంటపం కూడా నిర్మించాలన్నది ప్రతిపాదన’’ అని మరో సభ్యుడు తెలిపారు. ఆలయ నమూనా, ఎత్తు, నిర్మాణ ప్రక్రియకు సంబంధించి ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్రా త్వరలోనే నిపుణులతో చర్చిస్తారని ట్రస్ట్‌ వర్గాలు తెలిపాయి. ఎప్పట్నుంచి నిర్మాణం మొదలవ్వాలన్నది కూడా ఆయనే చర్చించి ఓ అవగాహనకు వస్తారని వెల్లడించాయి. బహుశా ఆయన దానిని కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి తెలియపరచవచ్చని అంటున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని వస్తారా రారా అన్నది ఖరారు కాకపోయినా, ఈ కార్యక్రమానికి ఓ నిర్దిష్ట ప్రణాళిక ఉంటుందని మాత్రం తెలుస్తోంది. విశ్వహిందూ పరిషత్‌ మాత్రం తాము రూపొందించిన నమూనా ప్రకారమే నిర్మాణం జరగాలని వాదిస్తోంది.


ఒకవేళ ఆకృతి మారిస్తే ఆలయ నిర్మాణం మరింత జాప్యమవుతుందని పేర్కొంది. 1987లో అప్పటి వీహెచ్‌పీ అధ్యక్షుడు అశోక్‌ సింఘాల్‌ సూచనల మేరకు నమూనాను ఆలయ శిల్పి చంద్రకాంత్‌ సోంపురా రూపొందించారు. వైష్ణవాలయాలు సహజంగా ఉండే అష్టభుజ ఆకృతిలో పూర్తి రాతితో నిర్మించాలని ఆనాడు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆలయ నిర్మాణానికి దాదాపుగా 1.75లక్షల శతకోటి ఘనపుటడుగుల రాయి అవసరమవుతుందని ఓ అంచనా. మూడేళ్లలో ఇది పూర్తి చేయాలన్నది లక్ష్యం. ప్రస్తుత ట్రస్ట్‌ కూడా ఇదే కాలపరిమితి పెట్టుకుంది. వీహెచ్‌పీ ఆకృతి ప్రకారం... ఆలయం పొడవు 270 అడుగులు, వెడల్పు 135 అడుగులు, ఎత్తు 125 అడుగులు. ప్రతీ అంతస్తులో 106 స్తంభాలు, వాటిని ఆనుకుని 185 రాతి దూలాలు. తలుపులన్నీ చెక్కతో చేసి చలువరాతి ఫ్రేములకు బిగిస్తారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రాముడి విగ్రహం, మొదటి అంతస్తులో రామ దర్బారు ఉండాలని నమూనా చెబుతోంది. మొత్తం ఐదు ప్రవేశ ద్వారాలుంచాలని నిశ్చయించారు.


ప్రధాని దిశా నిర్దేశం

రామాలయ నిర్మాణ ట్రస్ట్‌ సభ్యులు గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైనపుడు ఆయన వారికి కొన్ని స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వివాదాలకు తావులేకుండా సామరస్యంగా నిర్మాణం సాగాలని స్పష్టం చేశారు. శంకుస్థాపన కూడా ఆర్భాటంగా నిర్వహించకూడదని ప్రధాన మంత్రి తేల్చిచెప్పారని ట్రస్ట్‌ ప్రధానకార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు.

Updated Date - 2020-02-22T08:42:25+05:30 IST