మానవత్వానికి పునాది కావాలి!

ABN , First Publish Date - 2020-08-06T05:46:57+05:30 IST

అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆమె చిరకాల స్వప్నం... 31 ఏళ్ళ కిందట.. అక్కడ ‘శిలాన్యాస్‌’ జరిగేవరకూ జుట్టు ముడి వెయ్యనని శపథం చేసి, మాట నిలబెట్టుకున్నారు. ‘శిలాన్యాస్‌’లో తొలి పూజ చేసే అరుదైన అవకాశాన్ని అందుకున్నారు భారతీయం సత్యవాణి...

మానవత్వానికి పునాది కావాలి!

అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆమె చిరకాల స్వప్నం... 31 ఏళ్ళ కిందట.. అక్కడ ‘శిలాన్యాస్‌’ జరిగేవరకూ జుట్టు ముడి వెయ్యనని శపథం చేసి, మాట నిలబెట్టుకున్నారు. ‘శిలాన్యాస్‌’లో తొలి పూజ చేసే అరుదైన అవకాశాన్ని అందుకున్నారు భారతీయం సత్యవాణి. నిన్న రామమందిరానికి భూమిపూజ జరిగిన నేపథ్యంలో ఆనాటి జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకున్నారు.



అది 1989 సెప్టెంబర్‌. ఆ నెల 12న లండన్‌లో జరిగిన ‘విరాట్‌ హిందూ సమ్మేళనం’లో పాల్గొని స్వదేశానికి తిరిగివచ్చాను. ఇంకా ఇంట్లోకి అడుగు పెట్టకముందే ‘‘అర్జంటుగా రాజ్‌ భవన్‌కు వెళ్ళాలి... గవర్నర్‌ను కలిసి అయోధ్య రామజన్మభూమి విషయంలో విజ్ఞాపనపత్రం సమర్పించడానికి’’ అని పెద్దల నుంచి కబురు వచ్చింది. ఆచార్య బిరుదు రామరాజు, జి. పుల్లారెడ్డి మరికొంతమంది విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) పెద్దలు కలసి వెళ్ళాం. గవర్నర్‌కు నమస్కరిస్తూ ‘జై శ్రీరామ్‌’ అంటూ అభివాదం చేశాం. గవర్నర్‌ ప్రత్యభివాదం చెయ్యకపోగా, వినకూడని పదం విన్నట్టు ముఖం చిట్లించారు. మా అందరికీ బాధ కలిగింది. నాకైతే ఆవేశం, ఆవేదన కట్టలు తెంచుకుంది. తరువాత అందరం తిరిగి బెల్లా విస్టా దగ్గర విశ్వేశ్వరయ్య విగ్రహం దగ్గరకు చేరుకున్నాం. 




శపథం ఎందుకంటే...

అక్కడ వీహెచ్‌పీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ప్రసంగాలు సాగుతున్నాయి. నా ఆలోచనలన్నీ లండన్‌లో జరిగిన సమ్మేళనం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ దేశంలో ‘రాముడు’ అనే పేరు ప్రస్తావించడం దోషంగా ఎందుకు భావిస్తున్నారు? శ్రీరాముడు మొత్తం ప్రపంచాన్ని పాలించాడంటారు కదా! పైగా ఎన్నో దేశాలు రాముణ్ణి పూజిస్తూ ఉంటే, ఆయన జన్మించిన ఈ పుణ్యభూమిలో రామమందిర నిర్మాణానికి అడ్డంకులేమిటి? ఏ దేశం తన సాంప్రదాయాన్ని వదులుకోవడం లేదే? మనమే ఎందుకిలా? ఏది ఏమైనా మన అస్తిత్వాన్ని కోల్పోకూడదు... ఇలా ఎన్నో ఆలోచనలు నాలో సుడులు తిరుగుతున్నాయి. ఈలోగా మైక్‌లో నా పేరు వినిపించింది. నన్ను ప్రసంగించాలంటూ పిలిచారు. మైక్‌ అందుకున్నాను. ‘‘శ్రీరాముడు ధర్మానికి ప్రతీక. ఈ ధర్మభూమిలో ధర్మాన్ని నెలకొల్పాల్సిందే! రామమందిరాన్ని హిందూ మానస మందిరంగా ఎందుకు కట్టుకోవాలో ప్రజలకు వివరించాలి. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో ‘శిలాన్యాస్‌’ జరిగేవరకూ నేను కురులు ముడవను’’ అని శపఽథం చేశాను. అందరూ నిశ్చేష్టులయ్యారు.

సభ అనంతరం ఇంటికి వచ్చాను. మా శ్రీవారు చంద్రశేఖర్‌ రావు మిలటరీలో సివిల్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. విరగబోసుకొని ఉన్న నా జుట్టు ప్రశ్నార్థకంగా చూశారు. ‘‘ఏమండీ! ‘అయోధ్యలో ‘శిలాన్యాస్‌’ జరిగే వరకూ కురులు ముడవను’ అని  ప్రతిజ్ఞ చేశాను. నా ప్రతిజ్ఞ నెరవేరాలంటే ప్రజా చైతన్యం అవసరం. ధర్మమూర్తి రామచంద్రుడి గురించి ప్రజలలో భక్తి చైతన్యాన్ని కలిగించాలి. నేను ఇంట్లో ఉంటే కుదరదు. గ్రామాల్లో పర్యటించాలి’’ అన్నాను. ఆయన వెంటనే ‘‘నేను కూడా రామభక్తుణ్ణే. వెళ్ళిరా’’ అన్నారు. 

అప్పటికి మా అమ్మాయి వయసు పదమూడేళ్ళు. ‘‘ఏమ్మా! అన్నయ్య, నువ్వు చిన్నపిల్లలు. అమ్మమ్మ సంరక్షణలో ఉండగలరా?’’ అని అడిగాను. తను వెంటనే ‘‘మా గురించి ఆలోచించకు’’ అంది. మా అబ్బాయి ‘‘జాగ్రత్తగా వెళ్లి రా అమ్మా’’ అన్నాడు. 


దుర్గమ్మ ఆశీస్సులతో..

ఆ తరువాత ఒక మెటాడోర్‌ వ్యాన్‌ను ‘శక్తిరథం’గా తయారు చేసుకున్నాను. దానికి మైక్‌ అమర్చుకున్నాను. నా దగ్గర అప్పట్లో విశ్వాసపాత్రుడైన రథసారథి దేవయ్య ఉండేవాడు. సెప్టెంబర్‌ 17న యాత్ర ప్రారంభానికి ముహూర్తం నిర్ణయించుకున్నాను.  

ఇంట్లో పూజ చేసుకొని, నా పిల్లలను మా అమ్మగారికి అప్పగించి, మావారి ఆశీస్సులు పొందాను. పరిషత్‌ పెద్దలు నాకందించిన  రూట్‌ మ్యాప్‌ తీసుకున్నాను. రథానికి పెద్దలందరూ హారతి ఇచ్చారు. గాంధీనగర్‌లోని మలయాళ స్వామి ఆశ్రమంలో మాతాజీ శివచైతన్య కూడా నాతో బయలుదేరారు. శ్రీధర్మపురి క్షేత్రంలోని విజయ దుర్గా దేవి ఆశీస్సులు తీసుకుని, దుర్గమ్మకు మొదట ధార్మికోపన్యాసం వినిపించాను. తరువాత నా యాత్ర సాగించాను.


జైళ్ళు సరిపోలేదు!

చివరకు ‘శిలాన్యాస్‌’ రోజు రానే వచ్చింది. మార్గమధ్యంలో నన్ను, మాతాజీని, మాతో ఉన్న మరికొందరినీ ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో అరెస్టు చేశారు. మమ్మల్నే కాదు, లక్షలాదిమంది కార్యకర్తలను  అరెస్టు చేశారు. జైళ్ళు సరిపోలేదు. వేరే వేరే భవనాల్లో పెట్టారు. అప్పుడు ఉత్తరప్రదేశ్‌కు ములాయం సింగ్‌ యాదవ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ‘‘ఒక్క పిట్ట కూడా అయోధ్యలో చొరబడకుండా కట్టుదిట్టం చేశాను’’ అని ప్రకటించారు. నిజంగా అలాగే చేశారు. మొత్తానికి ఎన్నో ప్రయాసలతో అయోధ్య చేరుకున్నాం. దాదాపు 128 దేశాల నుంచి కూడా భక్తులు ఇటుకలు తీసుకువచ్చారు. హోమ భస్మంతో  తయారైన ఇటుకలు దక్షిణ ఆఫ్రికా నుంచి వచ్చాయి. 

తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది... ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ శంకుస్థాపనకు అనుమతి ఇవ్వలేదని! భక్తులంతా నిరాశ పడ్డారు. కొందరు ఆవేశంతో ఊగి పోయారు. వారిని నియంత్రించడం కష్టమయింది. ఎట్టకేలకు అనుమతి లభించింది.


‘ధన్యోస్మి’ అనుకున్నా!

మరునాడు అందరం ‘శిలాన్యాస్‌’ చేసే ప్రదేశానికి  చేరుకున్నాం. నేను తెచ్చిన మూడు ఇటుకలు, రామ విగ్రహాలు మాతో ఉన్నాయి. తూములూరు లక్ష్మీనారాయణమ్మ అనే ఆవిడ మఠ మందిరాల సంరక్షణ ప్రముఖులుగా ఢిల్లీలోని పరిషత్‌ కార్యాలయంలో ఉండేవారు. ఆమె మా ఇద్దరినీ చూసి ‘‘అమ్మా! సత్యవాణీ! దంపతులుగా మీరు ఎదురయ్యారు. మీరిద్దరూ ‘శిలాన్యాస్‌’ పూజలో కూర్చోండి!’’ అన్నారు. నా ఆనందానికి అవధులు లేవు. ‘శిలాన్యాస్‌’ కోసం తవ్విన గుంతలోకి ఐపీఎస్‌ ఆఫీసర్‌ దీక్షితులు దిగారు. పూజ ఆరంభమైంది. ‘శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు’ అని రాసిన నా ఇటుకలు అందులో మొదట పెట్టారు. ఆనంద పారవశ్యంతో అరచేతిలో హారతి వెలిగించి శిలలకు పూజ  చేశాను. ఆ సాయంకాలం వేలాది మంది రామ భక్తులు సన్నిధిలో,  వందల మంది ధర్మాచార్యులు, సాధు సంతుల మధ్య, ఆచార్య ధర్మేంద్ర మహారాజ్‌ మంగళా శాసనాలు చెబుతూండగా... అశోక్‌ సింఘాల్‌ సోదరి ఉషా బెహన్‌, నారాయణమ్మ, గోస్వామి నాకు దువ్వెన అందించి, వేణీ బంధనం చేయించారు.

ఇప్పుడు అయోధ్యలోని గర్భాలయంలో భూమిపూజ జరిగింది. ఆనాటి శంకుస్థాపన సింహద్వారం దగ్గర నిర్వహించాం. సింహద్వారం నుంచి గర్భగుడి లోపలకు ప్రవేశించడానికి ఎన్నో ఆటంకాలు... వాటన్నిటినీ ఎదుర్కొని, ఎందరెందరినో దాటుకొని ఈనాటికి అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం సాకారమవుతున్నందుకు మహదానందంగా ఉంది. అయితే ఈ మందిరం మానవ ధర్మాన్నీ, జాతినీ మేలుకొలపాలి. నేటి పాలకులు శ్రీరాముడి ఆదర్శాలను పాటించినప్పుడే మందిర నిర్మాణం అర్థవంతమవుతుందనేది నా భావన. ఈ పునాది మానవత్వపు విలువలకు పునర్నిర్మాణంగా భావిద్దాం.



నా యాత్రలో భాగంగా ఎన్నో గ్రామాల్లో పరిషత్‌, సంఘ్‌ కార్యకర్తలు ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఎక్కడ ప్రజలు ఉంటే అక్కడ మాతాజీ కంజీరా వాయిస్తూ శ్రీరామ భజనలు చేసేవారు. అవి విని ప్రజలు గూమిగూడేవారు. రోజుకు పద్ధెనిమిది గంటలు, దాదాపు పద్దెనిమిది గ్రామాలు తిరిగి ఎందరెందరికో  స్ఫూర్తినిస్తూ, సనాతన ధర్మ విశిష్టతను వివరించాను. మందిర నిర్మాణం కన్నా వ్యక్తి నిర్మాణం, జాతి నిర్మాణం గురించి ఎక్కువ ప్రస్తావించేదాన్ని. ‘మొదటి ప్రాధాన్యం ధర్మానికి.. రెండో ప్రాధాన్యం మందిర నిర్మాణానికి’ అని చెప్పేదాన్ని.


  •  జై శ్రీ రామ్‌ జై జై శ్రీరామ్‌!

Updated Date - 2020-08-06T05:46:57+05:30 IST