రామ మందిర నిర్మాణం ప్రారంభానికి ముందే రూ.41 కోట్ల విరాళాలు

ABN , First Publish Date - 2020-08-06T22:10:48+05:30 IST

అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం కాకముందే విరాళాలు పెద్దఎత్తున వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు..

రామ మందిర నిర్మాణం ప్రారంభానికి ముందే రూ.41 కోట్ల విరాళాలు

అయోధ్య: అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం కాకముందే విరాళాలు వెల్లువెత్తాయి. రామాలయ నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.41 కోట్ల విరాళాలు అందినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. భూమిపూజ కోసం బుధవారం అయోధ్య వచ్చిన స్వామి చిదానంద సరస్వతి, స్వామి అవదేశానంద్ గిరి, బాబా రాందేవ్ సహా పలువురు ప్రముఖుల విరాళాలు లెక్కించకుండానే రూ.41 కోట్లు సమకూరినట్టు ట్రస్ట్ తెలిపింది. ట్రస్టు ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి మాట్లాడుతూ.. ‘‘మంగళవారం నాటికి ట్రస్టుకు అందిన విరాళాలు రూ.30 కోట్ల వరకు ఉన్నాయి. మొరారి బాపు మరో రూ.11 కోట్లు ఇచ్చారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రూ.41 కోట్ల విరాళాలు అందాయి. అయితే బుధవారం నాటి విరాళాలను ఇంకా లెక్కించలేదు..’’ అని వెల్లడించారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా భక్తులు రామాలయ నిర్మాణం కోసం విరాళాలు పంపినట్టు ఆయన తెలిపారు. కాగా ట్రస్టుకు చెందిన రెండు అధికారిక ఖాతాలకు లాక్‌డౌన్ ప్రకటించిన మార్చి నెల నుంచి ఇప్పటి వరకు రూ. 4.60 కోట్ల విరాళాలు అందినట్టు సమాచారం. 

Updated Date - 2020-08-06T22:10:48+05:30 IST