ఆఫ్ఘన్‌పై వైఖరిని వెంటనే పునఃసమీక్షించాలి : రామ్ మాధవ్

ABN , First Publish Date - 2021-08-15T22:24:54+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో అధికార మార్పిడి జరగబోతున్నట్లు సమాచారం

ఆఫ్ఘన్‌పై వైఖరిని వెంటనే పునఃసమీక్షించాలి : రామ్ మాధవ్

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌లో అధికార మార్పిడి జరగబోతున్నట్లు సమాచారం వస్తుండటంతో ఆ దేశం పట్ల మన దేశ వైఖరిని వెంటనే పునఃసమీక్షించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారక్ రామ్ మాధవ్ పిలుపునిచ్చారు. కాబూల్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోబోతుండటంతో, ఈ పరిణామాలను మనం నిరోధించలేకపోయినా, వాటి వల్ల మన ప్రయోజనాలపై కలిగే ప్రతికూల ప్రభావాన్ని నిరోధించడానికి సిద్ధమవాలన్నారు. 


అల్ జజీరా టీవీతో తాలిబన్ అధికార ప్రతినిధి సుహయిల్ షహీన్ చెప్పిన మాటలను రామ్ మాధవ్ ఉటంకించారు. తాలిబన్లు ప్రస్తుతం కాబూల్ నగర శివారులో ఉన్నారని సుహయిల్ చెప్పారన్నారు. ఘనీ ప్రభుత్వం శాంతియుతంగా లొంగిపోవడం కోసం వేచి చూస్తున్నారని చెప్పారన్నారు. తాలిబన్లు శాంతి గురించి మాట్లాడటం సరికొత్త మార్పు అని చెప్పారు. నగరంలో ఎటువంటి హింసకు పాల్పడరాదని ఫైటర్స్‌కు ఆదేశాలు జారీ అయినట్లు తెలిపారని చెప్పారు. 


ఇదిలావుండగా, ఆఫ్ఘనిస్థాన్ ఇంటీరియర్ మినిస్ట్రీ అధికారి ఒకరు చేసిన ప్రకటనలో తాలిబన్లు కాబూల్ నగరంలోకి ఆదివారం ప్రవేశించినట్లు తెలిపారు. అమెరికా తన దౌత్యవేత్తలను హెలికాప్టర్ ద్వారా తరలించినట్లు పేర్కొన్నారు. 


ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అధికారాన్ని తాలిబన్లకు అప్పగించేందుకు చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. కొత్త అధిపతిగా అలీ అహ్మద్ జలాలీ నియమితులు కాబోతున్నట్లు వెల్లడించింది. 


Updated Date - 2021-08-15T22:24:54+05:30 IST