మందకొడిగా బూస్టర్‌ డోస్‌

ABN , First Publish Date - 2022-08-11T06:02:20+05:30 IST

ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా బూస్టర్‌ వ్యాక్సిన్‌ వేయించాలని ప్రభుత్వం ఆదేశించింది.

మందకొడిగా బూస్టర్‌ డోస్‌

18-59 ఏళ్ల మధ్య వయస్సు వారు కేవలం 7.72 శాతమే

బూస్టర్‌కు కొరవడిన ప్రత్యేక డ్రైవ్‌

ఆరు నెలలకోసారి వ్యాక్సిన్‌ తప్పనిసరని వైద్యుల సూచన

బూస్టర్‌ వ్యాక్సిన్‌ మరో 50 రోజులు మాత్రమే 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా బూస్టర్‌ వ్యాక్సిన్‌ వేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిలో భాగంగా జూలై 15 నుంచి సెప్టంబరు 30లోపు జిల్లాల్లో బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని వైద్యశాఖకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో జిల్లా వైద్యశాఖ యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీ పరిధిలో విస్తృతంగా వ్యాక్సిన్‌ ప్రక్రియ గడువులోపు పూర్తిచేయాలని నిర్ణయించారు. కానీ క్షేత్రస్థాయిలో వ్యాక్సినేషన్‌ మందకొడిగా సాగుతోంది. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లూ తీవ్రంగా శ్రమించినా బూస్టర్‌ డోస్‌ వేయించుకోవడానికి ప్రజలు మందుకురావడంలేదని అధికారులు చెబుతున్నారు. 18-59 మధ్యవయసు గలవారు కేవలం 7.72 శాతం మంది మాత్రమే బూస్టర్‌ డోస్‌ వేయించుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. హెల్త్‌ వర్కర్స్‌ 86.57 శాతం, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ 75.54 శాతం మందికి వ్యాక్సిన్‌ నేషన్‌ పూర్తి అయింది. సాఽధారణ ప్రజానీకానికి వ్యాక్సిన్‌ వేయాలంటే ఆరోగ్య కార్యకర్తలకు తలకుమించిన భారంగా మారింది. దీంతో కొంత మంది ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి మరీ వ్యాక్సిన్లు వేస్తున్న సంఘటనలున్నాయని అఽధికారులు చెబుతున్నారు. బూస్టర్‌ డోస్‌లు వేయించుకోవాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలున్నా ప్రజలు బేఖాతరు చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని, అవి మరింత పెరగకముందే వ్యాక్సిన్‌ వేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. 

 వ్యాక్సిన్‌ తప్పనిసరి 

బూస్టర్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవడంలో ప్రజలు ఆసక్తి చూపడం లేదని అధికారులు చెబుతున్నారు. మార్కెట్లోకి వ్యాక్సిన్‌ వచ్చిన కొత్తలో గంటల తరబడి లైన్లో నించోని మరీ వేయించుకున్నవారు ఇప్పుడు మాత్రం దూరంగా ఉంటున్నారు. కరోనా ప్రభావం అంతగా లేకపోవడంతోనే బూస్టర్‌ డోస్‌ వేయించుకోవడంలేదని ఏఎన్‌ఎంలు చెబుతున్నారు. కానీ వైద్యనిపుణులు ప్రతి ఆరు నెలలక్కోసారి బూస్టర్‌ డోస్‌ వేయించుకోవాలని సూచిస్తున్నారు. కరోనా పూర్తిస్థాయిలో అంతమవలేదని బూస్టర్‌ డోస్‌ కూడా వేయించుకుంటే పూర్తి భద్రత ఉంటుందని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని జిల్లా వైద్యశాఖాధికారులు సూచిస్తున్నారు. 

 డ్రైవ్‌ ఎక్కడ?

మొదటి, రెండు డోస్‌లు సమయంలో ఎక్కడపడితే అక్కడ వ్యాక్సినేషన్‌ సెంటర్లు పెట్టి మరీ వ్యాక్సిన్‌ వేశారు. మెగా వ్యాక్సినేషన్‌ అంటూ ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి వ్యాక్సిన్‌ అందించేవారు. కానీ బూస్టర్‌ డోస్‌లు వేయడంలో జిల్లా యంత్రాంగం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియలో వలంటీర్ల భాగస్వామ్యం లేకపోవడం, సచివాలయ సిబ్బంది పట్టించుకోకపోవడం వంటి పరిణామాలతో వ్యాక్సిన్‌ పక్రియ పడకేసింది. కేవలం ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్ల మీదే వ్యాక్సిన్‌ భారం పడిందని చెబుతున్నారు. గతంలో టార్గెట్లు పెట్టి మరీ వ్యాక్సిన్‌ వేయించిన అధికారులు బూస్టర్‌ డోస్‌కొచ్చేసరికి నీరసించిపోయారని అంటున్నారు.  

 50 రోజులు మాత్రమే అందుబాటులో 

బూస్టర్‌ డోస్‌లు ప్రతి సోమ, శుక్రవారాల్లో సచివాలయాల వద్ద డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. అపార్టుమెంట్లు ఇతర గృహ సముదాయాల వద్ద వ్యాక్సిన్‌నేషన్‌ జరుగుతోంది. బూస్టర్‌ డోస్‌లు మరో 50 రోజుల వరకే దొరుకుతుంది. దీనిని అందరూ వినియోగించుకోవాలి. ఓ పక్క కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కచ్చితంగా బూస్టర్‌ డోస్‌లు వేయించుకోవాలి.

- సుహాసిని ఎన్టీఆర్‌ జిల్లా వైద్యశాఖాధికారి



Updated Date - 2022-08-11T06:02:20+05:30 IST