భారీ త్రివర్ణ పతాకంతో ర్యాలీ

ABN , First Publish Date - 2022-08-14T04:24:13+05:30 IST

రాజంపేట పట్టణంలో శనివారం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

భారీ త్రివర్ణ పతాకంతో ర్యాలీ
100 మీటర్ల జాతీయ పతాకంతో విద్యార్థుల ర్యాలీ

రాజంపేటలో ఘనంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు

అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ 

పాల్గొన్న డిప్యూటీ సీఎం, జడ్పీ చైర్మన్‌, కలెక్టర్‌, జేసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు 


రాజంపేట, ఆగస్టు 13 : రాజంపేట పట్టణంలో శనివారం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా 100 మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని ఊరేగిస్తూ భారత్‌ మాతాకీ జై అనే నినాదాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, పుర ప్రముఖులు, అధికారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ద్వారకానాథరెడ్డి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, కడప మేయర్‌ సురే్‌షబాబు, రాజంపేట మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులురెడ్డి, కలెక్టర్‌ పీఎస్‌ గిరీష, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జేసీ తమీమ్‌ అన్సారియా, ఆర్డీవో కోదండరామిరెడ్డి, కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డిలతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాజంపేట జూనియర్‌ కళాశాల క్రీడా మైదానం నుంచి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి, ఆర్‌ఎస్‌ రోడ్డు, పాతబస్టాండు, ఆర్‌అండ్‌బీ బంగ్లా వరకు ర్యాలీ కొనసాగింది. గుర్రపు స్వారీ అందరినీ ఆకట్టుకుంది. ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద 75వ స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా మున్సిపల్‌ కౌన్సిలర్‌ రాఘవరాజు సొంత నిధులతో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి కలిగి ఉండాలన్నారు. నేడు 75 సంవత్సరాల స్వాతంత్య్ర ఫలాలు అందుకున్న సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించుకోవాలన్నారు. 



Updated Date - 2022-08-14T04:24:13+05:30 IST