శరణాగత రక్షణము

ABN , First Publish Date - 2020-09-07T09:38:33+05:30 IST

శ్రీమన్నారాయణుడు శరణాగత రక్షకుడు. ఆర్తత్రాణ పరాయణుడు. అందుకే.. ధర్మాత్ముడగు విభీషణుడు రావణునితో విభేదించి శ్రీమన్నారాయణుని అవతారమైన

శరణాగత రక్షణము

శ్రీమన్నారాయణుడు శరణాగత రక్షకుడు. ఆర్తత్రాణ పరాయణుడు. అందుకే.. ధర్మాత్ముడగు విభీషణుడు రావణునితో విభేదించి శ్రీమన్నారాయణుని అవతారమైన శ్రీరాముని సన్నిధికి వచ్చి ‘‘సర్వలోక శరణ్యాయ - రాఘవాయ మహాత్మనే’’ అని శరణు వేడాడు. అప్పుడు శ్రీరాముడు.. ‘‘సుగ్రీవా! శరణార్థియైు  వచ్చినవానిలో దోషమున్ననూ పట్టించుకోకూడదు. శత్రువైనా.. అంజలి ఘటించి, దీనుడై, శరణు జొచ్చి వేడినప్పుడు హాని చేస్తే అతడు నష్టపోవడమే కాక మన పుణ్యం కూడా నశిస్తుంది.  విభీషణుడికి ఆశ్రయమిస్తాను’’ అన్నాడు. అంతేకాదు..


సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతిచ యాచతే

అభయం సర్వభూతేభ్యో, దదామ్యే తద్వ్రతం మమ

‘‘సుగ్రీవా! నేను నీ వాడనని దీనుడై ఎవ్వడైనా ఆపత్కాలంలో  నన్ను ఒక్కసారి శరణు వేడినా అభయమిచ్చి రక్షించడం నా వ్రతం.’’ అన్నాడు. విభీషణుడికే కాదు.. సాక్షాత్తూ లంకేశ్వరుడైన రావణుడే వచ్చి శరణు కోరితే అతడికి కూడా అభయమిస్తానన్నాడు. మరోసందర్భంలో.. రావణుని దూతలు శుక సారణులు, వానర సైన్యంలోకి మారు వేషాలతో ప్రవేశించగా విభీషణాదులు గుర్తించి బంధించి వారిని చిత్రవధ చేశారు. అప్పుడు వారు శ్రీరాముని శరణు వేడితే.. ఆ దయానిధి, దాశరథి.. వారిని క్షమించి వదిలేయాలని ఆదేశించాడు. సీతను గాయపరచిన కాకాసురుని క్షమించాడు. ఇక ద్వాపరయుగంలో.. కాళిందీ నదిని విషపూరితం చేసి గోపబాలురను చంపిన కాళీయుని మర్దించిన బాలకృష్ణుడే.. కాళీయుడు, అతడి భార్యలు నాగాంగనలు శరణు వేడడంతో క్షమించి వదిలిపెట్టాడు.


శత్రువులనే క్షమించిన ఆ పరమాత్మ తనకు పరమభక్తుడైన గజేంద్రుడు ప్రాణభయంతో శరణువేడితే ఒక్క క్షణం ఆగగలడా! లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా గజప్రాణావనోత్సాహియైు వచ్చాడు కదా! కుచేలోపాఖ్యానంలో కుచేలుని భార్య.. ఆ పరమాత్ముని తత్వం గురించి వివరిస్తూ.. ‘‘నాథా! కనీసం కలలో గూడా స్మరించనివాడు ప్రాణాపాయ స్థితిలో ఆ భక్త పరంధాముని శ్రీహరి పాదపద్మాలు స్మరిస్తే, కరుణించి, శరణు గోరిన వారికి తనను తానే అర్పించుకుంటాడు. సమస్త సంపదలను అనుగ్రహిస్తాడు’’ అని గుర్తుచేసింది. ద్రౌపదీ మాన రక్షకుడు, భక్త పరాధీనుడు, ఆపదోద్ధారకుడు అయిన ఆ పరమాత్మ గీతోపదేశంలో.. ‘‘అర్జునా! అన్ని ధర్మాలనూ విడిచి నన్నే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తుణ్ని చేస్తాను’’ అని అభయమిచ్చాడు. దేశికాచార్యుల వారు రచించిన ఆర్త త్రాణ పరాయణాష్టకంలో ‘‘ఆర్త త్రాణ పరాయణ స్స భగవాన్‌ నారాయణోమే గతిః’’ అని స్పష్టం చేశారు. అందుకే ఎందరో భక్తాగ్రేసరులు ‘ఆపత్సఖా! శ్రీమన్నారాయణా! అశరణ్య శరణ్యత్యత్‌ పాదారవింద యుగళం శరణ మహం ప్రపద్యే’ అని ఆ స్వామి పాదాలను ఆశ్రయించి ముక్తినొందారు. వారు నడిచిన బాటే మనందరికీ ఆదర్శం.

రాయసం రామారావు, 9492191360

Updated Date - 2020-09-07T09:38:33+05:30 IST