Abn logo
Dec 23 2020 @ 00:21AM

గోటిపై గీత...రికార్డుల మోత

అభిరుచులు అందరికీ ఉంటాయి. కానీ వాటికి రూపం ఇచ్చేవారు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఒక్కరు 29 ఏళ్ల రాఖీ గిరిశంకర్‌. కేరళ రాష్ట్రం... తిరువనంతపురానికి చెందిన ఈ ఇంజనీర్‌... గోళ్లనే కాన్వాస్‌గా చేసుకొని అద్భుతమైన చిత్రాలకు రూపం ఇస్తోంది. ఈ అరుదైన కళను పది మందికీ నేర్పిస్తూ... తన పేరున ఓ ప్రపంచ రికార్డునూ లిఖించుకున్న రాఖి ‘రేఖాచిత్రం’ ఇది... 


రాఖీ గిరిశంకర్‌ కాన్వాస్‌ చూడ్డానికి చిన్నదిగానే ఉంటుంది. అంతకు మించి విభిన్నంగానూ కనిపిస్తుంది. కానీ దానిపై ఆమె వేసే చిత్రాలు ప్రకృతిలోని ఆహ్లాద దృశ్యాలను కళ్ల ముందు ఆవిష్కరిస్తాయి. ఆకాశమంత చిత్రమైనా పొల్లు పోకుండా అక్కడ ఒదిగిపోతుంది. అంతేకాదు... మీరు ఫలానా పెయింట్‌ కావాలని అడగండి... దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చేతి గోటిపైకి తెచ్చేస్తుంది. తనకు కాన్వాస్‌ ఎంత చిన్నదిగా ఉంటే అంత సౌలభ్యంగా ఉంటుందంటుంది రాఖి. 


ఏకలవ్య శిష్యురాలు...   

బొమ్మలు గీయాలన్న ఆకాంక్ష రాఖీలో ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. బడికి వెళ్లే రోజుల్లోనే చిత్రలేఖనంపై మక్కువ పెంచుకుంది. చిన్న చిన్న బొమ్మలు వేసి వాటిని చూసి మురిసిపోయేది. చివరకు  ఆ అభిరుచి ఒక అలవాటుగా మారిపోయింది. కానీ ఎవరి వద్దా శిష్యరికం చేయలేదు. తనకు తానుగా నేర్చుకుంది. ఆమెతో పాటు ఆమె అభిరుచి కూడా పెరుగుతూ వచ్చింది. మరి నెయిల్‌ ఆర్ట్‌లోకి ఎలా వచ్చావని అడిగితే... ‘‘ఒకసారి మా రూమ్‌మేట్‌ ఓ అసైన్‌మెంట్‌పై దక్షిణ కొరియా వెళ్లి వచ్చింది. అప్పుడు తన గోళ్లపై కలర్‌ఫుల్‌ పెయింటింగ్స్‌ కనిపించాయి. గోటిపై గీతలా! చాలా ఆశ్చర్యమనిపించింది. ఆ ఆర్ట్‌పై నాలో ఆసక్తి పెరిగింది. ఆ రోజు నుంచి నెయిల్‌ ఆర్ట్‌ వెనకాల పడ్డాను. ఇంటర్‌నెట్‌లో వెతికాను.  యూట్యూబ్‌లో వీడియోలు చూసి నేర్చుకున్నాను. ఏ పేపర్‌పై ఏ పెయింట్‌ వాడాలి? ఎలాంటి రంగులు ఉపయోగించాలి? ఇలా ఎన్నో తెలుసుకున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది రాఖి. 


స్నేహితులపై ప్రయోగాలు... 

నెయిల్‌ ఆర్ట్‌ కళైతే అబ్బింది. మరి కాన్వాస్‌లు మార్కెట్‌లో దొరికేవి కాదు కదా! అందుకే స్నేహితుల గోళ్లపై ప్రయోగాలు మొదలుపెట్టింది రాఖి. అసలు తన బొమ్మలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంది. తను నేర్చుకున్న నెయిల్‌ ఆర్ట్‌ను వాళ్ల గోళ్లపై వేసి ఆనందించింది. అదీ వీకెండ్స్‌లోనే! ఎందుకంటే అప్పుడైతే ఫ్రెండ్సంతా కలుస్తారు కదా! ‘‘అసలు ఇదంతా సరదాగా మొదలుపెట్టాను. ఎలా ఉంటుందో చూద్దామనుకున్నాను’’ అంటున్న రాఖీకి చివరకు అదే వ్యాపకంగా మారిపోయింది. 


ప్రకృతితో మమేకమై... 

రాఖి చిత్రాల్లో అధిక భాగం ప్రకృతితోనే ముడిపడి ఉంటాయి. అందమైన ల్యాండ్‌స్కేప్స్‌, వివిధ రుతువుల్లో కనిపించే మార్పులు... ఏదైనా సరే చూసింది చూసినట్టు గోటిపై దించేస్తుంది. అంతేకాదు... ఒక థీమ్‌ అనుకుని, దానికి తగ్గట్టుగా కూడా పెయింటింగ్‌ వేస్తుంది. క్రిస్మస్‌ సెలవులు, ఓనమ్‌ సందడి, హాలోవీన్‌ బీభత్సం... ఆమె కుంచె పడితే ఇంపుగా చేతి గోటిపై ఇమిడిపోతాయి. అప్పుడప్పుడూ ప్రముఖుల రూపాలను కూడా గోళ్లపై ఆవిష్కరిస్తుందీ ఆర్టిస్ట్‌. 


ఫ్యాకల్టీగా మానేసి... 

కొంత కాలం తిరువనంతపురంలోని ఓ ఫ్యాషన్‌ ఇనిస్టిట్యూట్‌లో ఫ్యాకల్టీగా పనిచేసిన రాఖి... ఆ తరువాత దాన్ని వదిలేసింది. జీతం సరిపోవడం లేదని కాదు... ఆ ఉద్యోగం మీద ఆసక్తి లేక. ఆ తరువాత నెయిల్‌ పెయింటింగ్‌ను ప్రొఫెషనల్‌గా మలుచుకుంది.  


చిన్నారుల్లో సృజన... 

ఈ ఏడాది ఆరంభంలో ఆర్ట్‌ స్టూడియోను కూడా ప్రారంభించిన రాఖీ ఈ అరుదైన ఆర్ట్‌ను మరింత మందికి చేరువ చేయాలనే ఉద్దేశంతో కొన్ని విద్యా సంస్థల్లో తరచూ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. చిన్నారుల్లో సృజన వెలికితీయాలనే లక్ష్యంతో... వారికి తన ఇంట్లోనే డ్రాయింగ్‌ పాఠాలు బోధిస్తున్నారు. 

రెట్టింపు సమయం... 

‘‘సాధారణ చిత్రకారులకు భిన్నంగా నెయిల్‌ ఆర్ట్‌లో చాలా చిన్న చిన్న కాన్వాస్‌లను వాడతాం. ఆర్ట్‌ చక్కగా వచ్చేందుకు ఎంతో శ్రమించాలి. పెద్ద కాన్వాస్‌పై వేసేదాని కంటే రెట్టింపు సమయం పడుతుంది. టాపిక్‌ ఏదైనా సరే... సంప్రదాయ కాన్వాస్‌పై వేసిన చిత్రాన్ని యథాతథంగా గోరు వంటి చిన్న సర్ఫేస్‌పై వేయడం అంత సులువు కాదు. నావరకైతే... ఇతర చిత్రాలకంటే ఇలాంటి మీనియేచర్స్‌ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అంతేకాదు పెద్ద కాన్వాస్‌ కన్నా చిన్నవాటిపై చిత్రీకరించడమే సౌకర్యంగా అనిపిస్తుంది. బహుశా ఈ కళపై నాకున్న ఆసక్తి, అనుభవమే అందుకు కారణం కావచ్చు. ఒక్కటి మాత్రం నిజం... నెయిల్‌ ఆర్ట్‌ అనేది పెద్ద సవాలు లాంటిది’’ అంటారు రాఖి. 


ఎన్నెన్నో కళలు...  

నెయిల్‌ ఆర్ట్‌తో పాటు త్రీడీ పెయింటింగ్స్‌ కూడా వేస్తారు రాఖి. ముఖచిత్రాలు కూడా చెక్కుతారు. లాక్‌డౌన్‌లో ఎంబ్రాయిడరీ ఆర్ట్‌కు కూడా శ్రీకారం చుట్టారామె. బొటానికల్‌ కాస్టింగ్‌... అంటే చెట్లను ఉన్నవి ఉన్నట్టుగా కాన్వాస్‌పై చిత్రంగా మలచడం. ఎన్నో కళలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా ఉన్న రాఖి ‘ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియన్‌ లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్స్డ్‌’లో చోటు దక్కించుకున్నారు. గోటిపై థీమ్‌ ఆధారిత చిత్రాలు గీసినందుకు ఆమెను ఈ రికార్డులు వరించాయి. రష్యన్‌, ఇటాలియన్‌ చిత్రకళా నైపుణ్యాన్ని ఆకళింపు చేసుకున్న రాఖి... వాటిలోని సొగసును, వైవిధ్యాన్ని తన చిత్రాల్లో చొప్పించి వినూత్న రూపాలకు ప్రాణం పోస్తున్నారు.  

ప్రత్యేకం మరిన్ని...