క్రిప్టోకరెన్సీలను బ్యాన్ చేయాలి: రాకేశ్ ఝున్‌ఝన్‌వాలా

ABN , First Publish Date - 2021-02-23T22:57:06+05:30 IST

బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలను నిషేధించాలంటూ ప్రముఖ బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్‌ఝున్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇటువంటి వాటిల్లో తాను అసలేమాత్రం పెట్టుబడి పెట్టనని ఆయన స్పష్టం చేశారు.

క్రిప్టోకరెన్సీలను బ్యాన్ చేయాలి: రాకేశ్ ఝున్‌ఝన్‌వాలా

ముంబై: బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలను నిషేధించాలంటూ ప్రముఖ బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్‌ఝున్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇటువంటి వాటిల్లో తాను అసలేమాత్రం పెట్టుబడి పెట్టనని ఆయన స్పష్టం చేశారు. ఓ జాతీయ టీవీ ఛానల్‌కు మంగళవారం ఇచ్చిన ఇంటరవ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బిట్‌కాయిన్‌లో ట్రేడింగ్ స్పెక్యులేషన్ తీవ్రస్థాయికి చేరిందని అర్థం. ఊర్లో జరిగే ప్రతి ‘పార్టీకీ’ హాజరైతే.. తెల్లారి ‘హ్యాంగోవర్’ మోతెక్కిపోతుంది.’ అంటూ బిట్‌కాయిన్‌కు పెరుగున్న ప్రాముఖ్యతపై సెటైర్లు వేశారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ కరెన్సీ రూపకల్పనపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. 


ఇక మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా దాదాపు ఇటువంటి అభిప్రాయాన్నే వెలిబుచ్చారు. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులపై తనకు ఆసక్తి లేదని తెలిపారు. ‘మీకు ఈలాన్ మస్క్ అంత ధనవంతులు కాకపోతే.. బిట్‌కాయిన్ విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. ఈలాన్ మస్క్‌కు చాలా డబ్బుంది. బిట్‌కాయిన్ విలువలో హెచ్చుతగ్గులు వచ్చినా ఆయన తట్టుకోగలరు’ అంటూ మదుపర్లను ఆయన హెచ్చరించారు. ఇటీవల కాలంలో టెస్లా వంటి ప్రముఖ కార్పొరేట్ సంస్థ కూడా బిట్‌కాయిన్‌కు ప్రాముఖ్యత ఇస్తుండటంతో..ఈ క్రిప్టోకరెన్సీ విలువ నానాటికీ కొంత పుంతలు తొక్కుతోంది. ఈలాన్ మస్క్ సారథ్యంలోని టెస్లా ఇటీవల కాలంలో బిట్‌కాయిన్‌లో కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-02-23T22:57:06+05:30 IST