బుల్లెట్‌ గురితప్పడం వల్లే రాకేశ్‌ మృతి

ABN , First Publish Date - 2022-06-22T08:50:29+05:30 IST

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ కాల్పుల ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరపలేదని..

బుల్లెట్‌ గురితప్పడం వల్లే రాకేశ్‌ మృతి

పోలీసు ఉన్నతాధికారులు వివరణ

రైల్వే పోలీసుల అదుపులో సుబ్బారావు

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ కాల్పుల ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరపలేదని.. బుల్లెట్‌ గురి తప్పడంతో రాకేశ్‌ మృతిచెందాడని స్పష్టం చేశారు. ‘‘రైల్వేస్టేషన్‌లో ఆందోళనను అదుపులోకి తెచ్చేందుకు ఆర్పీఎఫ్‌ అధికారులతో కలిసి తీవ్ర ప్రయత్నం చేశాం. పవర్‌ కారింగ్‌లో 4 వేల లీటర్ల డీజిల్‌, 2 లోకో ఇంజన్లలో 3 వేల ట్రాన్స్‌ఫార్మర్‌ అయిల్‌ నిల్వలున్నాయి. వాటిని తగులబెట్టేందుకు ఆందోళనకారులు యత్నించారు. అదే జరిగితే తీవ్ర ప్రాణనష్టం వాటిల్లేది. ఈ నేపథ్యంలోనే ఆర్పీఎఫ్‌ అధికారులు 20 రౌండ్ల కాల్పులు జరిపారు. అందులో ఒక బుల్లెట్‌ గురి తప్పి రాకేశ్‌ కుడివైపు పక్కటెముకుల నుంచి దూసుకుని బయటకు వెళ్లింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు మరణించాడు’’ అని ఒక పోలీస్‌ ఉన్నతాఽధికారి చెప్పారు. ఈ కేసు హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎ్‌స)కు ఒకట్రెండు రోజుల్లో కేసు బదిలీ అవుతుందని అధికారులు తెలిపారు. కాగా.. కేసులో రైల్వే పోలీసులు మరో 11 మందిని అరెస్టు చేసినట్లు తెలిసింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డిఫెన్స్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు కూడా ఉన్నట్లు తెలిసింది. అంతకు ముందు సుబ్బారావు కార్యాలయంలో ఆదాయపన్ను(ఐటీ) శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మరోవైపు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆందోళనల్లో పాల్గొన్న జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గోవిందు అజయ్‌ అనే యువకుడు.. పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆందోళన సమయంలో ఓ టీవీ చానల్‌తో అజయ్‌ మాట్లాడాడు. పోలీసులు టీవీ చానళ్ల ఫీడ్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టడంతో భయపడిన అజయ్‌.. మంగళవారం రాత్రి పురుగుమందు తాగాడు. ప్రస్తుతం అతడికి వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స అందుతోందని, పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్థులు తెలిపారు.

Updated Date - 2022-06-22T08:50:29+05:30 IST