రాజ్యసభ స్థానం.. చిదంబరానికే అవకాశం

ABN , First Publish Date - 2022-05-29T13:18:18+05:30 IST

రాష్ట్రంలో తమకు దక్కిన ఏకైక రాజ్యసభ స్థానం కేటాయింపుపై ఎట్టకేలకు కాంగ్రెస్‌ ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ స్థానాన్ని సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి చిదంబరానికి ఇవ్వాలని

రాజ్యసభ స్థానం.. చిదంబరానికే అవకాశం

                 - ఎట్టకేలకు కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం


చెన్నై: రాష్ట్రంలో తమకు దక్కిన ఏకైక రాజ్యసభ స్థానం కేటాయింపుపై ఎట్టకేలకు కాంగ్రెస్‌ ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ స్థానాన్ని సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి చిదంబరానికి ఇవ్వాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ మేరకు ఆయన సోమవారం చెన్నైలో నామినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డీఎంకే కూటమిలో తమకు అందిన ఒకే ఒక స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ లోని పలువురు నేతలు పోటీ పడ్డారు. ఇందులో చిదంబరంతో పాటు టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి కూడా వున్నారు. ఈ ఇద్దరు నేతలు వేర్వేరుగా ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో చర్చించారు. అయితే అధిష్ఠానం మాత్రం చిదంబరంవైపే మొగ్గు చూపినట్లు సమాచారం. దీంతో చిదంబరం శుక్రవారం రాత్రి ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్నారు. నామినేషన్‌లో చిదంబరం అభ్యర్థిత్వానికి మద్దతుగా పది మంది శాసనసభ్యులు సంతకాలు చేయాల్సి ఉంది. ఆ మేరకు శనివారం ఉదయం నుంగంబాక్కంలోని తన నివాసంలో కాంగ్రెస్‌ శాసనసభ్యులతో చిదంబరం సమావేశమయ్యారు. అధిష్ఠానం నిర్ణయాన్ని వారి వద్ద వివరించి, తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు ఎమ్మెల్యేలంతా హర్షం వ్యక్తం చేశారు. అయితే చిదంబరం అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్‌ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించాల్సివుంది. 

Updated Date - 2022-05-29T13:18:18+05:30 IST