రాజ్యసభ ఎన్నికలకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-05-25T14:57:38+05:30 IST

రాష్ట్రంలో ఆరు రాజ్యసభ స్థానాల భర్తీ కోసం మంగళవారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు ఎన్నికల నిర్వహణ అధికారి,

రాజ్యసభ ఎన్నికలకు ఏర్పాట్లు

                    - నామినేషన్ల స్వీకరణ ప్రారంభం


చెన్నై: రాష్ట్రంలో ఆరు రాజ్యసభ స్థానాల భర్తీ కోసం మంగళవారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు ఎన్నికల నిర్వహణ అధికారి, శాసనసభ కార్యదర్శి డాక్టర్‌ కె.శ్రీనివాసన్‌ ప్రకటించారు. డీఎంకే రాజ్యసభ సభ్యులు టీకేఎస్‌ ఇళంగోవన్‌, ఆర్‌ఎస్‌ భారతి, కేఆర్‌ఎన్‌ రాజేష్ కుమార్‌, అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యులు నవనీత కృష్ణన్‌, విజయకుమార్‌ పదవీ కాలం జూన్‌ 29న ముగియనున్న విషయం తెలిసిందే. ఈ పదవులకు జూన్‌ 10న ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ మేరకు మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శాసనసభలో   సభ్యుల మెజారిటీ ప్రకారం ఆరు సీట్లలో డీఎంకే కూటమి నాలుగు సీట్లను, అన్నాడీఎంకే కూటమి రెండు సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. డీఎంకే మూడు రాజ్యసభ సీట్లకు తంజావూరు కల్యాణసుందరం, ఇరా గిరిరాజన్‌, కేఆర్‌ఎన్‌ రాజేష్ కుమార్‌ను అభ్యర్థులుగా ప్రకటించగా, ఒక స్థానాన్ని మిత్రపక్షమైన కాంగ్రెస్ కు కేటాయించింది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే రెండు సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సివుంది. ఈ పార్టీ అభ్యర్థుల ఎంపికలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్‌ తరఫున ఒక్క సీటు కోసం కూడా ఆ పార్టీ అధిష్టానం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ సీటు కోసం కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరు రాజ్యసభ స్థానాల కోసం ఎన్నికల ఏర్పాట్లు విస్తృతంగా చేపడుతున్నారు. రిటర్నింగ్‌ అధికారిగా డాక్టర్‌ కె.శ్రీనివాసన్‌, డిప్యూటీ రిటర్నింగ్‌ అధికారిగా శాసనసభ డిప్యూటీ కార్యదర్శి కె.రమేష్‌ వ్యవహరించనున్నారు. ఈ నెల 31 వరకు నామినేషన్లను స్వీకరించి, జూన్‌ ఒకటిన నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్‌ పత్రాలు శాసనసభ కార్యదర్శి కార్యాలయంలో సిద్ధంగా ఉంచారు. ఆ నామినేషన్లలో అన్ని వివరాలను పూర్తి చేసి అభ్యర్థి లేదా ఆయన తరఫు ప్రతినిధి వాటిని సమర్పించాల్సి వుంటుంది. ఈ నెల 28, 29 తేదీలు మినహా ఈ నెల 31 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జనరల్‌ కేటగిరి అభ్యర్థులు రూ.10 వేలు, ఆదిద్రావిడ, గిరిజన కేటగిరీల అభ్యర్థులు రూ.5వేలు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఆరుగురి కంటే ఎక్కువ మంది పోటీ చేస్తే జూన్‌ 10న సచివాలయంలోని లెజిస్లేచర్‌ కమిటీ సమావేశ మందిరంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు బ్యాలెట్‌ పద్థతిలో పోలింగ్‌ నిర్వహిస్తామని ఎన్నికల నిర్వహణ అధికారి శ్రీనివాసన్‌ తెలిపారు. ఇదిలా ఉండగా‘ ఎలక్షన్‌ కింగ్‌’గా పేరుగాంచిన పద్మరాజన్‌ తొలిరోజు నామినేషన్‌ దాఖలు చేసారు. 

Updated Date - 2022-05-25T14:57:38+05:30 IST