రాజ్యాంగాన్ని కాలరాస్తున్న ప్రతిపక్షాలు

ABN , First Publish Date - 2021-07-27T06:34:24+05:30 IST

స్వతంత్ర భారతదేశం త్వరలో 75వ ఏట అడుగుపెట్టబోతున్నది. అయితే ఇవాళ మన పార్లమెంట్ జరుగుతున్న తీరు చూస్తుంటే స్వాతంత్ర్యం మనకు ప్రసాదించిన ప్రజాస్వామ్యం...

రాజ్యాంగాన్ని కాలరాస్తున్న ప్రతిపక్షాలు

స్వతంత్ర భారతదేశం త్వరలో 75వ ఏట అడుగుపెట్టబోతున్నది. అయితే ఇవాళ మన పార్లమెంట్ జరుగుతున్న తీరు చూస్తుంటే స్వాతంత్ర్యం మనకు ప్రసాదించిన ప్రజాస్వామ్యం, మనం రాసుకున్న రాజ్యాంగం పట్ల మన ప్రజాప్రతినిధులు కించిత్‌ గౌరవమైనా చూపుతున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ప్రజాస్వామ్యం ఆరోగ్యవంతంగా వర్ధిల్లాలంటే అది ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధుల పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. దురదృష్టవశాత్తు మన ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడల్లా తమకు పరిపక్వత లేదన్న విషయాన్ని మొత్తం ప్రపంచానికి తెలియజేస్తున్నాయి.


ఆ రోజుల్లో పార్లమెంట్‌లో మాట్లాడడం అంటే తమ రాజ్యాంగ విధిని నెరవేర్చడం అని సభ్యులు భావించేవారు. అందుకే వారి అద్భుత ప్రసంగాలు చరిత్రపుటల్లో నమోదయ్యాయి. అవి ఆనాటి మన ప్రజాప్రతినిధుల విశాలదృక్పథాన్ని విశదం చేస్తున్నాయి. ఇప్పుడు మన ప్రతిపక్షాలు అనుసరిస్తున్న వైఖరి చూస్తుంటే భావి తరాలకు వారి గురించి కానీ, వారి ప్రసంగాల గురించి కానీ తెలుసుకోవడానికి లభించేది శూన్యమన్న విషయం అర్థమవుతుంది. ఎంపీల జీతభత్యాలు కాక, ప్రతిరోజూ ఉభయసభల సమావేశాలు నిర్వహించడానికి రూ. 2కోట్ల చొప్పున ఖర్చవుతుందని ఒక అంచనా. భావి అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఖర్చవుతున్నదని గగ్గోలు పెడుతున్న ప్రతిపక్షాలు 2014 నుంచి ఇప్పటి వరకూ ఉభయసభల్లో అంతరాయం కల్పించడం ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు వృథా చేశాయో చెప్పగలవా? తమ రాజ్యాంగ విధిని విపక్షాలు ఏ మేరకు నెరవేరుస్తున్నాయి?


నిజానికి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ఒకరోజు ముందే ప్రధాని అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపై ప్రభుత్వం స్పందించేందుకు సిద్ధంగా ఉన్నదని, ఆరోగ్యకరమైన చర్చలకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయినా మొదటి రోజు నుంచే ప్రతిపక్షాలు వెల్‌లోకి దూసుకువచ్చి గందరగోళం సృష్టించడం ప్రారంభించాయి. సభలో తమ సీట్లలో కూర్చోకుండా నోటీసులు ఇచ్చి చర్చ జరపాలంటే ఎలా సాధ్యమవుతుంది? తాము ఫలానా నిబంధన కింద ఎందుకు నోటీసు ఇచ్చామో హుందాగా సభలో మాట్లాడేందుకు ప్రతిపక్షాలు ఎందుకు సిద్ధంకావడం లేదు? ప్రతిపక్షాల వాదన బలంగా ఉంటే సహజంగానే అది ప్రజల దృష్టిలోకి వెళుతుంది. దారుణమేమంటే, పార్లమెంట్‌లో ప్రధానమంత్రి తన కొత్త మంత్రులను పరిచయం చేస్తుంటే వారిని ఆహ్వానించడం, హర్షం వ్యక్తం చేయడం సంప్రదాయమే కాదు, సంస్కారం కూడా. తాను రికార్డు స్థాయిలో అత్యంత బలహీనవర్గాలకు చెందిన వారిని, మహిళలను మంత్రివర్గంలోకి తీసుకున్నానని ప్రధాని చెబుతుంటే కనీసం ఆ వర్గాల పట్ల గౌరవంతోనైనా ప్రతిపక్షాలు వ్యవహరిస్తాయని ఎవరైనా భావిస్తారు. ఉదాహరణకు మాదిగ వర్గాలకు చెందిన అబ్బయ్య నారాయణ స్వామి రాజకీయాల్లో మూడు దశాబ్దాలుగా అనుభవం ఉన్నవారు. అతి కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా పైకి ఎదిగి, తన అనర్గళ వక్తృత్వంతో, ప్రజాసేవతో ప్రజల మన్ననలు అందుకున్నందువల్లే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ముగ్గురు ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పనిచేసిన తర్వాత లోక్‌సభలో అడుగుపెట్టారు. మరో మంత్రి ఎల్. మురుగన్ అత్యంత వెనుకబడిన అరుంధతియార్ కులంలో జన్మించి కష్టించి చదువుకుని మద్రాస్ యూనివర్సిటీలో న్యాయశాఖలో పిహెచ్‌డి పొందిన తర్వాత 15 సంవత్సరాల పాటు మద్రాస్ హైకోర్టులో ప్రతిభావంతుడైన న్యాయవాదిగా రాణించారు. బిజెపి ఆయనను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా నియమించి ప్రోత్సహించింది. ఇలాంటి వారికి మంత్రిపదవులు లభిస్తే కనీసం వారిని పరిచయం కూడా చేయకుండా ప్రధానిని అడ్డుకున్న ప్రతిపక్షాల కుసంస్కారాన్ని నిందించడానికి ఎలాంటి మాటలు సరిపోవు.


గత ఏడాది మొత్తం కేవలం 33 రోజులే పార్లమెంట్ సమావేశం అయింది. బడ్జెట్ సమావేశాలు కేవలం పదిరోజులే జరిగితే వర్షాకాల సమావేశాలు 8 రోజులకే పరిమితమయ్యాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నలు సంధిస్తామని చెప్పుకుంటున్న వారు పార్లమెంట్‌లో అత్యంత విలువైన ప్రశ్నోత్తరాల సమయాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. 2015--–19 మధ్య కాలంలో ప్రశ్నోత్తరాల సమయం కేవలం 40 శాతం మాత్రమే సద్వినియోగమయింది. ప్రతిరోజూ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయమని అనేకసార్లు నోటీసులు ఇచ్చారు. పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని ప్రతిపక్షాలు ప్రజలకు ఎలా జవాబుదారీ అవుతాయి? ట్వీట్లు గుప్పించడమో, ధర్నాలు చేయడమో, వెల్‌లోకి వచ్చి నినాదాలు చేయడమో వంటివాటి ద్వారా వారు ఏమి సాధించగలరు? ప్రతిపక్షాల వైఖరి చూసి విసిగిపోయిన తర్వాత ప్రభుత్వానికి కీలక బిల్లులను గందరగోళం మధ్య ఆమోదించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. పార్లమెంట్ అత్యధిక సమయాన్ని వృధా చేసిన ప్రతిపక్షాలకు కీలక బిల్లులను ప్రభుత్వం వేగంగా ఆమోదింపచేసిందని విమర్శించే అర్హత ఎక్కడ ఉంటుంది? ప్రజా ప్రయోజనం కోసం ముఖ్యమైన బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించడం అనేది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత. ప్రజలు తమను ఎన్నుకున్న అయిదేళ్లకాలంలో వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అవసరమైన చట్టాలను చేయలేకపోతే ప్రభుత్వం ఉండి ఏమి ప్రయోజనం? ప్రభుత్వాన్ని తన విధిని నిర్వర్తించకుండా పార్లమెంట్‌లో అడ్డుకుని తాము ప్రజలకోసం పనిచేస్తున్నామని ప్రతిపక్షాలు చెప్పుకోవడం హాస్యాస్పదం.


సాగు చట్టాలపై ఇప్పటికే అనేకసార్లు రైతు ప్రతినిధులతో చర్చించిన ప్రభుత్వం ఇంకా తాము చర్చలకు సిద్ధమేనని, సరైన సూచనలు చేస్తే అవసరమైన సవరణలు చేయగలమని స్పష్టం చేసింది. ఈ ఆందోళనకు తాము అనుకున్నట్లుగా దేశవ్యాప్త మద్దతు లభించలేదని తెలిసిన ప్రతిపక్షాలకు ఇప్పుడు కొత్తగా పెగాసస్ స్పైవేర్ ఒక ఆయుధంగా దొరికింది. విచిత్రమేమంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రతిపక్షాల కదలికలపై దారుణంగా నిఘా విధించింది. 2013లో సమాచార హక్కు కింద ఇచ్చిన జవాబు ప్రకారం యుపిఏ ప్రభుత్వంలో ప్రతినెలా తొమ్మిదివేల ఫోన్లు, 500 ఈ-–మెయిల్ అకౌంట్లపై నిఘా వేశారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖే తెలిపింది. తమ టెలిఫోన్లను ట్యాప్ చేశారని సీతారాం ఏచూరి, జయలలిత, మమతా బెనర్జీ వంటి నేతలే మన్మోహన్‌సింగ్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఎక్కడి నుంచో ఒక జాబితా తీసుకువచ్చి తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయి. నాడు తమ ప్రభుత్వంలోనే ఆర్థికమంత్రిపై నిఘా వేయించిన అప్పటి హోంమంత్రి చిదంబరం ఇప్పుడు పెగాసస్ స్పైవేర్ గురించి మోదీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు! కుట్రలు చేయడంలో ఆరితేరిన కాంగ్రెస్‌కు గానీ, ఇతర ప్రతిపక్షాలకు గానీ మోదీని విమర్శించే నైతిక హక్కు ఉన్నదా? పార్లమెంట్‌ను స్తంభింపచేసి గగ్గోలు పెట్టినంత మాత్రాన ప్రజలు వారి మాటలు నమ్ముతారనుకోవడం మూర్ఖత్వం.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2021-07-27T06:34:24+05:30 IST