రాజ్యసభ స్థానం.. అదానీ భార్యకు ఖాయం!!

ABN , First Publish Date - 2022-04-29T08:45:53+05:30 IST

రాష్ట్రం నుంచి ఈ ఏడాది జూన్‌లో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాలూ వైసీపీకే దక్కనున్నాయి.

రాజ్యసభ స్థానం..  అదానీ భార్యకు ఖాయం!!

  • న్యాయవాది నిరంజన్‌రెడ్డికి కూడా!
  • విజయసాయిరెడ్డికీ సెకండ్‌ చాన్స్‌
  • నాలుగో అభ్యర్థిపై మల్లగుల్లాలు
  • రేసులో సజ్జల, సుబ్బారెడ్డి, మేకపాటి, డొక్కా
  • మైనారిటీ/దళిత వర్గానికి ఇవ్వాలని జగన్‌ యోచన
  • నేడు ఢిల్లీలో మోదీతో భేటీ


అమరావతి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి ఈ ఏడాది జూన్‌లో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాలూ వైసీపీకే దక్కనున్నాయి. ఇందులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ భార్య ప్రీతి అదానీకి రాజ్యసభ సీటు ఖరారైందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇదే క్రమంలో తన వ్యక్తిగత న్యాయవాది నిరంజన్‌రెడ్డికి కూడా రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనున్నట్లు చెబుతున్నాయి. ఇక వైసీపీపీ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవీ కాలం జూన్‌ మొదటివారంలో ముగుస్తోంది.


ఆయనకు రెండోసారి కూడా అవకాశమిచ్చేందుకు జగన్‌ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగో స్థానాన్ని మైనారిటీ లేదా దళిత వర్గానికి ఇవ్వాలని ఆయన యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ద్వైవార్షిక ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే అభ్యర్థుల పేర్లను ఆయన ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో రిలయన్స్‌ దిగ్గజం ముఖేశ్‌ అంబానీకి సన్నిహితుడు, రిలయన్స్‌ సంస్థల వైస్‌ప్రెసిడెంట్‌ పరిమళ్‌ నత్వానీకి వైసీపీ తరఫున రాజ్యసభ టికెట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రీతి అదానీకి కూడా పార్టీ కండువా కప్పి.. బీ-ఫారం ఇచ్చి వైసీపీ తరఫున రాజ్యసభకు పంపుతారా అనేది ఆసక్తి కలిగిస్తోంది. అదే జరిగితే గౌతమ్‌ అదానీ ఇక వైపీసీ నాయకుడుగా మారిపోతారని అంటున్నారు. ఇంకోవైపు.. వైసీపీలో రాజ్యసభ సీట్లకు పోటీపడే వారి సంఖ్యా భారీగానే ఉంది. జగన్‌కు సన్నిహితుడైన ప్రభుత్వ సలహాదారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తదితరులు రేసులో ఉన్నారని అంటున్నారు.


నేడు హస్తినకు సీఎం

కాగా.. రెండ్రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి శుక్రవారం ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని మోదీతో సమావేశమవుతారు. శనివారం జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సదస్సులో పాల్గొంటారు. ప్రధానితో భేటీలో రాజ్యసభ స్థానాల భర్తీపైనా చర్చిస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2022-04-29T08:45:53+05:30 IST