వైఎస్సార్‌... రైతు బాంధవుడు!

ABN , First Publish Date - 2020-07-09T11:02:45+05:30 IST

దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రైతు బాంధవుడని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీర్తించారు.

వైఎస్సార్‌... రైతు బాంధవుడు!

రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి 

ఘనంగా రాజశేఖర్‌ రెడ్డి జయంతి


(ఆమదాలవలస, జూలై 8): దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రైతు బాంధవుడని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీర్తించారు. రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని.. బుధవారం ఆమదాలవలస బ్రిడ్జి మలుపు వద్ద తమ్మినేని శ్రీరామమూర్తి-ఇందుమతి చారిటబుల్‌ ట్రస్టు ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాజశేఖర్‌రెడ్డి హయాంలో వ్యవసాయ రంగం రెండు అంకెల వృద్ధి రేటు సాధించింది. రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పనిముట్లు అందజేసి సాగుపై ఆసక్తి పెంచేవారు.


పంటలకు గిట్టుబాటు ధర బాగా లభించేది. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చి.. సాగును సస్యశ్యామలం చేశారు. రాష్ట్రంలో 32 లక్షల ఎకరాలు పంపిణీ చేశారు. వీటిలో 26 లక్షల ఎకరాలకు అటవీ హక్కులు, మిగతా భూమికి ఆదివాసీ హక్కులు కల్పించారు. జలయజ్ఞం పేరిట 32లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాలతో అన్ని వర్గాలను ఆదుకున్నారు. అందుకే.. వైఎస్సార్‌ ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించారు’ అని పేర్కొన్నారు. తండ్రిని మించిన తనయుడుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలన కొనసాగుతోందన్నారు. ‘రూ.42 వేల కోట్లు వెచ్చించి..  3.90 కోట్ల మందికి అనేక పథకాలు వర్తింపజేశారు. ఏడాది కాలంలోనే 90 శాతం హామీలు నెరవేర్చారు. సుపరిపాలన అందజేస్తున్న జగన్‌.. 25 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. వంశధార నిర్వాసితులు, తితలీ తుఫాన్‌ బాధితులకు త్వరలోనే నష్ట పరిహారం అందజేస్తామని ప్రకటించారు. 


స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. వైఎస్‌ కుటుంబంతో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ‘వైఎస్సార్‌.. వ్యవసాయాన్ని ఎంతో లాభసాటిగా మార్చారు. అన్నదాత సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ‘రైతు భరోసా’ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెట్టుబడి నిధి కింద ఏడాదికి రూ.13,500 చొప్పున అందజేస్తున్నారు. ‘నవరత్నాలు’లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. జిల్లా విభజన విషయమై.. సిక్కోలు ప్రజల ఆవేదనను ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలియజేశారని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో స్పీకర్‌ పాల్గొంటారా? అని కొందరు ప్రశ్నిస్తుంటారు. కానీ, ‘ప్రాథమికంగా నేను ఎమ్మెల్యేను. తర్వాతే స్పీకర్‌ని. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. స్పీకర్‌గా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటూనే.. శాసనసభలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తా’నని  తెలిపారు. 


మంత్రి కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. ‘తమ్మినేని కుటుంబం వైఎస్‌ఆర్‌ విగ్రహం ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. తండ్రికి తగ్గ తనయుడిగా ఖ్యాతి గడించారని తెలిపారు.  


ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు జిల్లాల విభజనపై స్పందించారు. ‘జిల్లాలో ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలోనూ, పాలకొండ నియోజకవర్గం కొత్తగా ఏర్పాటు చేయనున్న అరకు జిల్లాలో కలిసి పోతుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. ఇలాగే జిల్లా విభజన జరిగితే సిక్కోలులో పరిశ్రమలు, విద్యాసంస్థలు అన్నీ కోల్పోయి.. అభివృద్ధి 80 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మార్చరాదని సూచించారు. జిల్లా విభజనను అందరూ స్వాగతిస్తున్నాం. కానీ, ప్రజల శ్రేయస్సు దిశగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలి. ప్రజా ప్రతిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే విధంగా చొరవ చూపాలి’ అని విజయసాయి రెడ్డిని కోరారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి.. న్యాయం చేస్తామని విజయసాయిరెడ్డి  హామీ ఇచ్చారు.


అనంతరం ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్‌, సీదిరి అప్పలరాజు, కంబాల జోగులుతో పాటు వైసీపీ నాయకులు దువ్వాడ శ్రీను, కిల్లి కృపారాణి, పేడాడ తిలక్‌, పిరియా సాయిరాజ్‌, దానేటి శ్రీధర్‌లు మాట్లాడారు. పాలకొండ ఎమ్మెల్యే కళావతి గిరిజన సమస్యలపై విజయసాయి రెడ్డికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు తమ్మినేని చిరంజీవినాగ్‌, తమ్మినేని వాణి, బి.రమేష్‌, చింతాడ రవికుమార్‌, సువ్వారి గాంధీ, వెంకునాయుడు, జేజే మోహనరావు, జె.వెంకటేశ్వరరావు, తమ్మినేని శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-09T11:02:45+05:30 IST