పెద్దల సభకు కొత్త ముఖాలు!

ABN , First Publish Date - 2022-05-13T07:46:58+05:30 IST

రాజ్యసభ ఎన్నికలకు వేళయింది. ఈసారి మూడు స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా.. ముగ్గురినీ కొత్త వారినే ఎంపిక చేస్తారనే చర్చ టీఆర్‌ఎస్‌ వర్గాల్లో సాగుతోంది. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌ రాజీనామాతో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంటే..

పెద్దల సభకు కొత్త ముఖాలు!

ఒక స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ

మరో రెండు స్థానాల ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

మూడు సీట్లూ ఏకగ్రీవమే.. అదీ టీఆర్‌ఎస్‌కే

వయసురీత్యా లక్ష్మీకాంతరావును కొనసాగిస్తారా!?

రేసులో దామోదర్‌రావు, పార్థసారథిరెడ్డి, పొంగులేటి

నారదాసు, పీఎల్‌ శ్రీనివాస్‌, మోత్కుపల్లి, 

మంద జగన్నాథం, సీతారాం నాయక్‌ పేర్లు కూడా

ప్రకాశ్‌ రాజ్‌కు ఇచ్చే అవకాశం ఉందంటూ చర్చ

హైదరాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభ ఎన్నికలకు వేళయింది. ఈసారి మూడు స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా.. ముగ్గురినీ కొత్త వారినే ఎంపిక చేస్తారనే చర్చ టీఆర్‌ఎస్‌ వర్గాల్లో సాగుతోంది. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌ రాజీనామాతో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంటే.. డి.శ్రీనివాస్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు పదవీ కాలం జూన్‌ 21వ తేదీతో పూర్తవుతోంది. ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అయిన నాడే.. మరో రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాల భర్తీ కోసం ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. ఇప్పటికే ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. రాష్ట్రంలో ఒక రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు సంబంధించి గురువారం నోటిఫికేషన్‌ జారీ కావడమే కాకుండా నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలైంది.


అయినా, తొలి రోజు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. ఉప ఎన్నికకు నామినేషన్ల దాఖలు గడువు ఈనెల 19 వరకు ఉంది. మరోవైపు తాజాగా వెలువడ్డ రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికల నోటిఫికేషన్‌ ఈనెల 24న జారీ కానుంది. శాసన సభ్యుల సంఖ్యా బలం దృష్ట్యా అధికార టీఆర్‌ఎస్‌ ఈ మూడు స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకోవడం లాంఛనమే కానుంది. దాంతో, మూడు స్థానాలకు అభ్యర్థుల పేర్లను పార్టీ అధిష్ఠానం ఒకేసారి ప్రకటించే అవకాశం ఉంది. రాజ్యసభ స్థానం ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలు గడువు ఈనెల 19న ముగుస్తున్న నేపథ్యంలో.. అంతకంటే ఒకరోజు ముందు అంటే, 18న అభ్యర్థుల పేర్ల ప్రకటన వెలువడుతుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అభ్యర్థులకు రెండు, మూడు రోజుల్లోనే సీఎం కేసీఆర్‌ నుంచి సంకేతాలు వెళ్లవచ్చని చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో.. ఈసారి పెద్దల సభకు వెళ్లేది ఎవరనే ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో బండా ప్రకాశ్‌ స్థానంలో మరొకరిని ఎంపిక చేయాల్సిందే. ఇక, డి.శ్రీనివాస్‌ స్థానంలోనూ కొత్త వారికి అవకాశం ఉంటుంది. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడనే కోణంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సిటింగ్‌ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావుకు వరుసగా మూడోసారి అవకాశం ఇస్తారా? అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.


కానీ, వయసు రీత్యా ఆయనకు అవకాశం తక్కువగా ఉందని తెలుస్తోంది. రాజ్యసభకు మొదటి నుంచీ రేసులో ఓసీ సామాజిక వర్గాల నుంచి టీఆర్‌ఎస్‌ దినపత్రిక నమస్తే తెలంగాణ మేనేజింగ్‌ డైరెక్టర్‌, పార్టీ మాజీ కోశాధికారి డి.దామోదర్‌ రావు (వెలమ), హెటిరో డ్రగ్స్‌ అధినేత పార్థసారథిరెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి టీఆర్‌ఎస్‌ విధేయుడు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, హైదరాబాద్‌కు చెందిన మున్నూరు కాపు ముఖ్యుడు పీఎల్‌ శ్రీనివాస్‌ పేర్లు వినిపిస్తున్నాయి.ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ మంద జగన్నాథం, ఎస్టీల నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్‌ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని సీఎం కేసీఆర్‌ ఉవ్విళ్లూరుతున్న నేపథ్యంలో సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌ పేరు కూడా టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభ అభ్యర్థిత్వానికి వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో సీఎం కేసీఆర్‌ను ప్రకాష్‌ రాజ్‌ తరచూ కలుస్తుండటం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. అయితే, ప్రకాష్‌ రాజ్‌ వివాదాస్పదుడనే అభిప్రాయం టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఎక్కువగా ఉంది. తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు పరిణామాలు, సామాజిక సమీకరణాలు సహా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్‌ ఖరారు చేస్తారని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ముఖ్యులు అంచనా వేస్తున్నారు.

Read more