రాజ్యసభలో రచ్చ: విపక్ష సభ్యులపై సస్పెన్షన్‌ వేటు

ABN , First Publish Date - 2020-09-21T15:44:06+05:30 IST

వివాదాస్పద వ్యవసాయ రంగ బిల్లులపై రాజ్యసభలో నిన్న గొడవకు దిగిన కొందరు ప్రతిపక్ష సభ్యులపై...

రాజ్యసభలో రచ్చ: విపక్ష సభ్యులపై సస్పెన్షన్‌ వేటు

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ రంగ బిల్లులపై రాజ్యసభలో రభస సృష్టించిన ప్రతిపక్ష సభ్యులపై చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు సస్పెన్షన్ వేటు వేశారు. ఇవాళ ఉదయం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మొత్తం ఎనిమిది మంది ఎంపీలను వారం రోజుల పాటు సభ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పట్ల విపక్ష సభ్యులు ‘‘అనుచితంగా’’ వ్యవహరించారనీ... దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాననీ చైర్మన్ వెంకయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. డెరెక్ ఓ బ్రైన్, సంజయ్ సింగ్, రాజు సతవ్, కెకె రగేష్, రిపున్ బోరా, డోలా సేన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, ఎలమరన్ కరీం తదితరులు సస్పెన్షన్ వేటు పడిన వారిలో ఉన్నారు. ఆదివారం రాజ్యసభలో వ్యవసాయ రంగ బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సభలో తగిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ.. మూజువాణి ఓటుద్వారా వ్యవసాయ బిల్లులను ఆమోదించుకునేందుకు కేంద్రం ప్రయత్నించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. 

Updated Date - 2020-09-21T15:44:06+05:30 IST