తొలిరోజే విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లిన రాజ్యసభ

ABN , First Publish Date - 2021-07-19T20:30:27+05:30 IST

ర్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే విపక్షాల ఆందోళనలతో ఉభయసభలూ..

తొలిరోజే విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లిన రాజ్యసభ

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే విపక్షాల ఆందోళనలతో ఉభయసభలూ దద్దరిల్లాయి. రాజ్యసభలో చైర్‌పర్సన్ ఎం.వెంకయ్యనాయుడు ప్రసంగిస్తుండగానే సభ్యులు ఆందోళనకు దిగడంతో మధ్యాహ్నం 2 గంటల వరకూ సభను ఆయన వాయిదా వేశారు. సోమవారం మొదలైన సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకూ జరుగుతాయి.


''సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే విపక్ష ఎంపీలు వ్యవహరించిన తీరును మేము ఖండిస్తున్నాం. ఇటు రాజ్యసభ అటు లోక్‌సభలో దురదృష్టకర పరిస్థితిని చూడాల్సి వచ్చింది. చైర్మన్ ప్రసంగిస్తుండగానే విపక్ష ఎంపీలు అడ్డుకున్నారు'' అని పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.


రైతుల నిరసనలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే అంశాలతో సహా పలు అంశాలపై బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ వైఖరిని విపక్షాలు ఎండగట్టే ప్రయత్నం చేశాయి. ద్రవ్యోల్బణం, రైతు అంశాలు, ఇంధన ధరల పెరుగుదలపై చర్చిచేందుకు రాజ్యసభలో బిజినెస్ అవర్ సస్పెన్షన్‌కు కాంగ్రెస్  నోటీసు ఇచ్చింది. ''ద్రవ్యోల్బణం, రైతు అంశాలపై చర్చకు నోటీసు ఇచ్చాం. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ ఆమోదించాల్సి ఉంది. ఇవే అంశాలు సభలో మేము ప్రస్తావిస్తావిస్తాం' అని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. బిజినెస్ అవర్ రద్దు చేసి ఇంధనం, నిత్యావసర ధరల పెరుగుదలపై చర్చించాలని, తక్షణమే ప్రభుత్వం ఉపశమన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌పై 267 నిబంధన కింద కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ నోటీసు ఇచ్చారు.


మరోవైపు, పలువురు విపక్ష నేతలు సైతం రైతుల నిరసనలు, ఇంధనం ధరల పెరుగుదలపై చర్చించాలంటూ నోటీసులు ఇచ్చారు. సీపీఎం ఎంపీ ఇళమరం కరీం, డాక్టర్ వి.శివదేశన్‌లు 267 రూల్ కింద బిజినెస్ అవర్ సస్పెన్షన్ కోరుతూ నోటీసు ఉచ్చారు. డిఎంకే రాజ్యసభ ఎంపీ తిరుచ్చి శివ సైతం ఇదే నిబంధన కింద మేకేదాటు డ్యామ్ అంశంపై చర్చకు నోటీసు ఇచ్చారు.

Updated Date - 2021-07-19T20:30:27+05:30 IST