ఆ ఘనత మోదీకే దక్కుతుంది : రాజ్‌నాథ్ సింగ్

ABN , First Publish Date - 2021-09-03T01:43:20+05:30 IST

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని చూసి

ఆ ఘనత మోదీకే దక్కుతుంది : రాజ్‌నాథ్ సింగ్

కేవడియా : భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని చూసి ఉగ్రవాదులు భయపడుతున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. నరేంద్ర మోదీ 2014లో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఉగ్రవాద దాడి తీవ్ర స్థాయిలో జరగలేదన్నారు. గుజరాత్ బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. 


గుజరాత్‌లోని నర్మద జిల్లా, కేవడియాలో ఆ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. శుక్రవారంతో ముగుస్తాయి. రాజ్‌నాథ్ గురువారం మాట్లాడుతూ, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వాలపై మండిపడ్డారు. కాంగ్రెస్‌కు భారత సైన్యం పట్ల శ్రద్ధ లేదన్నారు. ‘ఒకే ర్యాంకు - ఒకే పింఛను (ఓఆర్ఓపీ)ని 40 ఏళ్ళపాటు ఆ పార్టీ అపరిష్కృతంగా ఉంచిందన్నారు. 


ఉగ్రవాదులను గెలవనివ్వబోమని చెప్పారు. జమ్మూ-కశ్మీరును వదిలిపెడితే, మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత దేశంలోని ఏ ప్రాంతంలోనూ ఉగ్రవాద దాడి తీవ్ర స్థాయిలో జరగలేదన్నారు. ఇది మోదీ ప్రభుత్వ ఘన విజయమని చెప్పారు. బీజేపీ ప్రభుత్వాన్ని చూసి ఉగ్రవాదులు భయపడుతున్నారన్నారు. ఇది చిన్న విషయం కాదన్నారు. తమ అడ్డాల్లో సైతం తమకు రక్షణ లేదని ఉగ్రవాదులు అర్థం చేసుకున్నారన్నారు. ఉరి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో సర్జికల్ స్ట్రైక్స్ చేశామని, దీంతో భారత్ తన భూభాగంలో మాత్రమే కాకుండా అవసరమైతే సరిహద్దులను దాటుకుని ఉగ్రవాదులను మట్టుబెట్టగలదని ప్రపంచానికి సందేశం వెళ్ళిందని చెప్పారు. 


కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఆర్మీ జవాన్ల పట్ల శ్రద్ధ ఉండి ఉంటే, ఓఆర్ఓపీ సమస్య పరిష్కారమై ఉండేదన్నారు. ఇది జవాన్ల 40 ఏళ్ళ డిమాండ్ అన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ ఆ డిమాండ్‌ను పరిష్కరించేందుకు అంగీకరించలేదన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓఆర్ఓపీని వెంటనే అమలు చేసిందన్నారు. దీనిని బట్టి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల మధ్య తేడా తెలుస్తుందన్నారు. 


కాంగ్రెస్ కేవలం మహాత్మా గాంధీ పేరును ఉపయోగించుకుందని, ఆయన మార్గాన్ని అనుసరించడంలో విఫలమైందని అన్నారు. అయోధ్య రామజన్మ భూమిలో రామాలయం నిర్మాణం బీజేపీ నినాదం కాదని, దానికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత మూడు రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ త్యాగం చేసిందన్నారు. 


Updated Date - 2021-09-03T01:43:20+05:30 IST