ఇందిరా గాంధీపై రాజ్‌నాథ్ ప్రశంసలు

ABN , First Publish Date - 2021-10-15T00:49:17+05:30 IST

మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ మన దేశానికి

ఇందిరా గాంధీపై రాజ్‌నాథ్ ప్రశంసలు

న్యూఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ మన దేశానికి అనేక సంవత్సరాలపాటు నాయకత్వం వహించారని, అంతేకాకుండా ఆమె యుద్ధం సమయంలో కూడా దేశాన్ని నడిపించారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం సమయంలో ఆమె నిర్వహించిన పాత్రను గుర్తు చేశారు. సాయుధ దళాల్లో మహిళల పాత్రపై షాంఘై సహకార సంఘం (ఎస్‌సీఓ) సెమినార్లో గురువారం ఆయన మాట్లాడారు. 


దేశాభివృద్ధికి మహిళల శక్తి, సామర్థ్యాలను వినియోగించుకోవడంలో భారత దేశానికి సకారాత్మక అనుభవం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన రాణీ లక్ష్మీబాయి, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ గురించి కూడా ప్రస్తావించారు. సాయుధ దళాల్లో మహిళల పాత్రపై చర్చించడం సమంజసమే అయినప్పటికీ, భద్రత, జాతి నిర్మాణంలో అన్ని దశల్లోనూ వారి విస్తృత సేవలను కూడా గుర్తించాలని, వారిని మరింత బలోపేతం చేయాలని అన్నారు. 


దేశ రక్షణ కోసం మహిళలు ఆయుధాలు ధరించారని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయన్నారు. అటువంటి మహిళల్లో అత్యంత గౌరవనీయురాలు రాణీ లక్ష్మీబాయి అని తెలిపారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ అనేక సంవత్సరాలపాటు దేశాన్ని నడపడమే కాకుండా, ఆమె యుద్ధం సమయంలో కూడా దేశానికి నాయకత్వం వహించారన్నారు. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిందని, ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పడిందని అన్నారు. ఇటీవల ప్రతిభా పాటిల్ భారత రాష్ట్రపతిగా సేవలందించారని, భారతీయ సాయుధ దళాలకు సుప్రీం కమాండర్‌గా వ్యవహరించారని చెప్పారు. 


సరస్వతి దేవి విజ్ఞానం, వివేకం, పాండిత్యాలకు దేవత అని; దుర్గా మాత రక్షణ, బలం, విధ్వంసం, యుద్ధాలకు సంబంధించిన దేవత అని తెలిపారు. సాయుధ దళాల్లో మహిళలకు స్థానం కల్పించిన అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటని తెలిపారు. ఇప్పుడు మహిళలకు పర్మినెంట్ కమిషనింగ్‌కు కూడా అనుమతిస్తున్నట్లు తెలిపారు. సమీప భవిష్యత్తులోనే ఆర్మీ యూనిట్లు, బెటాలియన్లకు కమాండర్లుగా సేవలందించబోతున్నారన్నారు. 


Updated Date - 2021-10-15T00:49:17+05:30 IST