హెలికాప్టర్ ప్రమాదంపై లోక్‌సభలో రాజ్‌నాథ్‌ ప్రకటన

ABN , First Publish Date - 2021-12-09T17:14:16+05:30 IST

హెలికాప్టర్ ప్రమాద ఘటనలో మరణించిన వారికి లోక్‌సభ సంతాపం తెలిపింది.

హెలికాప్టర్ ప్రమాదంపై లోక్‌సభలో రాజ్‌నాథ్‌ ప్రకటన

న్యూఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాద ఘటనలో మరణించిన వారికి లోక్‌సభ సంతాపం తెలిపింది. సభ్యులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం హెలికాప్టర్‌ దుర్ఘటనపై రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ప్రకటన చేశారు. ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారన్నారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించామన్నారు. బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు వెల్లింగ్టన్‌లో హెలికాప్టర్ ల్యాండ్‌ కావాల్సి ఉందని.. అయితే మధ్యాహ్నం 12.08 గంటలకు సుల్లూరు ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయన్నారు.


ఈ ప్రమాదంతో ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు ఆయన సతీమణి మృతి చెందారని రాజ్‌నాథ్‌ వెల్లడించారు. హెలికాప్టర్ కూలిపోవడాన్ని స్థానికులు గమనించారని, భారీ శబ్దం రావడంతో ఘటనా స్థలానికి స్థానికులు చేరుకున్నారన్నారు. గురువారం సాయంత్రానికి మృతదేహాలు ఢిల్లీకి చేరుతాయన్నారు. శుక్రవారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయన్నారు. హెలికాప్టర్‌ ప్రమాదంపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో దర్యాప్తు బృందం బుధవారమే వెల్లింగ్టన్ చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టిందని వెల్లడించారు.

Updated Date - 2021-12-09T17:14:16+05:30 IST