నిపుణుల కమిటీ నిర్ణయం మేరకే...

ABN , First Publish Date - 2022-01-19T16:28:36+05:30 IST

రిపబ్లిక్‌ డే వేడుకలకు శకటాలను ఎంపిక చేసే నిపుణుల కమిటీ నిర్ణయం మేరకు తమిళనాడు శకటానికి అనుమతి నిరాకరించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఆయన ఓ

నిపుణుల కమిటీ నిర్ణయం మేరకే...

                    - శకటానికి అనుమతి నిరాకరణపై స్టాలిన్‌కు రాజ్‌నాథ్‌ సింగ్‌ లేఖ


చెన్నై: రిపబ్లిక్‌ డే వేడుకలకు శకటాలను ఎంపిక చేసే నిపుణుల కమిటీ నిర్ణయం మేరకు తమిళనాడు శకటానికి అనుమతి నిరాకరించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఆయన ఓ లేఖ రాశారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు వావు చిదంబరం, మహాకవి భారతియార్‌, వేలనాచ్చియార్‌, మరుదు సోదరుల ప్రతిమలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శకటాన్ని రూపొందించింది. ఆ శకటం పూర్తిగా రాష్ట్రానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులలే ఉన్నారని, జాతీయ స్థాయిలో పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులు లేరని, పైగా వేలునాచ్చియార్‌ గురించి దేశంలో అధికశాతం మందికి తెలియదని, వావు చిదంబరం వాణిజ్య వేత్త అంటూ నిపుణుల కమిటీ విమర్శించి ఆ శకటాన్ని ఢిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతి నిరాకరించినట్లు సోమవారం వార్తలు వెలువడ్డాయి. ఈ విషయం తెలియగానే ముఖ్య మంత్రి స్టాలిన్‌, డీఎంకే ఎంపీ కనిమొళి సహా పలువురు రాష్ట్ర నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తరఫున రూపొందించిన శకటాన్ని రిపబ్లిక్‌ వేడుకల్లో అనుమతించాలంటూ ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ లేఖ రాశారు. ఈ నేపధ్యంలో స్టాలిన్‌కు బదులిస్తూ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ మంగళవారం ఓ లేఖ రాశారు. రిపబ్లిక్‌డే వేడుకల్లో పాల్గొనేందుకు తమిళనాడు సహా 28 రాష్ట్రాల నుంచి దరఖాస్తులందాయని, వాటిలో తమిళనాడు ప్రభుత్వం రూపొందించనున్న శకటపు నమూనాను నిపుణుల కమిటీ రెండు విడతలుగా జరిపిన పరిశీలనలో ఎంపికైందని, అయితే మూడో విడతలో తమిళ శకటంతోపాటు 12 రాష్ట్రాల శకటాలకు కమిటీ అనుమతిని నిరాకరించిందని ఆ లేఖలో వివరించారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకే రిపబ్లిక్‌ డే వేడుకల శకటాలను ఎంపిక చేయటం జరుగుతందని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా 2017, 2019, 2020, 2021 సంవత్సరాల్లో రిపబ్లిక్‌డే వేడుకల్లో తమిళ శకటాలు పాల్గొన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.


నేతల ఆగ్రహం...

రిపబ్లిక్‌డే వేడుకల్లో తమిళ శకటానికి అనుమతి నిరాకరించడం పట్ల పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌, టీఎన్‌సీసీ అధ్యక్షుడు అళగిరి, అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నాయకురాలు శశికళ, ద్రవిడ కళగం నాయకుడు కే వీరమణి, ఎండీఎంకే నేత వైగో, అన్నా డీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి మాట్లాడి అనుమతిని పొందాలని పన్నీర్‌సెల్వం ఓ ప్రకటనలో సలహా ఇచ్చారు.


Updated Date - 2022-01-19T16:28:36+05:30 IST