రాజీవ్‌గాంధీ హత్యకేసు.. దోషి ఏజీ పెరరివలన్‌కు బెయిల్

ABN , First Publish Date - 2022-03-09T21:48:45+05:30 IST

రాజీవ్‌గాంధీ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషి ఏజీ పెరరివలన్‌కు సుప్రీంకోర్టు నేడు (బుధవారం) బెయిలు ..

రాజీవ్‌గాంధీ హత్యకేసు.. దోషి ఏజీ పెరరివలన్‌కు బెయిల్

న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషి ఏజీ పెరరివలన్‌కు సుప్రీంకోర్టు నేడు (బుధవారం) బెయిలు మంజూరు చేసింది. 30 ఏళ్లుకు పైగా జైలు శిక్ష అనుభవిస్తుండడం, జైలులో అతడి ప్రవర్తనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం బెయిలు మంజూరు చేసింది.


పెరరివలన్ క్షమాభిక్ష పిటిషన్ ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉంది. బెయిలు మంజూరు చేసిన కోర్టు కొన్ని షరతులు కూడా విధించింది. ప్రతి నెల స్థానిక  పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని ఆదేశించింది. అంతేకాదు,  పోలీసులకు చెప్పకుండా స్వగ్రామమైన జోలార్‌పేటై విడిచి వెళ్లరాదని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.  


మల్టీ డిసిప్లినరీ మోనిటరింగ్ ఏజెన్సీ (ఎండీఎంఏ) దర్యాప్తు పూర్తయ్యే వరకు తనకు విధించిన జీవితఖైదును కొట్టివేయాలని కోరుతూ 47 ఏళ్ల పెరరివలన్ పెట్టుకున్న పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం బెయిలు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.


తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ఎన్నికల ర్యాలీకి హాజరైన రాజీవ్‌గాంధీ 21 మే 1991 రాత్రి హత్యకు గురయ్యారు. ధను అనే మహిళ ఆత్మాహుతికి పాల్పడింది. ఈ ఘటనలో రాజీవ్‌గాంధీ సహా 14 మంది మరణించారు. ఆత్మాహుతి దాడిలో మాజీ ప్రధాని చనిపోవడం దేశంలో అదే తొలిసారి. 

Updated Date - 2022-03-09T21:48:45+05:30 IST