Rajinikanth politics: పొలిటికల్ ఎంట్రీపై రజినీకాంత్ తాజా ప్రకటన

ABN , First Publish Date - 2022-08-08T22:57:42+05:30 IST

చెన్నై: రాజకీయాల్లోకి వచ్చే విషయంపై సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా ప్రకటన చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో చెన్నై రాజ్‌భవన్‌లో సమావేశమై బయటకు వచ్చాక ఆయన

Rajinikanth politics: పొలిటికల్ ఎంట్రీపై రజినీకాంత్ తాజా ప్రకటన

చెన్నై: రాజకీయాల్లోకి వచ్చే విషయంపై సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా ప్రకటన చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో చెన్నై రాజ్‌భవన్‌లో సమావేశమై బయటకు వచ్చాక ఆయన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. గవర్నర్‌తో జరిగిన చర్చల్లో రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయని రజినీ చెప్పారు. అయితే తాను రాజకీయాల్లోకి రాబోనని తేల్చి చెప్పేశారు.





తమిళనాడులో కొంత కాలం క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, అంతకు ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ  ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని బాగా ప్రచారం జరిగింది. నిజానికి కొన్నేళ్లుగా సూపర్ స్టార్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు కూడా. అయితే తాను రాజకీయాలకు రాబోనని సూపర్ స్టార్ మరోమారు స్పష్టం చేశారు. 


ఆధ్యాత్మికతకు టాప్ ప్రియారిటీ ఇచ్చి ప్రశాంత జీవనం గడపాలనుకునే రజినీకాంత్‌కు రాజకీయాలు పడవని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానంద స్థాపించిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యుడైన రజినీకాంత్ క్రియాయోగి. పరమహంస యోగానంద పరమగురువైన మహావతార్ బాబాజీ సాధన చేసిన హిమాలయ ప్రాంతాన్ని రజినీకాంత్ తరచూ సందర్శిస్తుంటారు. ధ్యానం చేసుకోవడం, పరమహంస యోగానంద సాహిత్యాన్ని చదువుకోవడం ఆయన ఇష్టమైన వ్యాపకాలు. యోగదా సత్సంగ సొసైటీ ఇటీవల చెన్నైలో నిర్వహించిన సమావేశంలో కూడా రజినీ కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక సినిమాలు చేసినా తనకు నటుడిగా సంతృప్తినిచ్చినవి బాబా, రాఘవేంద్ర సినిమాలని చెప్పారు. నిజమైన సంతృప్తి ధ్యానం చేస్తూ దాన్ని ఆచరణలో పెట్టడంలోనే ఉందని నాటి సభలో చెప్పారు.   


ప్రధానమంత్రి నరేంద్రమోదీకి స్నేహితుడైన రజినీ బీజేపీలో చేరడం కానీ లేదా సొంత పార్టీ స్థాపించి ఆ తర్వాత బీజేపీతో అనుబంధాన్ని కొనసాగిస్తారని అప్పట్లో అనేక కథనాలు వెలువడ్డాయి. 2017లో తాను రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించారు కూడా. అయితే 2020 డిసెంబర్‌లో తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత కోవిడ్ సమయంలో ఆయన అనారోగ్యానికి గురై తిరిగి కోలుకున్నారు. రాజకీయాలకన్నా తనకు ఆధ్యాత్మికమార్గమే నిజమైన సంతృప్తినిస్తోందని రజినీ చెబుతూ ఉంటారు. నిజానికి ఆయన తాను రాజకీయాల్లోకి రాబోవడం లేదని అనేకసార్లు చెప్పినా విలేకరులు మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తుండటం, తాను రాబోవడం లేదని చెబుతుండటం పరిపాటిగా మారింది.   

Updated Date - 2022-08-08T22:57:42+05:30 IST