తలైవా మీరు బాగుంటే చాలు!

ABN , First Publish Date - 2020-11-01T12:37:39+05:30 IST

నిన్న మొన్నటి దాకా ‘తలైవా రాజకీయాల్లోకి రండి’ అంటూ ఆహ్వానించిన తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులు ఉన్నట్టుండి తమ నినాదాన్ని మార్చుకున్నారు. రాజకీయాల్లో రావద్దు... సినిమాల్లోనూ నటించనూ వద్దు’ అంటూ ఆయన అభిమానులంతా రాష్ట్రంలో పలుచోట్ల పోస్టర్లు

తలైవా మీరు బాగుంటే చాలు!

చెన్నై : నిన్న మొన్నటి దాకా ‘తలైవా రాజకీయాల్లోకి రండి’ అంటూ ఆహ్వానించిన తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులు ఉన్నట్టుండి తమ నినాదాన్ని మార్చుకున్నారు. రాజకీయాల్లో రావద్దు... సినిమాల్లోనూ నటించనూ వద్దు’ అంటూ ఆయన అభిమానులంతా రాష్ట్రంలో పలుచోట్ల పోస్టర్లు అతికిస్తున్నారు. ఇటీవల రజనీ పేరుతో సోషల్‌ మీడియాలో ఓ సుదీర్ఘ ప్రకటన విడుదలైన విషయం విదితమే. ఆ ప్రకటనలో రజనీ అనారోగ్య కారణాల వల్ల రాజకీయ పార్టీని ప్రారంభించే యోచనను మానుకున్నారని, దీనికి తోడు వయోభారం వల్ల  కరోనా వైరస్‌ తాకిడి గురైతే కోలుకోవడం కష్టమని, ఈ కారణా ల వల్ల ఇప్పటికిప్పుడు పార్టీ ప్రారంభించలేనని పేర్కొన్నారు. ఆ ప్రకటన జారీ అయిన మరుసటి రోజే రజనీ ఆ ప్రకటనలో తన ఆరో గ్యానికి సంబంధించిన వివరాలన్నీ వాస్తవమేనని, తక్కిన అంశాలు అవాస్తవాలని చెప్పారు. ఇక వైద్యనిపుణుల సలహా మేరకు తాను రాజకీయ పార్టీని ప్రారంభించే యోచనను వాయిదా వేసుకున్నానని ప్రకటించి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. 


ఈ పరిస్థితుల్లో గత రెండు రోజులుగా చెన్నై పోయెస్‌ గార్డెన్‌లో రజనీ ఇంటి వద్ద ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో గుమికూడి ‘తలైవా రాజకీయాల్లోకి రండి... రాష్ట్రానికి మీరే దిక్కు’ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా రాష్ట్ర మంతటా రజనీ అభిమానులు తమకు తోచిన రీతిలో పోస్టర్లు ముద్రించి గోడలపై అతికిస్తున్నారు. రజనీ రాజకీయ ప్రవేశంపై ఆయన అభిమానులంతా రెండు వర్గాలుగా మారారు. ఓ వర్గం రజనీ రాజకీయాల్లో రావాలని ఒత్తిడి చేస్తుండగా, రాజకీయాలకు రాకూడదని, అదే సమయంలో ఇకపై సినిమాలలో నటించకూడదంటూ మరో వార్గం డిమాండ్‌ చేస్తోంది. నాగర్‌కోవిల్‌ పరిసర జిల్లాల్లో రజనీ వీరాభిమానులు రజనీ చేతులెత్తి మొక్కుతున్న ఫొటోలతో పోస్టర్లు ముద్రించి అతికించారు. ఆ పోస్టర్లు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి. ఆ పోస్టర్లలో ‘తలైవా... రాజకీయాల్లో రావద్దు.. ఆధ్యాత్మిక రాజకీయాలు వద్దు...సినిమాల్లోనూ నటించొద్దు. మీ ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటూ వివిధ రకాల నినాదాలు ముద్రించి వున్నాయి. ఆ పోస్టర్లలో ఉన్న నినాదాలను పరిశీలిస్తే అభిమానులంతా రజనీకాంత్‌ను పూర్తిగా ఇంటిపట్టునే విశ్రాంతి తీసుకోమంటూ సలహాలు ఇచ్చేలా ఉన్నాయి.


కరోనా వెళ్లాక రండి... 

మరో వర్గానికి చెందిన రజనీ అభిమాను లు దేశం నుంచి త్వరలో కరోనా వైరస్‌ మాయమవుతుందని, ఆ తర్వాత తప్పకుండా రాజకీయాల్లోకి రావల్సిందేనంటూ పోస్టర్లు అతికించారు. రజనీ మక్కల్‌ మండ్రం మైనారిటీ విభాగం డిప్యూటీ కార్యదర్శి సతీష్‌కుమార్‌, రజనీ మండ్ర నిర్వాహకులు అతికించిన పోస్టర్లలో తమ ఆరాధ్య నటుడు ఆరోగ్యంగా ఉండాలని, కరోనా త్వరగా పారిపోతుందని, ఆ తర్వాత తప్పకుండా రాజకీయ పార్టీని ప్రారంభించాలని సలహా ఇచ్చారు. ఇలా పోస్టర్లను అతికించిన రజనీ అభిమానులు ఆయన ఆరోగ్యం మెరుగుపడాలంటూ నాగర్‌కోవిల్‌లో చర్చిల్లో కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు నిర్వహించారు. ఓ వర్గం రాజకీయాల్లోకి రావద్దని, మరో వర్గం కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గాక ప్రవేశించమని ఒత్తిడి చేస్తున్నాయి. రజనీ చేసిన ప్రకటన వల్లే ఆయన అభిమానులు ప్రస్తుతం రెండు వర్గాలుగా చీలిపోయి తమకు తోచిన రీతిలో రాష్ట్రమంతటా పోస్టర్లను అతికించి తీవ్ర కలకలం సృష్టిస్తున్నారు.

Updated Date - 2020-11-01T12:37:39+05:30 IST