ఎట్టకేలకు రజనీ..

ABN , First Publish Date - 2020-12-04T05:39:03+05:30 IST

మొత్తానికి రజనీకాంత్ ఒక నిశ్చయానికి వచ్చారు. ఆయన రాజకీయపార్టీ పెట్టబోతున్నారు. ఐదునెలల్లో జరగవలసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఎన్నికల్లో అద్భుతాలు సాధిస్తామని, ఆధ్యాత్మిక లౌకికవాదాన్ని అనుసరిస్తామని....

ఎట్టకేలకు రజనీ..

మొత్తానికి రజనీకాంత్ ఒక నిశ్చయానికి వచ్చారు. ఆయన రాజకీయపార్టీ పెట్టబోతున్నారు. ఐదునెలల్లో జరగవలసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఎన్నికల్లో అద్భుతాలు సాధిస్తామని, ఆధ్యాత్మిక లౌకికవాదాన్ని అనుసరిస్తామని, ప్రతిదాన్నీ మార్చేస్తామని ఆయన గురువారం నాడు మొదట ఒక ట్విట్టర్ సందేశంలో ప్రకటించారు. తరువాత విలేఖరులతో మాట్లాడుతూ, తమిళప్రజల కోసం ప్రాణాలైనా అర్పిస్తాను అని, నా గెలుపే ప్రజల గెలుపు అని అన్నారు.


రాజకీయాలలోకి రజనీకాంత్ ప్రవేశం అన్న వ్యక్తీకరణకు ఎంతగా పునరుక్తిదోషం అంటుకున్నదంటే, అది దాని సంచలనశీలతను, శక్తిని కోల్పోయిందనిపిస్తుంది. ఒకటా రెండా ఇప్పటికి పాతికేళ్లు. 1996లో రజనీకాంత్ మొదటిసారిగా రాజకీయ వైఖరి తీసుకున్నారు. అప్పుడు అధికారంలో ఉన్న జయలలితకు వ్యతిరేకంగా డిఎంకెకు మద్దతు ప్రకటించారు. రజనీ ప్రభావం ఎంతో తెలియదు కానీ, ఆ ఎన్నికలలో డిఎంకె ఘనవిజయం సాధించింది. నిజానికి అప్పుడు రజనీకాంత్ ఉచ్చదశలో ఉన్న అగ్రనటుడు. ఇప్పటికీ అత్యధిక మార్కెట్, జనాదరణ ఉన్న సినీనటుడే అయినప్పటికీ, ఒకనాటి ప్రాబల్యం ఇప్పుడు లేదు. ఆయన రాజకీయాలలోకి రావాలని ఆశించినవారిలో అధికులు ఆశలు వదులుకున్నారు. ప్రతి ఎన్నికల ముందూ రజనీ వస్తారేమోనని ఎదురుచూడడం, ఆయన కొన్నిరోజులు ఉత్కంఠలో ఉంచి చివరకు జారుకోవడం జరిగేది.


పదేళ్లుగా రజనీకాంత్ అనారోగ్యంతో ఉంటున్నారు. మూత్రపిండాల సమస్యలతో బాధపడుతూ, చివరకు మార్పిడి శస్త్రచికిత్స కూడా జరిపించుకోవలసి వచ్చింది. ఈ ఏడాది మార్చి 12వ తేదీన రజనీకాంత్ ఒక ప్రకటన చేశారు. రాజకీయ మార్పు కోసం ఉద్యమించాలని, తరువాతి ముఖ్యమంత్రిగా తన పేరు ప్రచారం చేయడం మానేసి తన భావాలను ప్రచారం చేయాలని ఆ ప్రకటనలో కోరారు. అందులో ఆయన అభిమానులకు కొంత ఆశ ధ్వనించింది. కానీ, ఏడు నెలల తరువాత అక్టోబర్ ఆఖరులో తన రాజకీయ ప్రవేశం కష్టమన్నట్టుగా ప్రకటనలు వచ్చాయి. మొదట వెలువడిన ప్రకటనలో రజనీ ఆరోగ్యపరిస్థితి సున్నితమైనదని, కరోనా నేపథ్యంలో వైద్యులు రాజకీయప్రవేశాన్ని కూడదంటున్నారని ఉండగా, మరుసటి రోజున ఆ ప్రకటన తనది కాదని ఖండించిన రజనీ ఆరోగ్యపరిస్థితి వరకు వాస్తవమే అన్నారు. కరోనా ముప్పు అధికంగా ఉన్నవారిలో వయోధికులతో పాటు, మూత్రపిండాల మార్పిడి జరిగిన వారు కూడా ఉన్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినందువల్ల లేదా టీకా రాకడ సమీపంలోనే ఉన్నందున రజనీ ఆలోచనలో మార్పు వచ్చిందేమో తెలియదు.


డిసెంబర్ 31నాడు పూర్తి వివరాలు చెబుతానని, వచ్చే నెలలో రంగంలోకి దిగుతానని చెబుతున్న రజనీకాంత్ తమిళ రాజకీయాలలో తాజాగా ప్రవేశిస్తున్న అగ్రశ్రేణి తార. మరో తమిళ ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఈ పాటికే రాజకీయాలలోకి వచ్చి ఉన్నారు. జయలలిత, కరుణానిధి ఈ ఇద్దరు దిగ్గజాల నిష్క్రమణ తరువాత జరిగే మొదటి ఎన్నికలు కావడం వల్ల, 2021 అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. కరుణానిధి జీవించి ఉండగానే వారసత్వం ఖరారు కావడం వల్ల, రాజకీయాల్లో చాలా కాలంగా ఉంటూ అనుభవం గడించడం వల్ల డిఎంకె పార్టీకి స్టాలిన్ నాయకత్వం స్థిరపడింది. తండ్రి స్థాయి అతనికి ఎట్లాగూ ఉండదు కానీ, ఆ పార్టీలో శూన్యం ఉన్నదని చెప్పలేము. అన్నాడిఎంకెలోనే నాయకత్వ సమస్య లేదా బహునాయకత్వ సమస్య ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఇద్దరూ పాలనలో నెగ్గుకు రాగలుగుతున్నారు కానీ, జనాకర్షణ కలిగినవారు కాదు. జయలలిత సన్నిహితురాలిగా శశికళకు జనాకర్షణ ఉన్నదన్న అభిప్రాయం ఉన్నది. ఆమె నాలుగేళ్ల కారాగారవాసం తరువాత జనవరిలో విడుదల కానున్నారు. జైలు జీవితం ఆమెను ‘దారి’కి తెచ్చిందో లేదో, బయటకు వచ్చాక ఎటువంటి రాజకీయ వైఖరి తీసుకుంటారో తెలియదు. ఈ వాతావరణం మధ్య రజనీకాంత్ రంగప్రవేశం చేస్తున్నారు. ఆయన ప్రకటనను అందరికంటె ముందు ఆహ్వానించిన పార్టీ భారతీయ జనతాపార్టీ కావడం విశేషం. 


దేశంలోని అన్ని ప్రాంతాలను ఏదో రకంగా తమ ఛత్రం కిందికి తీసుకురావడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలు తెలిసినవే. ఆ లక్ష్యసాధనకు ఆ పార్టీ వ్యూహకర్త అమిత్ షా అనుసరించే పద్ధతులు విలక్షణమైనవి. తమకు ప్రతికూలంగా ఉన్న శక్తుల ఓట్లు చీలిపోయేట్టుగా పరిణామాలను నడపడం ఆయన వ్యూహాలలో కీలకమైనది. అకస్మాత్తుగా కొత్త పార్టీలు రంగంలోకి రావడం, పాత పార్టీల మధ్య పొత్తులను భగ్నం చేయడం వంటి మార్గాలను ఆ వ్యూహంలో కనుగొనవచ్చు. అన్నాడిఎంకెలోని రెండు వర్గాలు రెండుగానే ఉంటాయా, వాటిలో ఏదైనా ఒకదానితో రజనీకాంత్ కలసి ప్రయాణిస్తారా, లేదా సొంతంగా అన్ని స్థానాలకు పోటీ చేసి, అన్నాడిఎంకె వ్యతిరేక ఓట్లను చీలుస్తారా? ఇప్పుడు యుపిఎ కూటమిలోనే స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తున్న డిఎంకె, ఒక వేళ గెలిస్తే, దానితో ఎన్నికల అనంతరం స్నేహం చేసే ఆలోచన ఉన్నదా..- ఇవన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలు.


ఎంజీఆర్, ఎన్టీయార్, జయలలిత తరువాత రాజకీయాలలో రాణించిన నటులు ఎక్కడా కనిపించరు. ప్రేమ్‌నజీర్ దగ్గర నుంచి మొదలుకొని, విజయకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, విజయశాంతి- వరకు ఎవరూ ఎన్టీయార్ వంటి ప్రభావశీలతను చూపలేకపోయారు. తన ప్రవేశంతో దిగ్భ్రమను, ఆశ్చర్యాన్ని, సంచలనాన్ని కల్పించే ఆస్కారం లేకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చినందున, రజనీకాంత్ తన ఆకర్షణశక్తిని ఎంత మేరకు నిలుపుకున్నారో సందేహమే.

Updated Date - 2020-12-04T05:39:03+05:30 IST